స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనగానే చాలామంది కేవలం ఆర్థిక గణాంకాలు, కంపెనీల వ్యాల్యుయేషన్లు, వ్యాపార మౌలిక సూత్రాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తారు. కానీ వాస్తవంలో ఇన్వెస్టర్ల మానసిక భావోద్వేగాలు, గత అనుభవాలు కూడా ఈ నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మార్కెట్లపై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులు సైతం తమకు తెలియకుండానే కొన్ని మానసిక పొరపాట్లకు (Behavioural Biases) లోనవుతుంటారు.

మనుషుల మానసిక భావోద్వేగాలు ఆర్థిక నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో 'బిహేవియరల్ ఫైనాన్స్' అధ్యయనం చేస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయాల్లో గందరగోళానికి గురికాకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ఈ మానసిక ధోరణులను గుర్తించడం చాలా అవసరం. ఇన్వెస్టర్లపై ప్రభావం చూపే ఆ 6 మానసిక పొరపాట్లు, వాటిని అధిగమించే మార్గాలు ఇవే:
1. కన్ఫర్మేషన్ బయాస్ (ఉద్దేశపూర్వక నమ్మకం)
కొందరు ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న ఆలోచనకు లేదా నమ్మకానికి మద్దతు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే వెతుక్కుంటారు. దానికి వ్యతిరేకంగా ఉండే హెచ్చరికలను లేదా నష్టభయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఉదాహరణకు, ఒక కంపెనీ షేరును కొనుగోలు చేసిన తర్వాత, ఆ కంపెనీకి సంబంధించిన సానుకూల వార్తలను మాత్రమే గమనిస్తూ, త్రైమాసిక ఫలితాల బలహీనతలు లేదా రంగానికి ఉన్న ప్రతికూలతలను పట్టించుకోరు.
పరిష్కారం: "నా పెట్టుబడి నిర్ణయం తప్పని ನಿరూపించే సమాచారం ఏదైనా ఉందా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అనుకూల, ప్రతికూల అంశాలు రెండింటినీ సమగ్రంగా పరిశీలిస్తేనే సరైన అంచనాకు రాగలరు.
2. హెర్డ్ మెంటాలిటీ (సమూహ మనస్తత్వం)
మిగిలిన అందరూ ఒక షేరును కొంటున్నారు కదా అని తాము కూడా గుడ్డిగా కొనుగోలు చేయడం మరొక పెద్ద పొరపాటు. సోషల్ మీడియా చర్చలు, మార్కెట్ ర్యాలీలు, వేగంగా లాభాలు వస్తాయనే ప్రచారాలు ఈ ధోరణిని పెంచుతాయి.
అయితే ఒక షేరును ఎక్కువ మంది కొంటున్నంత మాత్రాన దానికి నిజమైన విలువ ఉన్నట్లు కాదు. ఇతరుల ఉత్సాహాన్ని చూసి తీసుకునే నిర్ణయాలు మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు తీవ్ర నష్టాలకు దారితీస్తాయి.
{{/usCountry}}అయితే ఒక షేరును ఎక్కువ మంది కొంటున్నంత మాత్రాన దానికి నిజమైన విలువ ఉన్నట్లు కాదు. ఇతరుల ఉత్సాహాన్ని చూసి తీసుకునే నిర్ణయాలు మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు తీవ్ర నష్టాలకు దారితీస్తాయి.
{{/usCountry}}పరిష్కారం: "ఈ షేరు గురించి ఎవరూ మాట్లాడకపోయినా నేను దీనిని కొనుగోలు చేస్తానా?" అని ఆలోచించాలి. కంపెనీ నిజమైన వ్యాపార బలాన్ని, వ్యాల్యుయేషన్లను అర్థం చేసుకోవడం ద్వారా గుంపు ధోరణికి దూరంగా ఉండవచ్చు.
3. లాస్ ఎవర్షన్ (నష్ట భయం)
వచ్చిన లాభం ఇచ్చే సంతోషం కంటే, జరిగిన నష్టం కలిగించే బాధ మానసికంగా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ భయం కారణంగా నష్టాల్లో ఉన్న షేర్లను విక్రయించడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడరు. షేరు అమ్మితే నష్టం నిజమైపోతుందనే ఉద్దేశంతో వాటిని అలానే ఉంచుకుంటారు.
అదే సమయంలో, కొద్దిగా లాభం రాగానే భయంతో మంచి పనితీరు కనబరుస్తున్న షేర్లను త్వరపడి అమ్మేస్తుంటారు. ఈ రెండు నిర్ణయాలు కూడా దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని దెబ్బతీస్తాయి.
పరిష్కారం: కొనుగోలు చేసిన ధరను పక్కన పెట్టి, ప్రస్తుత కంపెనీ పనితీరు, భవిష్యత్తు అవకాశాల ఆధారంగా మాత్రమే షేరును ఉంచుకోవాలా లేదా అమ్మాలా అనేది నిర్ణయించాలి.
4. రీసెన్సీ బయాస్ (ఇటీవలి పరిణామాల ప్రభావం)
దీర్ఘకాలిక డేటాను పక్కన పెట్టి, ఇటీవల జరిగిన మార్కెట్ పరిణామాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని 'రీసెన్సీ బయాస్' అంటారు. మార్కెట్ తీవ్రంగా పెరిగితే విపరీతమైన ఆశావాదాన్ని, హఠాత్తుగా పడిపోతే ఇక ఎప్పటికీ కోలుకోదనే నిరాశను వ్యక్తంచేస్తుంటారు.
మార్కెట్లు ఎప్పుడూ చక్రాల (Cycles) రూపంలో కదులుతాయి. స్వల్పకాలిక హెచ్చుతగ్గులు దీర్ఘకాలిక ఫలితాలను నిర్ణయించలేవు. కంపెనీల బహుళ సంవత్సరాల పనితీరును, మార్కెట్ చరిత్రను పరిశీలించడం వల్ల విశాలమైన దృక్పథం లభిస్తుంది.
5. ఓవర్ కాన్ఫిడెన్స్ (అతి విశ్వాసం)
కొన్ని పెట్టుబడులలో వరుసగా లాభాలు రాగానే, మార్కెట్‌ను ముందుగానే ఊహించగల శక్తి తమకు ఉందనే భావన ఇన్వెస్టర్లలో పెరుగుతుంది. దీనివల్ల పరిమితికి మించిన ట్రేడింగ్ చేయడం, పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచకుండా కొన్ని షేర్లలోనే ఎక్కువ మొత్తం కేటాయించడం, సామర్థ్యానికి మించిన రిస్క్ తీసుకోవడం వంటి పొరపాట్లు జరుగుతాయి.
సొంత సమర్థతకు, అనుకూల మార్కెట్ పరిస్థితులకు ఉన్న తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియో (Diversification) నిర్వహించడం, స్పష్టమైన పరిమితులు విధించుకోవడం ద్వారా రిస్క్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
6. హైండ్‌సైట్ బయాస్
ఏదైనా పరిణామం జరిగిన తర్వాత, "ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు" అని అనుకోవడాన్ని 'హైండ్‌సైట్ బయాస్' అంటారు. మార్కెట్ పతనాన్ని లేదా ర్యాలీని చూసి తమ అంచనా సరైనదేనని భావిస్తారు.
ఇది భవిష్యత్తు అంచనాలపై నిరాధారమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. పెట్టుబడి పెట్టే సమయంలోనే దానికి గల కారణాలను ఒక డైరీలో (Investment Journal) రాసి ఉంచుకుంటే, తదనంతరం మీ ఆలోచనా విధానాన్ని నిష్పాక్షికంగా సమీక్షించుకోవచ్చు.
మెరుగైన పెట్టుబడి అలవాట్లు
పెట్టుబడుల నుంచి భావోద్వేగాలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఎమోషనల్ నిర్ణయాల ప్రభావాన్ని తగ్గించే ఒక నిర్దిష్ట ప్రక్రియను రూపొందించుకోవచ్చు.
స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు, సరైన అసెట్ అలొకేషన్, దీర్ఘకాలిక ఆలోచన, కాలానుగుణ సమీక్షలు పెట్టుబడులకు నిలకడను ఇస్తాయి. మార్కెట్ తీవ్రమైన ఊగిసలాటలో ఉన్నప్పుడు అనవసరమైన గందరగోళాన్ని (Noise) పక్కన పెట్టి, అథెంటిక్ సమాచారాన్ని (Information) మాత్రమే స్వీకరించాలి.
మార్కెట్లో మానసిక ప్రవర్తనలు నిర్ణయాధికారంపై ప్రభావం చూపడం సహజం. అయితే వీటిపై స్పృహ కలిగి ఉండటం వల్ల మేలైన నిర్ణయాలు తీసుకోవచ్చు. పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు ఒక క్షణం ఆగి, ఆ నిర్ణయం ఆధారాల ప్రకారం తీసుకుంటున్నారా లేక భావోద్వేగంతోనా అని ప్రశ్నించుకోవాలి.
వ్యాసకర్త:
శ్రీకాంత్ చౌహాన్,
హెడ్ – ఈక్విటీ రీసెర్చ్, కోటక్ నియో