లాప్‌టాప్ ఇచ్చేందుకు రెండేళ్ల కొడుకుతో ఆఫీస్‌కు.. బెంగళూరు టెకీకి ఎదురైన చేదు అనుభవం
ఉద్యోగం ఊడటంతో కంపెనీ లాప్‌టాప్‌ను తిరిగిచ్చేందుకు తన రెండేళ్ల కుమారుడితో ఆఫీస్‌కు వెళ్లిన బెంగళూరు టెకీకి సెక్యూరిటీ వద్ద ఊహించని నిరాకరణ ఎదురైంది. కార్పొరేట్ కంపెనీల తీరుపై అతడు పంచుకున్న ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, తీవ్ర చర్చకు దారితీసింది.
ఉద్యోగాలు ఊడటం ఒక ఎత్తైతే, ఆ తర్వాత కంపెనీల నుంచి ఎదురయ్యే అనుభవాలు ఉద్యోగులను తీవ్రంగా కలచివేస్తుంటాయి. ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక టెకీకి ఇలాంటి తీవ్ర అసంతృప్తికర అనుభవమే ఎదురైంది. లేఆఫ్‌కు గురైన అతడు, ఆఫీస్ లాప్‌టాప్ తిరిగి ఇచ్చేందుకు తన రెండేళ్ల కుమారుడితో వెళ్లగా, ఆ చిన్నారిని భవనంలోకి అనుమతించలేదు.

సదరు ఉద్యోగి రెడిట్ (Reddit) వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నాడు. భార్య కూడా ఉద్యోగం చేస్తుండటంతో, ఇంట్లో పిల్లాడిని చూసుకునేవారు లేక తప్పనిసరి పరిస్థితుల్లో తన రెండేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు.
సెక్యూరిటీ నిరాకరణ.. కొలీగ్ సాయం
ఆఫీస్ ప్రాంగణానికి చేరుకోగానే పిల్లాడిని లోపలికి రానివ్వమని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు. "ఇది నా చివరి రోజు, కేవలం లాప్‌టాప్ ఇచ్చేసి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను" అని వేడుకున్నా కంపెనీ విజిటర్ పాలసీ నిబంధనల ప్రకారం కుదరదని తేల్చి చెప్పారు.
దిక్కుతోచని స్థితిలో ఒక సహోద్యోగికి ఫోన్ చేసి పిలిపించి, పిల్లాడిని కొద్దిసేపు చూసుకోమని కోరాడు. 5 నిమిషాల్లో పూర్తవుతుందనుకున్న ప్రక్రియకు 15 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో పిల్లాడిని బయట ఉంచి తీవ్ర మనోవేదనకు గురయ్యానని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
కంపెనీలు మన కుటుంబం కావు
ఈ ఘటనపై అతడు స్పందిస్తూ, కంపెనీ నిబంధనలను తప్పుపట్టడం లేదని పేర్కొన్నాడు. అయితే, "కంపెనీకి వ్యాపారమే ముఖ్యం. నీ వ్యక్తిగత పరిస్థితులతో వారికి సంబంధం ఉండదు" అనే కఠిన నిజం తనకు అర్థమైందని రాసుకొచ్చాడు. ఎంతకాలం రాత్రింబవళ్లు కష్టపడినా, కంపెనీని సొంత కుటుంబంలా భావించినా.. చివరికి అది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమేనని గుర్తుచేశాడు. ఉద్యోగం కంటే కుటుంబం, వ్యక్తిగత జీవితమే అత్యంత ముఖ్యమని హితవు పలికాడు.
నెటిజన్ల మద్దతు.. కార్పొరేట్ తీరుపై మండిపాటు
ఈ రెడిట్ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. "నేనైతే బిల్డింగ్ లాబీ నుంచే హెచ్‌ఆర్‌కు ఫోన్ చేసి, బయటకే వచ్చి మీ వస్తువులు తీసుకెళ్లమని చెప్పేవాడిని" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
"మీ ఉద్యోగం పోతే కంపెనీలు మరో క్షణంలో వేరేవారిని తీసుకుంటాయి. కానీ మీ కుటుంబం మిమ్మల్ని రీప్లేస్ చేయలేదు. మీ ఆరోగ్యం, ప్రశాంతతను ఏ కంపెనీ కోసం త్యాగం చేయకండి" అని మరొకరు పేర్కొన్నారు.
"కంపెనీని మీ కుటుంబంగా భావించడం ఇప్పటికైనా ఆపండి. చెప్పిన పని మాత్రమే చేయండి" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
"నేను లేఆఫ్ అయినప్పుడు లాప్‌టాప్‌ను కొరియర్ ద్వారా పంపేశాను. కంపెనీలు ఉద్యోగుల గురించి పట్టించుకోవు, కేవలం తోటి ఉద్యోగులు మాత్రమే మానవీయంగా స్పందిస్తారు" అని మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


