బిట్‌కాయిన్ భారీ పతనం: $80,000 దిగువకు పడిపోయిన ధర.. ఇన్వెస్టర్లలో ఆందోళన
క్రిప్టో మార్కెట్‌లో పెను కుదుపు చోటుచేసుకుంది. బిట్‌కాయిన్ ధర 24 గంటల్లో 6.55% పతనమై $78,566.83కు చేరుకుంది. అమెరికా ఫెడ్ చైర్మన్ మార్పు, కమొడిటీ మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లలో ‘తీవ్ర భయాందోళన’ రేకెత్తించాయి.
క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బిట్‌కాయిన్, ఒక్కసారిగా $80,000 కీలక స్థాయిని కోల్పోయింది. గత 24 గంటల్లో 6.55% మేర క్షీణించిన బిట్‌కాయిన్, ప్రస్తుతం $78,566.83 వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది నవంబర్ 21 తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.
బిట్‌కాయిన్ మార్కెట్ విలువ కూడా $1.56 ట్రిలియన్లకు పడిపోయింది. అయితే, అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ట్రేడింగ్ వాల్యూమ్ మాత్రం 2.2% పెరిగి $71.78 బిలియన్లకు చేరుకుంది. మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతం 18/100 (Extreme Fear) పాయింట్లకు పడిపోవడం మదుపర్ల ఆందోళనకు అద్దం పడుతోంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలేంటి?
కేవలం క్రిప్టో మార్కెట్ మాత్రమే కాకుండా, కమొడిటీ మార్కెట్లు కూడా కుప్పకూలడం బిట్‌కాయిన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. నిన్నమొన్నటి వరకు రికార్డు గరిష్టాల వద్ద ఉన్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. బంగారం ధర ఒకే రోజులో 12% పైగా క్షీణించి $5,000 దిగువకు చేరింది. 1980ల తర్వాత పసిడికి ఇదే అతిపెద్ద రోజువారీ పతనం. వెండి కూడా 36% పడిపోయి చరిత్రలోనే అత్యంత భారీ ఇంట్రాడే క్షీణతను నమోదు చేసింది.
కెవిన్ వార్ష్ నామినేషన్.. క్రిప్టోకు షాక్?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) తదుపరి చైర్మన్‌గా జెరోమ్ పావెల్ స్థానంలో కెవిన్ వార్ష్‌ను అమెరికా అధ్యక్షుడు నామినేట్ చేయడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
“ఫెడ్ చీఫ్‌గా కెవిన్ వార్ష్ బాధ్యతలు చేపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని (Liquidity) భారీగా తగ్గించే అవకాశం ఉంది. ఆయన గతంలో కూడా ఫెడ్ బ్యాలెన్స్ షీట్ పరిమాణాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు” అని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు తక్కువగా ఉండి, మార్కెట్‌లో నగదు లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు క్రిప్టో వంటి ఊహాజనిత (Speculative) ఆస్తులపై పెట్టుబడులు పెరుగుతాయి. అయితే, వార్ష్ రాకతో కఠినతరమైన ఆర్థిక విధానాలు అమల్లోకి వస్తాయనే భయం ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది.
ఇతర క్రిప్టోల పరిస్థితి ఏమిటి?
బిట్‌కాయిన్ పతనంతో పాటు ఇతర ప్రధాన క్రిప్టో కరెన్సీలు కూడా భారీగా నష్టపోయాయి:
- ఇథీరియం (Ethereum): 9.81% తగ్గి $2,434.28 వద్ద ఉంది.
- బైనాన్స్ కాయిన్ (BNB): 8.5% క్షీణించి $780.93 వద్ద కొనసాగుతోంది.
- XRP: 5.22% తగ్గి $1.64 వద్ద ట్రేడవుతోంది.
- స్టేబుల్‌కాయిన్ టెథర్ (Tether): ఇది కూడా స్వల్పంగా 0.06% తగ్గి $0.9990 వద్ద ఉంది.
మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ $3 ట్రిలియన్ల దిగువకు చేరి ప్రస్తుతం $2.66 ట్రిలియన్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో బిట్‌కాయిన్ ఆధిపత్యం (Dominance) 59%గా ఉంది.
(గమనిక: ఈ వార్త కేవలం సమాచార అవగాహన కోసం మాత్రమే. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు తీవ్రమైన మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించి, చట్టపరమైన అంశాలను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


