Bittu Tabahi : ఎనిమిది నెలలు కష్టపడి నదిని శుభ్రం చేశాడు- వారాల్లో మళ్లీ ‘చెత్త’మయం!
మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నదిని ఎనిమిది నెలల పాటు శ్రమించి శుభ్రం చేసిన 20ఏళ్ల యువకుడు బిట్టూ తబాహికి షాక్ ఎదురైంది! ప్రజలను ఆ నదిలో వ్యర్థాలు వేయడం మళ్లీ మొదలుపెట్టారు. ఫలితంగా వారాల వ్యవధిలో అక్కడ మళ్లీ చెత్త పేరుకుపోయింది.
పర్యావరణ పరిరక్షణ కోసం కొందరు మాటలు చెబితే, మరికొందరు చేతల్లో చూపిస్తారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌధరి అలియాస్ 'బిట్టూ తబాహి' రెండో కోవకు చెందిన వ్యక్తి! ఎలాంటి ఆధునిక యంత్రాలు, ప్రభుత్వ సాయం లేకుండా ఒంటరిగానే అజ్నార్ నదిలోని టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తొలగించడానికి ఎనిమిది నెలల పాటు అహర్నిశలు శ్రమించాడు. అయితే, ఇటీవల నదీ తీరానికి వెళ్లిన అతడికి తీవ్ర నిరాశ ఎదురైంది. స్థానికులు మళ్లీ నదిని ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపేయడంతో ఎనిమిది నెలల శ్రమ కొన్ని వారాల్లోనే బూడిదలో పోసిన పన్నీరైంది.

ఈత రాకపోయినా నీటిలోకి దిగి..!
నది మళ్లీ చెత్తమయంగా మారిన దృశ్యాలను బిట్టూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. "ఎనిమిది నెలల నా కష్టం ఇలా వృథా అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు," అని బిట్టూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ దృశ్యం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది! తనకు ఈత రాకపోయినప్పటికీ, ఏమాత్రం భయపడకుండా మళ్లీ నది నీట్లోకి దిగి ప్లాస్టిక్ సంచులను ఏరడం ప్రారంభించాడు. భారీ మొత్తంలో ఉన్న వ్యర్థాలను వేగంగా తొలగించడానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను కోరాడు. అతడి పట్టుదలను చూసి లక్షలాది మంది నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు.
ఒక్క వ్యక్తి శ్రమ మాత్రమే సరిపోదని, ప్రజల్లో బాధ్యతారాహిత్యం మారినప్పుడే నదులు స్వచ్ఛంగా ఉంటాయని ఈ సంఘటన మనకు మరోసారి గుర్తుచేస్తోంది.
బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం..
బిట్టూ తబాహి సేవా కార్యక్రమాలు కేవలం మధ్యప్రదేశ్‌కే పరిమితం కాలేదు. మన దక్షిణ భారతదేశంలోనూ అతడు తన మార్క్ చూపించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని కనకపుర రోడ్డులో ఉన్న తురహళ్లి అటవీ ప్రాంతాన్ని తన 100 మంది వాలంటీర్ల బృందంతో కలిసి శుభ్రం చేసి వార్తల్లో నిలిచాడు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రకు అతడు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు.
అంతర్జాతీయ గుర్తింపు.. గ్లోబల్ ఆఫర్!
బిట్టూ చేస్తున్న ఈ నిరంతర పోరాటం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఆయన ఎక్స్ వేదికగా బిట్టూ వీడియోను షేర్ చేస్తూ అతడి సేవలను కొనియాడారు. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ అతడికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రసిద్ధ డచ్ పర్యావరణ సంస్థ 'ది ఓషన్ క్లీనప్' వ్యవస్థాపకుడు, సీఈఓ బోయన్ స్లాట్ నుంచి బిట్టూకు ఏకంగా ఉద్యోగ ప్రతిపాదన కూడా వచ్చింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


