సంసారంలో గొడవలు సహజం.. ఆత్మహత్యకు ప్రేరేపించారని నిందించలేం: బాంబే హైకోర్టు
భార్యాభర్తల మధ్య గొడవలు సంసారంలో అత్యంత సాధారణమని, కేవలం ఆ కారణంతోనే ఒకరి ఆత్మహత్యకు మరొకరు కారణమయ్యారని నిందించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్త ఆత్మహత్య కేసులో భార్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు కొట్టేసింది.
సంసారంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అత్యంత సహజమని, కేవలం ఈ కారణాల వల్ల జీవిత భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటే దానికి అవతలి వారిదే బాధ్యత అని చెప్పలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్త ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలతో ఓ మహిళపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైవాహిక జీవితంలో గొడవలు రావడం సర్వసాధారణమని, కేవలం మనస్పర్థలు ఉన్నంత మాత్రాన భార్యాభర్తల్లో ఒకరి ఆత్మహత్యకు మరొకరిని బాధ్యులను చేయలేమని జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు బలవంతం చేయడం లేదా నేరుగా ప్రేరేపించడం వంటివి ఉంటేనే అది నేరం అవుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
"ఇలాంటి కేసుల్లో ఒకరి వేధింపుల వల్లే మరొకరు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించలేం" అని కోర్టు వ్యాఖ్యానించింది.
అమరావతి పోలీసులు 2019లో తనపై నమోదు చేసిన ఆత్మహత్య ప్రేరణ కేసును కొట్టేయాలని కోరుతూ 49 ఏళ్ల ఓ ఉపాధ్యాయురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు వేధింపుల ఆరోపణలు చేసుకున్నారని, గరిష్టంగా ఆ మహిళ ప్రవర్తన వల్ల భర్త తీవ్ర నిరాశకు గురై ఉండవచ్చని మాత్రమే భావించగలమని కోర్టు అభిప్రాయపడింది.
"ఇలాంటి విభేదాలు సంసారంలో సాధారణంగా జరిగేవే. నిందితురాలికి దురుద్దేశం ఉందనే విషయాన్ని నిరూపించలేనంత వరకు, భర్త మరణానికి ఆమే కారణమని చెప్పడం సాధ్యం కాదు" అని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే నేరం మోపాలంటే... నిందితుడు ఆ వ్యక్తి మరణంలో ప్రత్యక్ష పాత్ర పోషించారని లేదా బలవన్మరణానికి పురికొల్పారని ప్రాసిక్యూషన్ నిరూపించాల్సి ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని తీవ్రంగా ప్రేరేపించడం లేదా ఉసిగొల్పడం జరగాలని పేర్కొంది.
"ఆత్మహత్య ప్రేరణ నేరం వర్తించాలంటే నిందితుల్లో తప్పు చేయాలనే స్పష్టమైన ఆలోచన లేదా నేరపూరిత ఉద్దేశం ఉండాలి. అవగాహన లేదా ఉద్దేశం లేకుండా ఆత్మహత్య ప్రేరణ నేరం కిందకు రాదు" అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కోపంలో లేదా ఆవేశంలో జీవిత భాగస్వామి అన్న మాటలు ఆత్మహత్య ప్రేరణ కిందకు రావని ధర్మాసనం స్పష్టం చేసింది. చనిపోయే ముందు ఆ వ్యక్తి రాసిన సూసైడ్ నోట్‌లో కూడా ఎక్కడా భార్య వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు పేర్కొనలేదని, పైగా తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని రాశారని కోర్టు గుర్తు చేసింది.
ఇదీ నేపథ్యం
ఈ దంపతులకు 1996 డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే తన భార్య తమను బూతులు తిట్టేదని, భర్తపై దాడి చేసేదని అత్తమామలు ఆరోపించారు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, చెప్పకుండా రోజుల తరబడి బయట తిరిగేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 నవంబర్‌లో తీవ్ర ఒత్తిడికి లోనైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అత్తమామలు పోలీసులను ఆశ్రయించారు. అయితే తనను కూడా భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించారు. వాటన్నింటినీ పరిశీలించిన కోర్టు... కేవలం వైవాహిక కలతల వల్ల జరిగే ఆత్మహత్యలకు భాగస్వామిని బాధ్యులను చేయలేమని కేసు కొట్టేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


