నోబెల్​ శాంతి బహుమతి అందుకున్న ట్రంప్​- ఎలా సాధ్యమైంది? రూల్స్​ ఏం చెబుతున్నాయి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ “నోబెల్​ శాంతి బహుమతి” కల నెరవేరినట్టే కనిపిస్తోంది! వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడో తన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను డోనాల్డ్ ట్రంప్‌నకు అందజేశారు.

Published on: Jan 16, 2026, 07:30:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025లో నోబెల్​ శాంతి బహుమతిని అందుకున్న వెనెజువెలా ప్రతిపక్ష నేత కోరినా మచాడో, ఆ మెడల్​ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కి ఇచ్చారు. ఆ బహుమతిని స్వీకరిస్తున్నట్టు ట్రంప్ సైతం​ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమకు అందిన నోబెల్​ శాంతి బహుమతులను వేరొకరికి ఇవ్వొచ్చా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై నోబెల్​ కమిటీ స్పందించింది.

నోబెల్​ శాంతి బహుమతి అందుకున్న ట్రంప్... (REUTERS)
నోబెల్​ శాంతి బహుమతి అందుకున్న ట్రంప్... (REUTERS)

ట్రంప్​ చేతికి నోబెల్​ శాంతి బహుమతి..

వెనెజువెలా దేశ ప్రతిపక్ష నాయకురాలు, కోరినా మచాడో గురువారం వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ట్రంప్‌నకు బహుకరించారు.

"చరిత్రలో రెండు వందల ఏళ్ల తర్వాత, బొలివర్ వారసులు వాషింగ్టన్ వారసుడికి ఒక పతకాన్ని తిరిగి ఇస్తున్నారు. మా స్వేచ్ఛ కోసం ఆయన చూపిస్తున్న అచంచలమైన నిబద్ధతకు గుర్తింపుగా నా నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ట్రంప్‌కి అందజేస్తున్నాను," అని మచాడో వ్యాఖ్యానించారు.

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మచాడోతో భేటీపై ట్రంప్ స్పందిస్తూ.. "మరియా కోరినా మచాడోను కలవడం నాకెంతో గర్వకారణం. ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న గొప్ప మహిళ. నేను చేసిన కృషికి గుర్తింపుగా ఆమె తన నోబెల్ మెడల్‌ను నాకు బహుమతిగా ఇచ్చారు. పరస్పర గౌరవానికి ఇదొక నిదర్శనం. థాంక్యూ మరియా!" అని ట్రంప్​ తన ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు.

మచాడో ఒత్తిడి చేయడం వల్లే ట్రంప్ ఆ మెడల్‌ను స్వీకరించినట్లు సమాచారం.

అసలు నోబెల్ బహుమతిని వేరొకరికి ఇవ్వొచ్చా?

ఈ బహుమతిని బదిలీ చేయడంపై నోబెల్ కమిటీకి కొన్ని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. నోబెల్ పీస్ సెంటర్ వివరణ ప్రకారం.. కేవలం ఆ బంగారు మెడల్‌ను మాత్రమే ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంది.

గతంలో ఉక్రెయిన్ శరణార్థుల కోసం డిమిత్రి మురాటోవ్ తన మెడల్‌ను వేలంలో అమ్మిన విషయాన్ని కమిటీ గుర్తుచేశారు.

అయితే, నోబెల్ 'టైటిల్' (పురస్కార గ్రహీత హోదా) మాత్రం ఎప్పటికీ మారదు. నార్వేజియన్ నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం.. ఒకసారి బహుమతిని ప్రకటించాక దాని టైటిల్​ని వెనక్కి తీసుకోవడం గానీ, ఇతరులకు బదిలీ చేయడం గానీ సాధ్యం కాదు.

అంటే, ట్రంప్ ఆ మెడల్‌ను మాత్రమే తీసుకోగలరు కానీ, అధికారికంగా నోబెల్ గ్రహీతల లిస్ట్​లో ఆయన పేరు ఉండదు.

రాజకీయ వ్యూహమేనా?

వెనెజువెలా సంక్షోభం, అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ప్రతిపక్ష నేత మచాడోకు ట్రంప్​ గత కొంతకాలంగా మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ కొన్ని రోజుల క్రితం, మదురోను తొలగించిన తర్వాత మచాడోకు ట్రంప్​ షాకిచ్చారు! మచాడోకు కాకుండా, డెల్సీ రోడ్రిగ్జ్​ను తాత్కాలిక అధ్యక్షురాలిగా అనుమతించారు. నిజానికి రోడ్రిగ్జ్ మదురోకు అత్యంత సన్నిహితురాలు.

ఫలితంగా ట్రంప్​ నిర్ణయంతో మచాడో కాస్త పక్కన పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మద్దతును తిరిగి పొందేందుకే మచాడో నోబెల్​ మెడల్​ని ఇచ్చి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రోడ్రిగ్జ్ కొనసాగింపుపై ట్రంప్ అభిప్రాయం ఇంకా మారలేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More