CAT 2026 : అతి త్వరలో క్యాట్ నోటిఫికేషన్! ఐఐఎంల ఎంపిక ప్రక్రియ ఇలా..
CAT 2026 Notification : అతి త్వరలో క్యాట్ 2026 నోటిఫికేషన్ బయటకు రానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఐఐఎంల ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవాల్సిన కీలక విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఎంతగానో ఎదురుచూసే ‘క్యాట్-2026’ (కామన్ అడ్మిషన్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు) త్వరలోనే ఈ అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నాయి. గత ఏడాది జులైలోనే ఈ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో, ఈ సారి కూడా ఈ నెల ఆఖరి వారంలోనే ఇది వెలువడే అవకాశం ఉందని విద్యా వర్గాలు భావిస్తున్నాయి.

దేశంలోని టాప్ ఐఐఎంలలో ఎంబీఏ సీటు సాధించాలన్నా, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో అడుగుపెట్టాలన్నా ఈ క్యాట్ పరీక్షే అత్యంత కీలకమైన మొదటి అడుగు.
క్యాట్ పరీక్షలో సాధించే స్కోరు ఐఐఎం ప్రవేశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కేవలం క్యాట్ స్కోరు మాత్రమే సీటును ఖరారు చేయదని అభ్యర్థులు గమనించాలి. ఈ పరీక్ష ముగిసిన తర్వాత తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఆయా ఐఐఎంలు తమ అధికారిక వెబ్‌సైట్లలో విడివిడిగా ప్రకటిస్తాయి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు నేరుగా ఆయా సంస్థల నుంచే ఇంటర్వ్యూ లేఖలు అందుతాయి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఒక ఐఐఎం అనుసరించే ఎంపిక విధానం లేదా కటాఫ్ మార్కులు, మరో ఐఐఎం నిర్ణయించే నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
ఐఐఎం ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది?
అధికారిక సమాచారం ప్రకారం, క్యాట్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసేందుకు ప్రతి ఐఐఎంకు సొంత నిబంధనలు, అర్హతలు ఉంటాయి. ఒక సంస్థ నిర్ణయాలకు, మరో సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. సాధారణంగా ఈ ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉంటాయి:
రాతపూర్వక నైపుణ్య పరీక్ష : అభ్యర్థుల విశ్లేషణాత్మక ఆలోచనను, వ్యక్తీకరణను పరీక్షించేందుకు వ్యాస రచన వంటివి ఉంటాయి.
గ్రూప్ డిస్కషన్ : సమకాలీన అంశాలపై అభ్యర్థుల నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను అంచనా వేస్తారు.
వ్యక్తిగత ఇంటర్వ్యూ : అభ్యర్థి ఆలోచనా విధానం, మేనేజ్‌మెంట్ రంగానికి వారు ఎంతవరకు సరిపోతారో నిపుణులు నేరుగా అంచనా వేస్తారు.
అభ్యర్థుల గత విద్యా రికార్డులు (టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కులు), వారికి ఉన్న పని అనుభవం, క్లాస్‌రూమ్‌లో అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా అకడమిక్ బహుళత్వం, జెండర్ డైవర్సిటీ (లింగ నిష్పత్తి) వంటి పలు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయిస్తాయి.
ఈ మూల్యాంకన పద్ధతులు, అకాడమిక్ కటాఫ్ మార్కులు, వివిధ పారామీటర్లు ఇచ్చే వెయిటేజీ (ప్రాధాన్యత శాతాలు) ఒక ఐఐఎం నుంచి మరొక ఐఐఎంకు పూర్తిగా మారుతుంటాయి. మెజారిటీ ఐఐఎంలు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల కలయికతోనే అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా, కొన్ని సంస్థలు గ్రూప్ యాక్టివిటీలు లేదా అదనపు పరీక్షలను కూడా నిర్వహిస్తాయి. కోవిడ్ అనంతర కాలంలో చాలా ఐఐఎంలు ఇన్-పర్సన్ ఇంటర్వ్యూలకే ప్రాధాన్యత ఇస్తుండగా, మరికొన్ని సంస్థలు హైబ్రిడ్ ఆప్షన్లను కూడా అభ్యర్థుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచుతున్నాయి. కాబట్టి, విద్యార్థులు క్యాట్ పరీక్షకు సిద్ధమవడంతో పాటు తాము చేరాలనుకుంటున్న ఐఐఎంల ప్రత్యేక నిబంధనలపై కూడా ఒక కన్నేసి ఉంచడం మంచిది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


