చెన్నైలో ప్రముఖ ఫైనాన్స్ యూట్యూబర్ ఆత్మహత్య: సైబర్ వేధింపులే కారణమా?
14 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఒక ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ హరీష్ అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. సెబీ లైసెన్స్ లేదనే నెపంతో సైబర్ వేధింపులకు గురిచేయడం, ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో సుమారు 14 లక్షల మంది (1.4 మిలియన్లు) ఫాలోవర్లతో ప్రజాదరణ పొందిన ఒక ప్రముఖ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు తీసుకున్నారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) సమీపంలోని కానత్తూరులో ఉన్న తన నివాసంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు మంగళవారం రాత్రి పోలీసులు వెల్లడించారు.

సైబర్ వేధింపులు.. సెబీకి ఫిర్యాదు
మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్, వివిధ రకాల పెట్టుబడి మార్గాలపై తమిళంలో అవగాహన కల్పిస్తూ గత ఐదేళ్లుగా ఆయన వీడియోలు రూపొందిస్తున్నారు. అయితే, మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) అనుమతి లేకుండా ఆర్థిక సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొందరు సెబీకి ఫిర్యాదు చేయడమే కాకుండా, తనను తీవ్రంగా ఆన్లైన్ వేధింపులకు గురిచేసినట్లు సదరు యూట్యూబర్ తన చివరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
"గత ఐదేళ్లుగా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. కానీ నా ఎదుగుదలను తట్టుకోలేక కొందరు ఆన్లైన్లో తీవ్రంగా వేధిస్తున్నారు. ముఖ్యమైన నాయకులు, ప్రజాప్రతినిధులు తెలుసంటూ బెదిరింపులకు దిగుతున్నారు" అని ఆయన తన వీడియోలో ఆవేదన చెందారు.
ఖాతా తొలగింపుతో కోలుకోలేని దెబ్బ
ఈ వివాదం నేపథ్యంలో, సెబీ గుర్తింపు లేదనే కారణంతో మెటా సంస్థ ఇటీవల ఆయన ఇన్‌స్టా ఖాతాను తొలగించింది. సుదీర్ఘకాలం శ్రమించి పెంచుకున్న ఫాలోవర్ల నెట్వర్క్, ఆదాయ మార్గం ఒక్కసారిగా కనుమరుగవ్వడం ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. 2025లో ఒక ప్రముఖ సంస్థ నుంచి 'బెస్ట్ ఫైనాన్స్ ఛానెల్' అవార్డును కూడా పొందిన ఈ క్రియేటర్, ఉన్నట్టుండి ప్రాణాలు తీసుకోవడం తమిళ డిజిటల్ మీడియా వర్గాల్లో దిగ్భ్రాంతి నింపింది.
పరస్పర ఆరోపణలు.. పోలీసు విచారణ
జెమూరియా ఐఎన్‌సీ సీఈఓ జేసన్ శామ్యూల్ చేసిన సైబర్ ట్రోలింగ్ వల్లే ఈ ఘోరం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు రాగా, జేసన్ శామ్యూల్ వాటిని తీవ్రంగా ఖండించారు. "నేను ఎవరినీ వేధించలేదు. సెబీ, ఆంఫీ (AMFI) గుర్తింపు లేకుండా ఆర్థిక సలహాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని మాత్రమే ఎత్తిచూపాను. సరైన లైసెన్స్ తీసుకుని మళ్లీ పని ప్రారంభించాలని కోరాను. ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారని అస్సలు ఊహించలేదు" అని శామ్యూల్ వివరణ ఇచ్చారు.
ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కానత్తూరు పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


