China vs India : రూ. 600కే బీఎండబ్ల్యూ రైడ్, అతి తక్కువ ధరకే లగ్జరీ హోటల్- 'చైనా కంటే ఇండియా ఖరీదైనది'
China VS India cost of living : చైనా ఖరీదైన దేశం అనే అపోహను పటాపంచలు చేస్తూ ఒక భారతీయ ట్రావెల్ బ్లాగింగ్ జంట చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. హోటళ్లు, ట్రావెల్, ఆహారం విషయంలో చైనా కంటే భారతే ఖరీదైనదని వారు పేర్కొనడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
చైనా- భారతదేశాల మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని పోలుస్తూ ఒక భారతీయ ట్రావెల్ బ్లాగింగ్ జంట చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పెను చర్చకు దారితీసింది. రూ. 600కే బీఎండబ్ల్యూలో ప్రయాణించినట్టు, రూ. 1800కే లగ్జరీ హోటల్లో బస చేసినట్టు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

“అపోహలన్నీ పటాపంచలు”..
స్వాతి, ప్రతీక్ అనే దంపతులు గతేడాది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నారు. 2025లో భారతదేశం అంతా పర్యటించిన ఈ జంట, 2026లో తమ పొదుపు మొత్తంతో అంతర్జాతీయ పర్యటనలు ప్రారంభించారు. అందులో భాగంగా చైనాను తమ మొదటి గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్ట్‌లో చైనాలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. సాధారణంగా చైనాను చాలా ఖరీదైన దేశంగా భావిస్తారు, కానీ తన అనుభవం మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉందని ఆమె తెలిపారు. "చైనా మేడ్ మీ రియలైజ్ ఇండియా ఈజ్ ఎక్స్‌పెన్సివ్" (చైనా చూశాక భారతే ఖరీదైనదని అర్థమైంది) అంటూ ఆమె మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు:
లగ్జరీ హోటళ్లు: చైనాలో ఒక లగ్జరీ హోటల్ గది కోసం వారు కేవలం రూ. 1,800 మాత్రమే చెల్లించారట. భారతదేశంలోని లగ్జరీ హోటళ్ల ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆమె పేర్కొన్నారు.
ట్యాక్సీ ప్రయాణం: 30 నిమిషాల పాటు ప్రయాణించిన బీఎండబ్ల్యూ రైడ్ కోసం వారికి కేవలం రూ. 600 మాత్రమే ఖర్చయింది.
ఆహారం: కేవలం రూ. 170కే ప్లేట్ నిండా అథెంటిక్ చైనీస్ నూడుల్స్ లభించాయని ఆమె వెల్లడించారు.
"చైనా ఖరీదైనదని టికెట్ బుక్ చేసే ముందు వందల సార్లు విన్నాను. కానీ అక్కడ దిగిన క్షణమే ఆ అపోహలన్నీ తొలగిపోయాయి. చైనా ఖరీదైనది కాదు, అది అవమానకరమైనంత చౌకగా ఉంది" అని స్వాతి తన వీడియోలో పేర్కొన్నారు.
నెటిజన్ల స్పందన..
ఈ వీడియోపై భారతీయ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
"భారతదేశం అనేది ఫస్ట్ వరల్డ్ ధరలు ఉన్న థర్డ్ వరల్డ్ ఎకానమీ," అని ఒకరు సెటైర్ వేశారు.
మరొకరు ఆర్థిక కోణంలో విశ్లేషిస్తూ, "చైనా ఆర్థిక వ్యవస్థ పోటీ ప్రాతిపదికన నడుస్తోంది. కంపెనీలు తక్కువ ధరకే మెరుగైన సేవలు అందించడానికి పోటీపడుతున్నాయి. పైగా అక్కడ ఇన్వెస్టర్ల సొమ్ముతో సబ్సిడీలు అందుతాయి. భారత్‌లో పరిస్థితి అలా ఉండదు," అని రాశారు.
"భారతదేశంలో పన్నులు, క్రమబద్ధీకరించని ధరల వల్ల వస్తువులు ఖరీదైనవిగా ఉన్నాయి," అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
క్యాబ్‌ల నిర్వహణపై స్పందిస్తూ.. "థాయిలాండ్‌లో కూడా మనకంటే మెరుగైన ట్యాక్సీలు ఉన్నాయి. ఇండియాలో ఉబెర్ క్యాబ్‌లు సరిగ్గా శుభ్రం చేయరు, పైగా వాటిలో గుట్కా వాసన వస్తుంది," అంటూ ఒక వినియోగదారుడు ఘాటుగా విమర్శించారు.
వాస్తవానికి ఇండియాలో 'కాస్ట్ ఆఫ్ లివింగ్' గురించి గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్ని పన్నులు కట్టినా మెరుగైన జీవితం దక్కడం లేదని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైరల్ వీడియో, మరోసారి ఈ విషయంపై చర్చకు దారితీసింది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. చైనాలో విదేశీయులు ఇంటర్నెట్- సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తారు?
చైనాలో ‘గ్రేట్ ఫైర్‌వాల్’ కారణంగా గూగుల్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ యాప్‌లు పని చేయవు. అక్కడ నివసించే విదేశీయులు తమ కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి లేదా గూగుల్ సేవలను వాడటానికి సాధారణంగా 'VPN' (Virtual Private Network) ఉపయోగిస్తారు. అయితే, స్థానికంగా కమ్యూనికేషన్ కోసం వీచాట్, సెర్చ్ కోసం బైదు యాప్‌లు తప్పనిసరి.
2. చైనాలో నగదు చెల్లింపులు చెల్లుతాయా? అక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి?
చైనా దాదాపుగా 'క్యాష్‌లెస్ ఎకానమీ'గా మారిపోయింది. వీధి వ్యాపారుల నుంచి పెద్ద మాల్స్ వరకు అందరూ Alipay లేదా WeChat Pay ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ తీసుకుంటారు. విదేశీయులు కూడా తమ వీసా లేదా మాస్టర్ కార్డ్‌లను ఈ యాప్‌లకు లింక్ చేసి వాడుకోవచ్చు. ఫిజికల్ నగదును కొన్ని చోట్ల అంగీకరించినప్పటికీ, డిజిటల్ పేమెంట్స్ లేకపోతే చైనాలో రోజువారీ జీవితం చాలా కష్టమవుతుంది.
3. చైనీస్ భాష (మాండరిన్) తెలియకుండా అక్కడ జీవించడం సాధ్యమేనా?
బీజింగ్, షాంఘై వంటి మెట్రో నగరాల్లో ఇంగ్లీష్ మాట్లాడేవారు కొంతమంది కనిపిస్తారు, కానీ రోజువారీ పనుల కోసం (ట్యాక్సీ బుక్ చేయడం, ఆర్డర్ ఇవ్వడం) మాండరిన్ భాషపై కనీస అవగాహన ఉండటం అవసరం. చాలా మంది విదేశీయులు Pleco వంటి ట్రాన్స్‌లేషన్ యాప్‌లను ఉపయోగిస్తారు. మీరు అక్కడ ఉద్యోగం లేదా చదువు కోసం వెళుతుంటే, ప్రాథమిక మాండరిన్ నేర్చుకోవడం వల్ల అక్కడి సంస్కృతిలో త్వరగా కలిసిపోవచ్చు. ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


