న్యాయ వ్యవస్థను బెదిరించలేరు: రాహుల్ మార్చ్‌పై సుప్రీంకోర్టు సీరియస్

సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్ష నేతలు చేపట్టిన ర్యాలీపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరని సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ స్పష్టం చేశారు. అక్టోబర్ 12నాటి ఘటనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించారు.

Published on: Oct 15, 2026, 14:50:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

"న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు. మేమేమీ మూసి ఉన్న గదుల్లోనో, రాతి మేడల్లోనో కూర్చోవడం లేదు. కోర్టు వెలుపల నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో అన్నీ గమనిస్తున్నాం" అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుకు నిరసనగా అక్టోబర్ 12న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు సుప్రీంకోర్టు వైపు చేపట్టిన 'మార్చ్'పై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

న్యాయ వ్యవస్థను బెదిరించలేరు: రాహుల్ మార్చ్‌పై సుప్రీంకోర్టు సీరియస్
న్యాయ వ్యవస్థను బెదిరించలేరు: రాహుల్ మార్చ్‌పై సుప్రీంకోర్టు సీరియస్

సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంలో చర్యలు కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై నోటీసులు జారీ చేసింది.

కోర్టుల వద్ద నిరసనలపై దాఖలైన పిటిషన్లు

కోర్టు ప్రాంగణాల వద్ద రాజకీయ నిరసనలు, ప్రదర్శనలను నియంత్రించాలని, కోర్టు వైపు ర్యాలీగా వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాలపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని పిటిషన్లలో కోరారు.

కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించాలని ఖర్గే, రాహుల్ గాంధీ కోరినప్పటికీ, ఆ అంశాలు ఇప్పటికే న్యాయస్థానంలో పరిశీలనలో ఉన్నందున సీజేఐ ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చారు. దాంతో అక్టోబర్ 12న 'ఇండియా' కూటమి నేతలు, కార్యకర్తలు సుప్రీంకోర్టు వైపు ప్రదర్శనగా బయలుదేరారు.

'ఎవరూ మమ్మల్ని భయపెట్టలేరు'

విచారణ సమయంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఇటువంటి రాజకీయ ప్రదర్శనల ఒత్తిడిని ఎదుర్కొనాల్సి రావడం ఎంతమాత్రం సరికాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయవాదుల్లో తీవ్ర అసంతృప్తి ఉందంటూ, సుమారు 200 మంది లాయర్లు సంతకం చేసిన వినతిపత్రాన్ని కోర్టుకు సమర్పించారు. ఇటువంటి చర్యలు న్యాయ వ్యవస్థను భయపెట్టే యత్నమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వాదనలపై సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ స్పందించారు. "న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు. ఇలాంటి బెదిరింపు ప్రయత్నాలు చాలా స్వల్పమైనవి. వాటిని ఎవరూ పట్టించుకోరు. కోర్టు వెలుపల ఏం జరుగుతుందో మాకు స్పష్టమైన అవగాహన ఉంది" అని వ్యాఖ్యానించారు.

సీసీటీవీ దృశ్యాలు భద్రపరచాలని ఆదేశం

ప్రదర్శన సందర్భంగా గర్భంతో ఉన్న పాత్రికేయురాలిని తోసివేశారని, ఆనాటి దృశ్యాలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని గౌరవ్ భాటియా కోరారు. స్పందించిన ధర్మాసనం, అక్టోబర్ 12న జరిగిన ఘటనలకు సంబంధించి సేకరించిన సీసీటీవీ దృశ్యాలు లేదా డిజిటల్ ఆధారాలన్నింటినీ భద్రపరచాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.

మరోవైపు ప్రదర్శన సందర్భంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు భారతీ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 163 కింద నాలుగు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేశారు. తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్‌లో రెండు, మందిర్ మార్గ్, బారాఖంబా రోడ్ పోలీసు స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More