హామీలు నెరవేర్చలేదు.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ ర్యాలీకి CJP పిలుపు

జూలై 25న విద్యార్థులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. 

Published on: Aug 24, 2026, 17:46:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి పోరాటానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 5న రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి నూతన ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు సోమవారం తెలిపింది. జూలై 20న నిర్వహించిన 'సన్సద్ చలో' ర్యాలీలో పోలీసుల లాఠీఛార్జ్ బాధితులు, నీట్ (NEET) పరీక్ష రద్దు తీవ్రతతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబ సభ్యులు ఈ మార్చ్‌కు ముందుండి నాయకత్వం వహిస్తారని వెల్లడించింది.

హామీలు నెరవేర్చలేదు.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ ర్యాలీకి CJP పిలుపు (PTI)
హామీలు నెరవేర్చలేదు.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ ర్యాలీకి CJP పిలుపు (PTI)

రాత్రి 2 గంటలకు సమావేశమైన CJP జాతీయ వర్కింగ్ కమిటీ, జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన అభయ పత్రం అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించింది. విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల (FIRs) రద్దు, బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేంద్రం కాలయాపన చేస్తోంది: CJP ఆగ్రహం

"గత నెల రోజులుగా పవిత్రంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం సాంకేతిక కారణాల వెనుక దాక్కుంటూ కాలయాపన చేస్తోంది. సుప్రీంకోర్టు ముందు కూడా స్పష్టమైన భరోసా ఇవ్వడానికి వెనుకాడటం దారుణం" అని CJP తన ప్రకటనలో ధ్వజమెత్తింది.

ఆగస్టు 18న సుప్రీంకోర్టు విచారణ సమయంలో, దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల జాబితాను సమర్పిస్తే వాటన్నింటినీ ఒకేసారి రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి నిరాకరించిందని సిజెపి ఆరోపించింది.

"మా ఓర్పును బలహీనతగా భావించవద్దు. మా మంచి తనాన్ని ప్రభుత్వం ద్రోహం చేయడానికి అవకాశంగా మలుచుకోకూడదు" అని CJP స్పష్టం చేసింది.

‘విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు’

జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మి దేశవ్యాప్త ఆందోళనలను విరమించుకున్నామని, కానీ ప్రభుత్వం ఇప్పుడు ‘విశ్వాసఘాతుకానికి’ ఒడిగట్టిందని CJP నాయకులు విమర్శించారు. అందుకే మళ్లీ రోడ్డెక్కక తప్పడం లేదని తేల్చిచెప్పారు.

"ఒక మొత్తం తరం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నిరసన వేదికల నుంచి ఇళ్లకు పంపిన తర్వాత ప్రభుత్వం తన మాట తప్పడం సరికాదు. ఈ ద్రోహాన్ని మేము ఎంతమాత్రం సహించబోం" అని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 5న ఇండియా గేట్‌కు తరలిరండి

దేశంలోని విద్యార్థులు, యువత, యువజన సంఘాలు సెప్టెంబర్ 5న ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని తమతో కలసి శాంతియుతంగా నడవాలని CJP పిలుపునిచ్చింది.

"యువతకు ఇచ్చిన మాటలకు విలువ ఉంటే, ప్రభుత్వం వెంటనే ఆ హామీలను అక్షరాలా నెరవేర్చాలి" అని సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్, లీగల్ అఫైర్స్ లీడ్ రత్న సింగ్ డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది? (నేపథ్యం)

నీట్-యుజి (NEET-UG) పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 37 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత, జూలై 25న నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆందోళనకారులపై పెట్టిన కేసుల రద్దుతో పాటు, ప్రాణాలు కోల్పోయిన నీట్ బాధితుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ వాగ్దానాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడంతో మళ్లీ ఆందోళన జ్వాలలు రగిలాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More