Pokemon train : వైరల్ అవుతున్న 'పికాచు' ట్రైన్.. జపాన్ వెళ్తే ఈ అదిరిపోయే జర్నీని మిస్ అవ్వకండి!

Pikachu train : జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్‌లో నడిచే ప్రత్యేక 'పికాచు' థీమ్ రైలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా, పిల్లల కోసం ప్లేరూమ్, భారీ బొమ్మలతో నిండిన ఈ 'జాయ్‌ఫుల్ ట్రైన్' విశేషాలు మీకోసం. మరి ఈ రైలులో ప్రయాణించాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 10, 2026 5:58 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Japan Pokemon Train : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ప్రేమికులను, ముఖ్యంగా యానిమీ అభిమానులను ఇప్పుడు ఒక వీడియో విపరీతంగా ఆకర్షిస్తోంది! జపాన్ ప్రధాన ద్వీపమైన 'హొన్షు'కు ఈశాన్య తీరంలో ఉన్న ‘ఇవాటే’ ప్రిఫెక్చర్‌కు ఒక పర్యాటక ఉత్సాహి చేసిన ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పర్యటనలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అక్కడి ప్రసిద్ధ ‘జాయ్‌ఫుల్ ట్రైన్’. ఇది మరేదో కాదు.. క్యూట్ 'పికాచు' థీమ్‌తో ముస్తాబైన అద్భుతమైన పోకేమాన్ రైలు.

జపాన్​లో పికాచు ట్రైన్ ఇలా..
జపాన్​లో పికాచు ట్రైన్ ఇలా..

"నేను ఎట్టకేలకు ఇవాటే చేరుకున్నాను!"

ఇటలీకి చెందిన ప్రముఖ వ్లాగర్ ‘మరి’ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విశేషాలను పంచుకున్నారు. "నేను జపాన్‌లో ఇప్పటివరకు సందర్శించని ఏకైక ప్రాంతం ఇవాటే. అక్కడికి వెళ్లగానే నా ప్రయాణాన్ని పికాచు ట్రైన్‌తో ప్రారంభించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? మీరు పోకేమాన్ అభిమాని అయినా లేదా విభిన్నమైన రైళ్లను ఇష్టపడే వారైనా.. ఇది మీ లైఫ్ టైమ్ బకెట్ లిస్ట్‌లో ఉండాల్సిందే. ఈ రైలు చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, లోపల అంతకంటే అద్భుతంగా ఉంటుంది. ఇదొక కదిలే ఆటస్థలం!" అని ఆమె తన అనుభవాన్ని వివరించారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :

నవ్వులు పూయించే లక్ష్యంతో..

ఈ రైలు వెనుక ఒక గొప్ప మానవీయ కోణం ఉంది. 2011లో జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం తోహోకు ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఆ విపత్తు మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి అక్కడి చిన్న పిల్లలను బయటకు తెచ్చి, వారి ముఖాల్లో నవ్వులు పూయించడం కోసం 2012లో 'POKEMON with YOU' అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ రైలు పట్టాలెక్కింది. ఇప్పుడు మనం చూస్తున్న పసుపు రంగు పికాచు డిజైన్‌ను 2017లో సరికొత్తగా లాంచ్ చేశారు.

ప్రయాణ మార్గం, సౌకర్యాలు..

ఈ రైలు ఉత్తర జపాన్‌లోని తోహోకు రీజియన్‌లో ఉన్న జేఆర్ ఒఫునాటో లైన్​పై నడుస్తుంది. ఇది ఇవాటేలోని ‘ఇచినోసెకి’ స్టేషన్ నుంచి మియాగిలోని ‘కెసెనుమా’ స్టేషన్ వరకు ప్రయాణికులకు కనువిందు చేస్తుంది.

రైలు లోపల ప్రత్యేకతలు..

కమ్యూనికేషన్ సీట్ కార్: కుటుంబం మొత్తం కలిసి కూర్చుని పికాచులతో ముచ్చటించేలా సీట్ల అమరిక ఉంటుంది.

ప్లేరూమ్ కార్: ఇది చిన్నారుల కోసం ప్రత్యేకం. ఇందులో భారీ పరిమాణంలో ఉండే పికాచు బొమ్మలు, పిల్లలు ఆడుకోవడానికి మినీ డ్రైవర్ సీటు, ఫోటోల కోసం అందమైన థీమ్ స్పాట్లు ఉంటాయి.

టికెట్ బుకింగ్ ఇలా..

మీరు కూడా ఈ అనుభూతిని పొందాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి:

రిజర్వేషన్ తప్పనిసరి: ఈ పోకేమాన్ రైలులో ఉన్నవన్నీ రిజర్వ్డ్ సీట్లే. ముందస్తు బుకింగ్ లేకుండా ఎక్కడం సాధ్యం కాదు.

బుకింగ్ విధానం: జేఆర్​ ఈస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా జపాన్‌లోని జేఆర్ టికెట్ ఆఫీసుల (మిడోరి నో మాడోగుచి) వద్ద టికెట్లు తీసుకోవచ్చు.

సమయపాలన: ఇది ప్రతిరోజూ నడవదు. కేవలం సెలవు దినాల్లో, వారాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి ముందే షెడ్యూల్ చెక్ చేసుకోవాలి.

పాస్ సౌకర్యం: విదేశీ పర్యాటకులు 'JR East Pass (Tohoku Area)' ఉపయోగిస్తే అదనపు ఖర్చు లేకుండానే సీట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత స్టేషన్‌లో పేపర్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఉత్తర జపాన్ అందాలను వీక్షిస్తూ, ఈ పోకేమాన్ రైలులో ప్రయాణించడం పర్యాటకులకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More