ఢిల్లీలో భగ్గుమన్న విద్యార్థులు: టియర్ గ్యాస్, లాఠీఛార్జ్ లెక్క చేయకుండా పార్లమెంట్ ముట్టడి

నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు భారీ పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

Published on: Jul 20, 2026, 15:27:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఢిల్లీ వీధులు విద్యార్థుల నినాదాలతో హోరెత్తాయి. నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పటిష్టమైన పోలీసు బందోబస్తు, లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు, నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

ఢిల్లీలో భగ్గుమన్న విద్యార్థులు: టియర్ గ్యాస్, లాఠీఛార్జ్ లెక్క చేయకుండా పార్లమెంట్ ముట్టడి (PTI)
ఢిల్లీలో భగ్గుమన్న విద్యార్థులు: టియర్ గ్యాస్, లాఠీఛార్జ్ లెక్క చేయకుండా పార్లమెంట్ ముట్టడి (PTI)

రణరంగంగా మారిన పార్లమెంట్ స్ట్రీట్

పార్లమెంట్ వీధి వైపు దూసుకుపోతున్న నిరసనకారులను పోలీసులు బహుళ అంచెల బారికేడ్లతో అడ్డుకున్నారు. రాజధాని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పోలీసులు ఎంతగా అణచివేసేందుకు ప్రయత్నించినా వెనకడుగు వేసేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.

"మమ్మల్ని అనేక చోట్ల అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మార్గమంతా భారీ బారికేడ్లు పెట్టారు. లాఠీఛార్జ్ చేశారు, టియర్ గ్యాస్ విసిరారు. అయినా సరే మేము వెనక్కి వెళ్లేది లేదు" అని నిరసనలో పాల్గొన్న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గ్లోరీ తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకే మొగ్గు

వారాలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "విద్యార్థులను పట్టించుకోని దేశం గమ్యం లేనిదవుతుంది" అని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.

"కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే మా ఏకైక డిమాండ్. నెరవేర్చలేని అసాధ్యమైన డిమాండ్లను మేము కోరడం లేదు. ఇంతవరకు వచ్చిన మేము, పోరాటం పూర్తయ్యేంత వరకు విశ్రమించం" అని డీయూ విద్యార్థిని సంస్కృతి కుమార్ స్పష్టం చేశారు.

మూడు వారాలుగా నిరాహార దీక్షలు

ఈ ఆందోళనకు మద్దతుగా 52 ఏళ్ల జామియా మిలియా ఇస్లామియా పూర్వ విద్యార్థిని కనీజ్ ఫాతిమా కూడా నిరసనలో పాల్గొన్నారు. గత మూడు వారాలుగా జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారులకు ఆమె మద్దతు ఇస్తున్నారు.

"ఇది మన దేశం కాదా? పౌరులుగా ప్రశ్నించే హక్కు, అంగీకారం లేని నిర్ణయాలను సవాలు చేసే హక్కు మనకు లేదా? హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ఎందుకు లాఠీఛార్జ్ చేస్తున్నారు?" అని ఫాతిమా ప్రశ్నించారు. ఇది తమకు 'సై లేదా నై' లాంటి ఘట్టమని, ఇప్పటివరకు ఎంతో మంది త్యాగాలు చేశారని, ఇప్పుడు వెనక్కి తగ్గితే మళ్లీ హక్కుల కోసం గళమెత్తలేమని పేర్కొన్నారు.

ఇళ్లల్లో చెప్పకుండా వచ్చి..

పోలీసుల తీరుపై పలువురు యువతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదర్‌పూర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల అన్షిక, స్కూలుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఈ నిరసనలో పాల్గొంది. అయితే పోలీసులు తమ పట్ల నేరస్థుల్లా ప్రవర్తించారని వాపోయింది. చేతిపై ఉన్న గాయాలను చూపుతూ, మహిళా పోలీసులు తనను కిందకు లాగి గట్టిగా పట్టుకున్నారని ఆరోపించింది.

"ఎన్నికలప్పుడు మా ఇళ్లకు వచ్చి ఓట్లు అడుగుతారు, కానీ నీట్ పేపర్ లీక్‌పై చర్చించడానికి మాత్రం ముఖం చాటేస్తారు. మేము కేవలం చర్చను మాత్రమే కోరుతున్నాం. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదా?" అని అన్షిక ప్రశ్నించింది.

ఇక బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన 20 ఏళ్ల కిస్మత్, నిరసన కోసం పాట్నా నుంచి రాత్రికే రాత్రి ప్రయాణమై ఢిల్లీకి చేరుకుంది. ఇంట్లో చెప్తే భద్రత గురించి భయపడతారని, అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చానని పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More