ఎలాన్ మస్క్‌కి 1000000000000 డాలర్ల పే ప్యాకేజ్ అప్పగించిన టెస్లా షేర్హోల్డర్లు..
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చారిత్రాత్మకమైన 1 ట్రిలియన్ డాలర్ పే ప్యాకేజీని టెస్లా వాటాదారులు ఆమోదించారు. కార్పొరేట్ నాయకుడికి మంజూరు చేసిన అతిపెద్ద వేతన ప్యాకేజ్ ఇదే! అయితే దీనిని పొందడానికి మస్క్ టెస్లాలో 12 సవాళ్లను అధిగమించాలి.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి అసాధారణమైన 1 ట్రిలియన్ డాలర్ల (రూ. 8,86,73,35,00,00,000) వేతన ప్యాకేజీని ఆ కంపెనీ వాటాదారులు తాజాగా ఆమోదించారు! ఈ నిర్ణయంతో.. కార్పొరేట్ ప్రపంచ చరిత్రలో అతిపెద్ద పే ప్యాకేజీని అందుకున్న వ్యక్తిగా మస్క్ నిలిచారు.

మస్క్ పే ప్యాకేజ్‌పై నిర్వహించిన ఓటింగ్ ఫలితాన్ని కంపెనీ ఆస్టిన్ ఫ్యాక్టరీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు. టెస్లా అధికారిక ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాల్లో పనిచేస్తున్న తరుణంలో, మస్క్ దీర్ఘకాలిక నిబద్ధతను సుస్థిరం చేయడానికి ఈ పే ప్యాకేజీ అవసరం ఉంది! ఈ ప్రతిపాదనకు వాటాదారుల నుంచి 75 శాతం కంటే ఎక్కువ మద్దతు లభించింది!
ఈ పరిహార ప్రణాళిక.. మస్క్‌ను కనీసం ఏడున్నర సంవత్సరాల పాటు టెస్లాలోనే కొనసాగేలా ఉద్దేశించడం జరిగింది. తాజా పరిణామాలతో ప్రస్తుతం దాదాపు 12 శాతం ఉన్న మస్క్ టెస్లా యాజమాన్యం, దీని ద్వారా 25 శాతం కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఎలాన్ మస్క్‌కి అతిపెద్ద పే ప్యాకేజ్..
వాటాదారుల ఓట్లకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని మస్క్ వ్యాఖ్యానించారు. టెస్లా వృద్ధి సామర్థ్యం దాదాపు అపరిమితమని ఆయన అభివర్ణించారు. అటానమస్ డ్రైవింగ్, ఏఐ లక్ష్యాలను సాధిస్తే, టెస్లా "ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా" మారుతుందని ఆయన గతంలో చెప్పారు. అయినప్పటికీ, తన యాజమాన్య వాటా తనకు కావలసినంత పెరగకపోతే, కంపెనీ దిశపై తన నియంత్రణను సురక్షితం చేసుకోవడానికి తాను టెస్లా నుంచి తప్పుకోవచ్చని లేదా ప్రమేయాన్ని తగ్గించుకోవచ్చని కూడా ఆయన సూచించారు.
టెస్లాలో మస్క్‌ను కొనసాగించడం కంపెనీ భవిష్యత్తుకు చాలా కీలకం అని టెస్లా చైర్ రాబిన్ డెన్‌హోమ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ పే ప్యాకేజీని ఆమోదించాలని వాటాదారులను కోరారు. మస్క్ వెళ్లిపోతే, స్టాక్ గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
అదే సమయంలో.. రాజకీయ వ్యక్తులతో కార్పొరేట్ నాయకులకు ఉన్న సంబంధాలు అమ్మకాలను దెబ్బతీస్తుందనే విమర్శలను బోర్డు కొట్టివేసింది.
గతంలో ఎదురైన సవాళ్లు..
మస్క్ పరిహారం విషయంలో వాటాదారులు చారిత్రకంగా ఆయనకు మద్దతు ఇచ్చారు. ఇందులో 2018లో సుమారు 55.8 బిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీ కూడా ఉంది. అయితే, వాటాదారుల దావాల కారణంగా డెలావేర్ కోర్టు దీన్ని పదేపదే నిలిపివేసింది.
తాజా డెలావేర్ తీర్పు తర్వాత, డెన్‌హోమ్, టెస్లా బోర్డు ఈ సమస్యను పునఃపరిశీలించాయి. మొదట ఆగస్టులో సుమారు 29 బిలియన్ డాలర్ల విలువైన "తాత్కాలిక" పరిహార ప్యాకేజీని ఆమోదించి, ఆపై సెప్టెంబర్‌లో పెద్ద ప్రణాళికను ప్రవేశపెట్టాయి.
టేక్‌డౌన్ గ్రూప్ నిరసన..
అయితే, యాక్టివిస్ట్ గ్రూప్ అయిన టెస్లా టేక్‌డౌన్ ఈ ఫలితాన్ని తీవ్రంగా ఖండించింది. ఇటీవల కంపెనీ వాహనాల అమ్మకాలు తగ్గడాన్ని వారు ప్రస్తావించారు. బుధవారం డౌన్‌టౌన్ ఆస్టిన్‌లో ఈ ప్రణాళికకు వ్యతిరేకతను వ్యక్తం చేసిన ఈ గ్రూప్, "విఫలమైనందుకు ఎలాన్ మస్క్‌కు ఇప్పుడు ఒక ట్రిలియన్ డాలర్లు వచ్చాయి. అమ్మకాలు తగ్గాయి, భద్రతా ప్రమాదాలు పెరిగాయి, ఆయన రాజకీయాలు కస్టమర్లను దూరం చేస్తున్నాయి. ఇది నాయకత్వం కాదు – ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టిసిపేషన్ ట్రోఫీ" అని పేర్కొంది.
మరోవైపు, ఫోర్బ్స్ బిలియనీర్ల ర్యాంకింగ్స్ ప్రకారం.. నికర విలువ 500 బిలియన్ డాలర్లు మించిన మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
పే ప్యాకేజ్ ఎప్పుడు అందుతుంది?
ఈ పే ప్యాకేజీని సంపాదించడానికి, మస్క్ టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు సంబంధించిన 12 మైలురాళ్లను చేరుకోవాలి. టెస్లా విలువ ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న వెంటనే ఈ ప్యాకేజీలో మొదటి భాగం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రణాళికలో 20 మిలియన్ల టెస్లా వాహనాలను డెలివరీ చేయడంతో పాటు నిర్వహణ లాభం, ఉత్పత్తికి సంబంధించిన అనేక పనితీరు లక్ష్యాలు కూడా ఉన్నాయని నివేదిక పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


