ఈపీఎఫ్‌ఓ సర్వీస్ హిస్టరీలో తప్పులా? ఉద్యోగులు వెంటనే చేయాల్సిన తనిఖీలు ఇవే

ఈపీఎఫ్‌ఓ (EPFO) ఆన్‌లైన్ పోర్టల్‌లో కొత్త ఐటీ వ్యవస్థ మార్పుల తర్వాత పలువురు చందాదారుల సర్వీస్ హిస్టరీలో తప్పులు దొర్లినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ, విత్‌డ్రావల్, ఈపీఎస్ పెన్షన్ లెక్కింపులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి సరిదిద్దుకునే మార్గాల వివరాలు ఇక్కడ చూద్దాం.

Published on: Aug 12, 2026, 14:39:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఆన్‌లైన్ పోర్టల్‌లో చేపట్టిన సాంకేతిక వ్యవస్థ మార్పుల తర్వాత అనేకమంది ఉద్యోగుల సర్వీస్ హిస్టరీలో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు కంపెనీలలో పనిచేసిన తేదీలు ఒకేసారి రావడం (Overlapping records), పనిచేసిన కొన్ని కంపెనీల పేర్లు కనిపించకపోవడం లేదా కంపెనీలో చేరిన తేదీలు (Date of Joining) తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈపీఎఫ్‌ఓ సర్వీస్ హిస్టరీలో తప్పులా? ఉద్యోగులు వెంటనే చేయాల్సిన తనిఖీలు ఇవే
ఈపీఎఫ్‌ఓ సర్వీస్ హిస్టరీలో తప్పులా? ఉద్యోగులు వెంటనే చేయాల్సిన తనిఖీలు ఇవే

ఇవి చిన్న పొరపాట్లుగా అనిపించినప్పటికీ, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పీఎఫ్ సొమ్మును బదిలీ (PF Transfer) చేసుకోవడానికి, పీఎఫ్ ముందస్తు విత్‌డ్రావల్‌కు, పెన్షన్ (EPS) కాలపరిమితిని లెక్కించడానికి మరియు కొత్త కంపెనీ నిర్వహించే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV) ప్రక్రియకు తీవ్ర అడ్డంకిగా మారవచ్చు.

ఉద్యోగులు వెంటనే తనిఖీ చేయాల్సిన 4 కీలక అంశాలు

అన్ని పీఎఫ్ ఖాతాలు ఒకే UAN కి అనుసంధానమయ్యాయా?

సార్వత్రిక ఖాతా సంఖ్య (UAN) అనేది ప్రతి ఈపీఎఫ్ సభ్యునికి కేటాయించే 12 అంకెల ప్రత్యేక సంఖ్య. ఒక ఉద్యోగి తన కెరీర్‌లో ఎన్ని కంపెనీలు మారినా యూఏఎన్ ఒక్కటే ఉండాలి.

ఉద్యోగి తన పాత UAN వివరాలను క్రొత్త కంపెనీకి ఇవ్వకపోవడం వల్ల రెండో UAN క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. లేదా పాత యాజమాన్యం ఎగ్జిట్ డేట్ నమోదు చేయకపోవడం వల్ల కూడా సమస్యలు రావచ్చు. ఉమాంగ్ (UMANG) యాప్ లేదా ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో లాగిన్ అయి పాత, కొత్త పీఎఫ్ ఖాతాలన్నీ ఒకే UAN కింద ఉన్నాయో లేదో సరిచూసుకోండి.

చేరిన తేదీ (DOJ), విడుదలైన తేదీ (DOE)లను సరిచూసుకోండి:

మెంబర్ పోర్టల్‌లో కనిపించే జాయినింగ్, ఎగ్జిట్ తేదీలను మీ అపాయింట్‌మెంట్ లెటర్, రిలీవింగ్ లెటర్ లేదా పేస్లిప్స్‌తో పోల్చి చూడండి.

జాయినింగ్ డేట్ తప్పుగా ఉంటే, ఒకే సమయంలో రెండు కంపెనీల్లో పనిచేసినట్లు (Overlapping Service) కనిపిస్తుంది. పాత కంపెనీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ (Date of Exit) అప్‌డేట్ చేయకపోతే ఆ ఉద్యోగం ఇంకా కొనసాగుతున్నట్లే చూపిస్తుంది.

నెలావారీ పీఎఫ్ చందా నమోదు (Monthly Contributions):

మీ ఈపీఎఫ్ పాస్‌బుక్ ఓపెన్ చేసి, మీరు పనిచేసిన ప్రతి నెలా పీఎఫ్ వాటా డిపాజిట్ అయిందో లేదో పరిశీలించండి. ఏదైనా నెల వాటా కనిపించకపోతే అది రిపోర్టింగ్ లోపం లేదా కంపెనీ డిపాజిట్ చేయని సమస్య కావచ్చు.

కేవైసీ (KYC) వివరాల ధృవీకరణ:

మీ పాన్ (PAN), బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు సరిగ్గా వెరిఫై అయ్యాయో లేదో తనిఖీ చేయండి. కేవైసీ వివరాల్లో వ్యత్యాసాలు ఉంటే సర్వీస్ రికార్డులు సరిగ్గా లింక్ కావు.

సర్వీస్ హిస్టరీలో తప్పులు ఉంటే ఏం చేయాలి?

జాయింట్ డిక్లరేషన్ (Joint Declaration):

అక్టోబర్ 1, 2017 కంటే ముందు UAN పొందిన సభ్యులందరూ ఆన్‌లైన్ జాయింట్ డిక్లరేషన్ ద్వారా సవరణల కోసం దరఖాస్తు చేయవచ్చు. దీనికి ప్రస్తుత/పాత కంపెనీ యాజమాన్య ఆమోదం అవసరం.

ఒకవేళ పాత కంపెనీ మూతపడినా లేదా యాజమాన్యం అందుబాటులో లేకపోయినా, అధీకృత అధికారి సంతకంతో పాటు ఆధార పత్రాలను జతచేసి నేరుగా ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయానికి (Regional Office) జాయింట్ డిక్లరేషన్ సమర్పించవచ్చు.

UAN ఆధార్‌తో లింక్ కానప్పుడు లేదా చందాదారుడు మరణించిన తర్వాత క్లెయిమ్ చేస్తున్నట్లయితే, భౌతిక (Physical) జాయింట్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

ఈపీఎఫ్‌ఓ గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు:

ఈపీఎఫ్‌ఓ అధికారిక గ్రీవెన్స్ పోర్టల్ https://epfigms.gov.in/grievance/grievancemaster ద్వారా మీ సమస్యపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

ఫిర్యాదుతో పాటు అపాయింట్‌మెంట్ లెటర్, రిలీవింగ్ లెటర్, పే స్లిప్‌లు, ఫారమ్ 11, ఫారమ్ 16, సరైన తేదీలకు సంబంధించిన ఆధారాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More