టబ్​లో బిల్​ క్లింటన్​, కాంటాక్ట్​ బుక్​లో ట్రంప్​ పేరు- ఎప్​స్టీన్​ ఫైల్స్​ ప్రకంపనలు..

లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్​స్టీన్ కేసు డాక్యుమెంట్లను అమెరికా ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. వీటిల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​ ఫొటోలు ఉన్నాయి.

Published on: Dec 20, 2025, 09:42:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్​స్టీన్​ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) విడుదల చేయడం ప్రారంభించింది. ఈ డాక్యుమెంట్లు ఇప్పుడు అగ్రరాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి!

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​..
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​..

ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో ఎప్​స్టీన్​కు ఉన్న సంబంధాల గురించి ఈ ఫైళ్లు కొత్త విషయాలను బయటపెడుతున్నాయి. అదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​తో ఎప్​స్టీన్​కి ఉన్న సంబంధంపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఎప్​స్టీన్​ ఫైల్స్​- డాక్యుమెంట్లలో ఏమున్నాయి?

తాజాగా బయటకు వచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం:

మాసౌస్ పేర్ల గోప్యత: సుమారు 254 మంది మాసౌస్ పేర్లు ఉన్న ఏడు పేజీలను ప్రభుత్వం పూర్తిగా నల్లటి రంగుతో కప్పేసింది. బాధితుల సమాచారాన్ని కాపాడటానికే ఇలా చేసినట్లు వివరణ ఇచ్చింది.

బిల్ క్లింటన్ ఫోటోలు: గతంలో ఎప్పుడూ చూడని కొన్ని ఫోటోలు కూడా బయటపడ్డాయి. వాటిల్లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఒక హాట్ టబ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఉన్న ఫోటో ఒకటి ఉంది. మరో ఫోటోలో ఎప్​స్టీన్​ మాజీ గర్ల్​ఫ్రెండ్​ గిస్లైన్ మాక్స్‌వెల్‌తో కలిసి క్లింటన్ ఈత కొడుతున్నట్లు కనిపిస్తోంది.

ట్రంప్ పేరు: ఈ ఫైళ్లలో లభించిన ఒక కాంటాక్ట్ బుక్‌లో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది! అయితే ఆ బుక్ ఎవరిది అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ట్రంప్ పై, కాంగ్రెస్ పైనా ఒత్తిడి..

ఒకప్పుడు ఎప్​స్టీన్​కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ట్రంప్, ఈ పత్రాల విడుదలను నిరోధించడానికి తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి, తాను అధికారంలోకి వస్తే ఎప్​స్టీన్​ ఫైళ్లన్నీ బయటపెడతానని గతంలో హామీ ఇచ్చిన ఆయన.. తిరిగి అధ్యక్ష పీఠం ఎక్కాక మాత్రం రివర్స్​ గేర్​ వేశారు! ఈ ఫైళ్లను బయటపెట్టినా పెద్దగా ప్రయోజనం లేదని, ఎప్​స్టీన్​ గురించి మర్చిపోవాలని సలహా ఇచ్చారు. దీనిని ‘డెమొక్రాట్ల కుట్ర’ అని కొట్టిపారేశారు.

ఎప్​స్టీన్​ కేసుల పత్రాలను ఇక బయటపెట్టమని ఎఫ్​బీఐ, జస్టిస్​ డిపార్ట్​మెంట్​ చెప్పడంతో ఈ ఏడాది జులైలో అమెరికాలో భారీ రాజకీయ నిరసనలు ప్రారంభమయ్యాయి.

కాగా ఈ పత్రాల విడుదల వల్ల కొత్తగా ఎవరిపైనా కేసులు నమోదయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో చిచ్చు రేపింది.

అయితే ఈ వ్యవహారంపై తన సొంత పార్టీ (రిపబ్లికన్) నుంచి, కాంగ్రెస్ నుంచి ట్రంప్​ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. ఫలితంగా, డాక్యుమెంట్లను విడుదల చేయాలంటూ గత నెలలో ఆయన ఒక చట్టంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆ చట్టం ప్రకారమే ఈ ఎప్​స్టీన్​ డాక్యుమెంట్లు తాజాగా బహిర్గతం చేస్తున్నారు.

డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మాట్లాడుతూ.. శుక్రవారం కొన్ని లక్షల పత్రాలను విడుదల చేశామని, రాబోయే వారాల్లో మరిన్ని బయటకు వస్తాయని తెలిపారు. అయితే, విచారణలో ఉన్న అంశాలను, బాధితుల పేర్లను మాత్రం గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.

ఎప్​స్టీన్​ కేసులో సగం డాక్యుమెంట్లనే విడుదల చేశారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ గతంలోని చీకటి కోణాలను దాచడానికి జరుగుతున్న ‘కప్పిపుచ్చే ప్రయత్నం’ అని డెమొక్రాట్​ నాయకుడు చక్ షుమర్ మండిపడ్డారు.

ఎప్​స్టీన్​ బాధితులకు న్యాయం జరిగేనా?

2019లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్న ఎప్​స్టీన్​ సాగించిన అరాచకాల్లో గిస్లైన్ మాక్స్‌వెల్ మాత్రమే ఇప్పటివరకు శిక్ష అనుభవించారు. ఈ తాజా పత్రాల విడుదల ద్వారా ఎప్​స్టీన్​ నెట్‌వర్క్ ఎలా పనిచేసింది? ఆయనకు ఎవరెవరు సహకరించారు? ఇన్ని ఏళ్లుగా ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని బాధితులు ఆశిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More