అమెరికాలో 'గ్రీన్​ కార్డ్​ లాటరీ' నిలిపివేత- ట్రంప్​ మరో సంచలనం నిర్ణయం!

అమెరికాలో 'గ్రీన్ కార్డ్ లాటరీ'ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బ్రౌన్​ యూనివర్సిటీ కాల్పుల ఘటన అనంతరం అధ్యక్షుడు ట్రంప్​ చెప్పిన విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

Published on: Dec 19, 2025, 13:05:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో ఎంతో కాలంగా కొనసాగుతున్న 'డైవర్సిటీ వీసా గ్రీన్ కార్డ్ లాటరీ' ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (REUTERS)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (REUTERS)

హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్​సీఐఎస్​)కు ఆమె ఆదేశాలు జారీ చేశారు.

బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనతో లింక్..

ఇటీవల అమెరికాలోని ప్రతిష్టాత్మక 'బ్రౌన్ యూనివర్సిటీ'లో జరిగిన ఘోర కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని 48 ఏళ్ల క్లాడియో నెవెస్ వాలెంటెగా గుర్తించారు. పోర్చుగల్ జాతీయుడైన ఇతడు, ఎంఐటీ ప్రొఫెసర్ నునో లౌరీరో హత్యతో కూడా సంబంధం కలిగి ఉన్నాడని దర్యాప్తులో తేలింది.

లాటరీ ద్వారానే అమెరికాలోకి ప్రవేశం..

అయితే, నిందితుడు వాలెంటె 2017లో ఈ డైవర్సిటీ లాటరీ ప్రోగ్రామ్ (డీవీ1) ద్వారానే అమెరికాలోకి ప్రవేశించి, గ్రీన్ కార్డ్ పొందాడని అధికారులు వెల్లడించారు.

"ఇలాంటి దుర్మార్గులను మన దేశంలోకి అసలు అనుమతించకూడదు. ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ 2017లోనే పోరాడారు," అని క్రిస్టీ నోయెమ్ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

గతంలో న్యూయార్క్‌లో ఎనిమిది మందిని పొట్టనబెట్టుకున్న ఐసిస్ ఉగ్రవాది కూడా ఇదే లాటరీ పథకం ద్వారా అమెరికాలోకి ప్రవేశించాడని ఆమె గుర్తు చేశారు.

  • ఐఐఎం బెంగళూరులో పర్సనల్​ ఫైనాన్స్​ కోర్సు.. సర్టిఫికేట్​ పొందితే అనేక ప్రయోజనాలు! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

నిందితుడు క్లాడియో మృతి..

బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల అనంతరం తప్పించుకున్న క్లాడియో కోసం అమెరికా పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరకు గురువారం నాడు అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం పోలీసులకు కనిపించాడు. క్లాడియో గతంలో (2000-2001లో) బ్రౌన్ యూనివర్సిటీలోనే విద్యార్థిగా ఉన్నాడని సమాచారం!

అసలు ఏంటి ఈ గ్రీన్ కార్డ్ లాటరీ?

అమెరికాకు వలసలు తక్కువగా ఉన్న దేశాల ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ 'డైవర్సిటీ లాటరీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్' (డీవీ1) ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి ఏటా సుమారు 50,000 మందికి గ్రీన్ కార్డులను కేటాయిస్తారు. కేవలం లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి, వారికి అమెరికాలో శాశ్వత నివాసం ఉండే అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.

2025లో వీసా లాటరీకి 20 మిలియన్ల మంది అప్లై చేసుకున్నారు. వీరిలో 1,31,000 వేల మంది ఎంపికయ్యారు.

లాటరీలో గెలిచిన తర్వాతే గ్రీన్​ కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్​ తర్వాత వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కొన్ని అర్హతలు, వెట్టింగ్​ (చెకింగ్​లు) తర్వాత గ్రీన్​ కార్డును ఆమోదిస్తారు లేదా రిజెక్ట్​ రిజెక్ట్​ చేస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More