H-1B, H-4 వీసా అభ్యర్థులకు ఆన్‌లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి

అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 15 నుంచి H-1B, H-4 వీసా అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ కొత్త నిబంధనతో భారతీయులపై పడే ప్రభావం, తాజా పరిణామాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Dec 16, 2025, 17:26:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా వెళ్లాలనుకునే ఐటీ నిపుణులకు, వారి కుటుంబ సభ్యులకు అగ్రరాజ్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. H-1B, H-4 వీసా అభ్యర్థుల కోసం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. డిసెంబర్ 15 నుంచి దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 'ఆన్‌లైన్ ప్రెజెన్స్ రివ్యూ' (Online Presence Review)కు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. అంటే, మీ సోషల్ మీడియా ఖాతాల్లో మీరు చేసే పోస్ట్‌లు, మీ ఆన్‌లైన్ ప్రవర్తనను ఇకపై వీసా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

H-1B, H-4 వీసా అభ్యర్థులకు ఆన్‌లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి
H-1B, H-4 వీసా అభ్యర్థులకు ఆన్‌లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి

నిలిచిపోయిన వీసా ఇంటర్వ్యూలు

ఈ కొత్త నిబంధన అమలు దృష్ట్యా, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 కంటే ముందు షెడ్యూల్ అయిన పలు వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసి, వాటిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు డిసెంబర్ 9నే ప్రకటించింది. దీనివల్ల ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన ఎంతోమంది H-1B హోల్డర్లు ఇక్కడే చిక్కుకుపోయారు. అపాయింట్‌మెంట్‌లు దొరకక, ఎప్పుడు తిరిగి వెళ్తామో తెలియని అనిశ్చితిలో వందలాది మంది టెక్కీలు ఆందోళన చెందుతున్నారు.

అసలేమిటి ఈ 'ఆన్‌లైన్ ప్రెజెన్స్ రివ్యూ'?

గతంలో కేవలం విద్యార్థి వీసాలు (F, M), ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాల (J)కు మాత్రమే ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ పరిమితమై ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు ఇప్పుడు దీనిని H-1B, వారిపై ఆధారపడే H-4 వీసా కేటగిరీలకు కూడా వర్తింపజేస్తున్నారు.

"విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల మాదిరిగానే ఇకపై H-1B ప్రొఫెషనల్స్, వారి కుటుంబ సభ్యుల ఆన్‌లైన్ ప్రొఫైల్స్‌ను కూడా నిశితంగా పరిశీలిస్తాం. డిసెంబర్ 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది" అని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

భద్రతే మా ప్రాధాన్యం: అమెరికా రాయబార కార్యాలయం

ప్రతి వీసా దరఖాస్తును అత్యంత పకడ్బందీగా పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. "అమెరికా భద్రతకు ముప్పు కలిగించే ఏ ఒక్కరికీ వీసా లభించదు. దరఖాస్తుదారుల నేపథ్యం, వారు ఏ ఉద్దేశంతో అమెరికా వస్తున్నారు, వారి గత ప్రవర్తన వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు తగిన సమయం తీసుకుంటాం. అర్హత ఉన్నవారికే వీసాలు మంజూరు చేస్తాం" అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.

టెక్కీల్లో మొదలైన టెన్షన్

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయులకు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో రాజకీయ లేదా వివాదాస్పద పోస్టులు చేసే వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఒక చిన్న పొరపాటు కూడా తమ వీసా రిజెక్షన్‌కు దారితీస్తుందేమోనన్న భయం వారిలో నెలకొంది. మరోవైపు, అపాయింట్‌మెంట్‌ల రద్దు వల్ల ప్రాజెక్టుల పని దెబ్బతింటుందని కంపెనీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More