పరీక్షలు జరుగుతుండగా.. అమెరికా యూనివర్సిటీలో కాల్పుల మోత- ఇద్దరు మృతి!
అమెరికాలోని ఓ యూనివర్సిటీలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలం వద్ద షూటర్ ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టు యూనివర్సిటీ హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా రోడ్ ఐలాండ్‌లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

పరీక్షల సమయంలో కాల్పులు..
యూనివర్సిటీ ప్రొవోస్ట్ (సీనియర్ అధికారి) ఫ్రాంక్ డోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం) ఇంజనీరింగ్ భవనంలో ఫైనల్ పరీక్షలు జరుగుతుండగా, గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన వెంటనే యూనివర్సిటీ క్యాంపస్ యాక్టివ్ షూటర్ అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.
"తలుపులు లాక్ చేయండి, ఫోన్‌లు సైలెంట్‌గా ఉంచండి. తదుపరి నోటీసు వచ్చే వరకు దాక్కోండి. గుర్తుంచుకోండి: మీరు ప్రమాదంలో ఉన్న ప్రాంతంలో ఉంటే, సురక్షితంగా బయటపడగలిగితే పారిపోండి; ఖాళీ చేయడం సాధ్యం కాకపోతే, దాక్కోండి; చివరి ప్రయత్నంగా, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చర్య తీసుకోండి, పోరాడండి," అని బ్రౌన్ యూనివర్సిటీ హెచ్చరించింది.
పలు లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటోందని, వారంతా ఘటనా స్థలంలో ఉన్నారని, అలాగే అత్యవసర వైద్య బృందం కూడా ఆ ప్రాంతంలో ఉందని యూనివర్సిటీ తెలిపింది.
ఆ తర్వాత, గవర్నర్ స్ట్రీట్ సమీపంలో కాల్పులు జరిగాయని నివేదికలు వచ్చాయని బ్రౌన్ యూనివర్సిటీ పేర్కొంది. ఆ కాల్పులకు కూడా పోలీసులు స్పందించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:52 గంటలకు జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌లో, పరిస్థితి ఇంకా తీవ్రంగా కొనసాగుతోందని, విద్యార్థులు, సిబ్బంది ‘షెల్టర్ ఇన్ ప్లేస్’ (సురక్షితంగా ఉన్న చోటే ఉండటం) కొనసాగించాలని కోరింది.
బాధితుల పరిస్థితి, కాల్పుల ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు తక్షణమే ఎలాంటి వివరాలు విడుదల చేయలేదు. అయితే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, తమ ఏజెన్సీ సిబ్బంది ఘటనాస్థలంలో ఉన్నారని, దర్యాప్తుకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తారని పేర్కొన్నారు.
"ప్రమాదంలో చిక్కుకున్న వారందరి కోసం ప్రార్థించండి. మాకు మరింత సమాచారం అందిన వెంటనే అప్‌డేట్ చేస్తాము," అని పటేల్ తెలిపారు.
ఈ కాల్పుల ఘటన యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగానికి ఆశ్రయం కల్పించే బారస్ అండ్ హోలీ భవనం సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఏడు అంతస్తుల భవనంలో 100కు పైగా ప్రయోగశాలలు, డజన్ల కొద్దీ తరగతి గదులు, కార్యాలయాలు ఉన్నాయి.
నిందితుల కోసం గాలింపు..
యూనివర్సిటీ మొదట్లో తమ అత్యవసర నోటిఫికేషన్ వ్యవస్థ ద్వారా, ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు విద్యార్థులు, సిబ్బందికి తెలియజేసింది. అయితే, ఆ తర్వాత అది నిజం కాదని, పోలీసులు ఇప్పటికీ నిందితుడు లేదా నిందితుల కోసం గాలిస్తున్నారని పేర్కొంటూ సమాచారాన్ని అప్డేట్ చేశారు.
ట్రంప్‌పై విమర్శలు..
మరోవైపు, బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నారని మొదట ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. కానీ కాసేపటికే, నిందితులను ఎవరినీ పట్టుకోలేదని మరొక పోస్ట్‌లో పేర్కొన్నారు.
"రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల గురించి నాకు సమాచారం అందింది. ఎఫ్‌బీఐ సిబ్బంది ఘటనాస్థలంలో ఉన్నారు. నిందితుడు అదుపులో ఉన్నాడు. బాధితులు, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి!"
కొద్దిసేపటి తర్వాత, ట్రంప్ మరో పోస్ట్‌లో ఈ విధంగా తెలియజేశారు:
“బ్రౌన్ యూనివర్సిటీ పోలీసులు తమ మునుపటి ప్రకటనను వెనక్కి తీసుకున్నారు – నిందితుడు అదుపులో లేడు.”
ట్రంప్ చేసిన ఈ పోస్టులు 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో విమర్శలకు దారితీశాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ, "ట్రంప్‌కి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇది ప్రమాదకరం. బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు," అని రాశారు. మరొకరు "ఆయన చాలా తెలివితక్కువవాడు," అని కామెంట్ చేశారు.
"బ్రౌన్ యూనివర్సిటీ ఎలాంటి ప్రకటననూ వెనక్కి తీసుకోలేదు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని వారు ఎప్పుడూ చెప్పలేదు. కేవలం అధ్యక్షుడే అలా చెప్పారు," అని ఆరోపించారు.
అయితే, కొంతమంది యూజర్లు ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. పోలీసుల ప్రకటన మారగానే ట్రంప్ వెంటనే రెండవ పోస్ట్ చేశారని వారు వాదించారు. "ఆయన చేసిన తదుపరి పోస్ట్‌ను చదవండి, తప్పుడు సమాచారం పోస్ట్ చేయడం ఆపండి," అని ఒక యూజర్ రాశారు. "ఆయన వెంటనే తప్పును సరిదిద్దుతూ ఒక ప్రకటన విడుదల చేశారు," అని మరొకరు మద్దతు పలికారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


