ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ షేర్ల సునామీ: రూ.433 కోట్లకు చేరిన ఆశిష్ కచోలియా సంపద
స్టాక్ మార్కెట్లో ఇటీవల లిస్ట్ అయిన ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ షేర్లు ఐపీఓ ధర నుంచి ఏకంగా 290 శాతం ర్యాలీ చేశాయి. దీంతో కంపెనీలో ముందస్తుగా పెట్టుబడులు పెట్టిన ప్రముఖ ఇన్వెస్టర్లు ఆశిష్ కచోలియా, ముకుల్ అగర్వాల్‌లకు అపారమైన లాభాలు దక్కాయి.
ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ఆరంభం నుంచే రికార్డు స్థాయి పరుగులతో దూసుకెళ్తున్న ఈ షేరు, పాత ఇన్వెస్టర్ల సంపదను ఊహించని రీతిలో పెంచింది. దేశీయ రంగానికి చెందిన ప్రముఖ ఇన్వెస్టర్లు ఆశిష్ కచోలియా, ముకుల్ మహావీర్ అగర్వాల్ పెట్టిన పెట్టుబడుల విలువ ఆకాశాన్ని తాకింది. ఐపీఓ ప్రారంభ ధరతో పోలిస్తే ఈ షేరు విలువ ఏకంగా 290 శాతం పెరిగింది.

నలుగు రెట్లు పెరిగిన ఆశిష్ కచోలియా సంపద
ట్రెండ్‌లైన్ వివరాల ప్రకారం ఆశిష్ కచోలియాకు ఈఎస్‌డీఎస్ కంపెనీలో 2.05 శాతం వాటా ఉండగా, ముకుల్ మహావీర్ అగర్వాల్‌కు 6 శాతం వాటా ఉంది. ఐపీఓకి రాకముందే ఈ ఇద్దరు దిగ్గజాలు కంపెనీలో పెట్టుబడులు పెట్టడం విశేషం. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) సమాచారం ప్రకారం 2024 అక్టోబర్‌లో, అంటే ఐపీఓ కంటే రెండేళ్ల ముందే ఆశిష్ కచోలియా ఇందులో పెట్టుబడి పెట్టారు.
ఐపీఓ గరిష్ఠ ధర రూ.429 వద్ద కచోలియా వాటా విలువ రూ.103 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ షేరు ఐపీఓ ధర కంటే 290 శాతం పైగా పెరిగి రూ.1,672.50 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో ఆయన వాటా విలువ ఇప్పుడు ఏకంగా రూ.433 కోట్లకు చేరింది. అంటే ఆయన పెట్టిన పెట్టుబడి విలువ నాలుగు రెట్లకు పైగా వృద్ధి చెందింది.
ముకుల్ అగర్వాల్ వాటా విలువ రూ.1,176 కోట్లు
మరో దిగ్గజ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ కూడా ఈ ఐపీఓ ద్వారా బంపర్ లాభాలను అందుకున్నారు. ఐపీఓకి ముందు ఆయన వద్ద 70.3 లక్షల షేర్లు ఉండగా, అది కంపెనీలో 7 శాతం వాటాకు సమానం. ఐపీఓ ఇష్యూ ముగిసే సమయానికి ఆయన హోల్డింగ్ విలువ రూ.302 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ షేరు రికార్డు స్థాయికి చేరడంతో ఆయన వాటా విలువ రూ.1,176 కోట్లకు ఎగబాకింది.
దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ
ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ 2026 సెప్టెంబర్ 4న భారత స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఐపీఓ ఆఫర్ ధరతో పోలిస్తే 76.45 శాతం ప్రీమియంతో రూ.757 వద్ద బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయింది. మొదటి రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర రూ.908.40 కి చేరింది.
ఆ తర్వాత వరుసగా పలు సెషన్లలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌లను తాకుతూ ఈ షేరు గరిష్ఠంగా రూ.1,827 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో విస్తృత మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఈ షేరు మాత్రం రికార్డు ర్యాలీతో దూసుకెళ్లింది. కంపెనీ రూ.720 కోట్ల విలువైన ఐపీఓను పూర్తిగా కొత్త షేర్ల (ఫ్రెష్ ఇష్యూ) రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐపీఓ ధరల బ్యాండ్‌ను రూ.408–429గా నిర్ణయించారు.
కంపెనీ నేపథ్యం
2005లో ప్రారంభమైన ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ క్లౌడ్ కంప్యూటింగ్, మేనేజ్డ్ సర్వీసెస్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ విభాగాల్లో సేవలు అందిస్తోంది. భారత్‌లోని క్లౌడ్ సేవల రంగంలో తొలి తరం కంపెనీలలో ఇది ఒకటి.
2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI), ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యాపార సంస్థలతో కలిపి దాదాపు 2,500 మందికి పైగా క్లయింట్లకు సేవలు అందించింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


