ఐఏఎస్ ఉద్యోగానికి గుడ్‌బై.. రాజకీయాల్లోకి దివ్యా మిట్టల్: బ్యూరోక్రాట్ల సరికొత్త దారి

యూపీ కేడర్‌ 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేసి రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో పాలనా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చిన పలువురు ప్రముఖ బ్యూరోక్రాట్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

Published on: Sep 30, 2026, 15:07:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పరిపాలనా వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించిన సివిల్ సర్వెంట్లు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడం మన దేశంలో కొత్తేమీ కాదు. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ చేరారు. 13 ఏళ్ల సర్వీస్ తర్వాత ఆగస్టు 30న ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె, రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఐఏఎస్ ఉద్యోగానికి గుడ్‌బై.. రాజకీయాల్లోకి దివ్యా మిట్టల్: బ్యూరోక్రాట్ల సరికొత్త దారి (HT_PRINT)
ఐఏఎస్ ఉద్యోగానికి గుడ్‌బై.. రాజకీయాల్లోకి దివ్యా మిట్టల్: బ్యూరోక్రాట్ల సరికొత్త దారి (HT_PRINT)

'కర్మభూమి' నుంచే పొలిటికల్ రీ-ఎంట్రీ

ఉత్తరప్రదేశ్‌లోని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో దివ్యా మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు దేవరియా, మీర్జాపూర్, సంత్ కబీర్ నగర్ జిల్లాల కలెక్టర్‌గా ఆమె సమర్థవంతమైన సేవలు అందించారు. ముఖ్యంగా మీర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో, స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా 'లహురియాదా' అనే కొండప్రాంత గ్రామానికి తాగునీటి సదుపాయం కల్పించి ప్రజల మనసులు గెలుచుకున్నారు.

ప్రజలతో చర్చించిన తర్వాతే తన పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌కు తుదిరూపు ఇస్తానని ఆమె వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ను తన 'కర్మభూమి'గా అభివర్ణించిన ఆమె, దేశ భవిష్యత్తు కోసం గొంతు విప్పే ఒక బలమైన వేదికను రూపొందించడమే తన లక్ష్యమని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

సివిల్స్ వదిలి.. రాజకీయంలో మెరిసిన ప్రముఖులు

పాలనా దస్త్రాలను పక్కనబెట్టి రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన సివిల్ సర్వెంట్లు భారతదేశంలో చాలామందే ఉన్నారు. దివ్యా మిట్టల్ కంటే ముందు ఈ దారిలోనే పయనించి ప్రజాప్రతినిధులుగా, కేంద్ర మంత్రులుగా ఎదిగిన కీలక నేతలు వీరే.

అశ్విని వైష్ణవ్: 1994 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అశ్విని వైష్ణవ్, ఆ తర్వాత కార్పొరేట్ రంగానికి మళ్లి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ప్రస్తుతం ఆయన కేంద్ర రైల్వే, సమాచార ప్రసార, ఐటీ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఎస్. జైశంకర్: 1977 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎస్. జైశంకర్. విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన, ఆ తర్వాత బీజేపీలో చేరి ప్రస్తుతం కేంద్ర విదేశాంగ మంత్రిగా అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు.

అరవింద్ కేజ్రీవాల్: ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్, ఉద్యోగాన్ని వదిలి అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్థాపించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించారు.

కె. అన్నామలై: 2011 కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అన్నామలై, తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కర్ణాటకలో 'సింగం'గా పేరు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

వి.కె. పాండియన్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వద్ద అత్యంత కీలకమైన కార్యదర్శిగా పనిచేసిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి.కె. పాండియన్, 2023లో విఆర్ఎస్ తీసుకుని బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీలో చేరారు.

హర్‌దీప్ సింగ్ పురి: 1974 ఐఎఫ్ఎస్ అధికారి అయిన హర్‌దీప్ సింగ్ పురి, ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధిగా సేవలు అందించారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా ఉన్నారు.

ఆర్.కె. సింగ్: 1975 బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి, మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్.కె. సింగ్ పదవీ విరమణ తర్వాత బీజేపీలో చేరి ఎంపీగా గెలిచారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఓ.పి. చౌదరి: 2005 ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారి చౌదరి, 2018లో ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు.

అపరాజిత సారంగి: 1994 ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిణి అపరాజిత సారంగి, 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More