FASTag Annual Pass : హైవే ప్రయాణికులకు ఝలక్! ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర పెంపు..

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఎన్‌హెచ్ఏఐ ఝలక్ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

Published on: Mar 15, 2026, 06:00:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) కీలక సమాచారం అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) ధరలను సవరిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఫాస్టాగ్​ అప్డేట్స్​ 2026..
ఫాస్టాగ్​ అప్డేట్స్​ 2026..

ఫాస్టాగ్​ వార్షిక పాస్​ ఫీజు- ఎంత పెరిగింది?

హైవేలపై తరచూ ప్రయాణించే వారి ఖర్చును తగ్గించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గత ఏడాది ఆగస్టు 15న ఈ వార్షిక పాస్ విధానాన్ని ఎన్‌హెచ్ఏఐ తీసుకొచ్చింది. ఈ పాస్ ఒక ఏడాది పాటు లేదా ఏవైనా నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద గరిష్టంగా 200 సార్లు ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. టోల్ చార్జీ ఎంత ఉన్నప్పటికీ ఈ పాస్ ఉన్నవారికి అదనపు భారం పడదు.

నాన్-కమర్షియల్ వాహనాల (సొంత కార్లు, జీపులు, వ్యాన్లు) వార్షిక పాస్ ధరపై 2.5 శాతం పెరుగుదల నమోదైంది. గతంలో ఈ పాస్ ధర రూ. 3,000 ఉండగా, ఇప్పుడు అది రూ. 3,075కి చేరింది.

లాంచ్​ అయ్యి ఏడాది కాకుండానే ఫాస్టాగ్​ వార్షిక పాస్​ ఫీజు పెంచడం గమనార్హం.

ప్రయాణికుల మొగ్గు.. గణాంకాలు ఇవే!

కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ ఫాస్టాగ్​ వార్షిక పాస్‌ను ఉపయోగిస్తున్నారు. హైవేలపై జరుగుతున్న మొత్తం కార్ల లావాదేవీల్లో దాదాపు 28 శాతం ఈ పాస్ ద్వారానే సాగుతుండటం విశేషం.

2016లో ఫాస్టాగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 11.86 కోట్ల ట్యాగ్‌లు జారీ చేయగా, అందులో 5.9 కోట్లు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని టోల్ వసూళ్లలో 98 శాతానికి పైగా డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి.

ఫాస్టాగ్​ వార్షిక పాస్​- ఎక్కడ వాడకం ఎక్కువ?

ఫాస్టాగ్​ వార్షిక పాస్ వినియోగంలో దిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులోని బిజ్వాసన్ టోల్ ప్లాజా 57 శాతంతో అగ్రస్థానంలో ఉంది.

ముండ్కా టోల్ ప్లాజా (దిల్లీ), ఝింజోలి ఫీ ప్లాజా (సోనిపట్)లలో కూడా 53 శాతం మంది ఈ పాస్‌నే వాడుతున్నారు.

రాష్ట్రాల వారీగా చూస్తే చండీగఢ్ (14%) మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు (12.3%), దిల్లీ (11.5%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యంశాలు:

ఎక్కడ పనిచేస్తుంది?: ఈ పాస్ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజాల వద్ద మాత్రమే చెల్లుతుంది. స్టేట్ హైవేలు లేదా స్థానిక సంస్థల టోల్ గేట్ల వద్ద సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.

నిబంధనలు: 200 ట్రిప్పులు పూర్తికాగానే లేదా ఏడాది గడవగానే ఈ పాస్ ఆటోమేటిక్‌గా సాధారణ ఫాస్టాగ్‌లా మారిపోతుంది. ట్రిప్పులు అయిపోతే ఏడాది పూర్తి కాకపోయినా కొత్త పాస్ కొనుగోలు చేయవచ్చు.

ఎలా కొనాలి?: ఆసక్తి గల వారు 'రాజమార్గయాత్ర' (Rajmargyatra) మొబైల్ యాప్ లేదా ఎన్‌హెచ్ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పాస్‌ను పొందవచ్చు.

ముఖ్య గమనిక: ఈ యాన్యువల్ పాస్ అనేది పూర్తిగా ఐచ్ఛికం. సాధారణ ఫాస్టాగ్ వాడుకునే వారు ఎప్పటిలాగే తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More