నేడు బంగారం ధరల తగ్గుదలకు గల 4 కీలక కారణాలు ఇవే

నేడు బంగారం ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం 0.77% క్షీణించి 1,22,500 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, ఫెస్టివల్ డిమాండ్ సద్దుమణగడం, యూఎస్ డాలర్ బలపడడం కారణంగా బంగారం దిగివస్తోంది. 

Published on: Oct 27, 2025, 15:00:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగారం ధరలు అసాధారణ ర్యాలీ తరువాత అత్యధిక స్థాయిని తాకి, నేడు ఎట్టకేలకు స్వల్ప దిద్దుబాటును (Correction) చూశాయి. నేడు (సోమవారం) ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధరలు గతం కంటే తక్కువగా, 0.77 శాతం క్షీణించి, 10 గ్రాములకు 1,22,500 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతకుముందు క్లోజింగ్ ధర 1,23,451.

నేడు బంగారం ధరల తగ్గుదలకు గల 4 కీలక కారణాలు ఇవే (AFP)
నేడు బంగారం ధరల తగ్గుదలకు గల 4 కీలక కారణాలు ఇవే (AFP)

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ ట్రెండ్ కనిపించింది. స్పాట్ బంగారం ధర 0.7 శాతం తగ్గి ఔన్స్‌కు $4,082.77 వద్ద ఉండగా, డిసెంబర్ డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పడిపోయి $4,095.80 వద్దకు చేరాయి.

ఎందుకీ పతనం? 4 కీలక కారణాలు

బంగారాన్ని సాధారణంగా 'సురక్షిత పెట్టుబడి' (Safe-Haven Asset) అంటారు. ప్రపంచంలో ఆర్థిక, భౌగోళిక అనిశ్చితి, ఉద్రిక్తతలు ఉన్నప్పుడు దీనికి డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నాయి.

ఆస్పెక్ట్ బులియన్ & రిఫైనరీ సీఈఓ దర్శన్ దేశాయ్ వంటి నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశంపై పెరిగిన ఆశావాదం, యూఎస్ డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల సురక్షిత పెట్టుబడికి డిమాండ్ తగ్గింది. ఈ వారం జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటన, ఇతర కీలక సమావేశాలు బులియన్ మార్కెట్‌కు అత్యంత కీలకం.

బంగారం ధరలు తగ్గడానికి దోహదపడిన నాలుగు కీలక కారణాలు ఇక్కడ చూడొచ్చు.

1. లాభాల స్వీకరణ

బంగారం ధరలు గతంలో బాగా పెరిగాయి. పండుగ సీజన్ డిమాండ్ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో, పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలను తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంటే, అధిక ధరలకు కొన్న బంగారాన్ని అమ్ముకొని తమ లాభాలను స్వీకరించడం ప్రారంభించారు.

"పెట్టుబడిదారులు లాభాలు తీసుకునేందుకు సిద్ధపడటం, అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా మారడంతో బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి" అని ఇండియా బులియన్ & జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్షా కంబోజ్ చెప్పారు.

2. యూఎస్ డాలర్ బలోపేతం

బంగారం ధరలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలలో యూఎస్ డాలర్ బలం ఒకటి. డాలర్ ఇండెక్స్ బలపడినప్పుడు, ఇతర కరెన్సీలను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు బంగారం ఖరీదైనదిగా మారుతుంది. ఇది, బంగారం డిమాండ్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా, ధరలు దిగి వస్తాయి. పండుగ సీజన్ తర్వాత డిమాండ్ స్థిరపడటం, బలపడిన యూఎస్ డాలర్ కలయిక సురక్షిత కొనుగోళ్లను తగ్గించిందని కంబోజ్ వివరించారు.

3. యూఎస్ ఫెడ్ నిర్ణయాల కోసం ఎదురుచూపు

పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి పాలసీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఈ బుధవారం జరగనుంది.

‘బలహీనమైన ద్రవ్యోల్బణం (Inflation) డేటా కారణంగా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని మార్కెట్ ఆశిస్తోంది. అయితే, ఊహించిన దాని కంటే తక్కువ వడ్డీ రేట్ల కోతలను ఫెడ్ సంకేతం ఇస్తే, అది బంగారం ధరలపై మరింత ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది..’ అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి వివరించారు.

4. తగ్గిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు

బంగారం యొక్క 'సురక్షిత పెట్టుబడి' ఆకర్షణ తగ్గడానికి మరో కారణం భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య పరిస్థితులు మెరుగుపడటం. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కావడం. అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశంపై ఆశావాదం పెరగడం.

ఈ సానుకూల పరిణామాలు, మెరుగైన వాతావరణం కారణంగా పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల (Riskier Assets) వైపు మళ్లుతున్నారు. దీనితో, సురక్షితమైన బంగారానికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా, ధరలు తగ్గాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More