Gen Alpha విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్పుతున్న Gen Z వాలంటీర్లు
Gen Alpha విద్యార్థులకు అతి దగ్గరగా ఉండే తరం వారు Gen Z. వీరు కొన్ని జీవన నైపుణ్యాలను వ్యయప్రయాసలకోర్చి నేర్చుకున్నారు. అనుభవంలో మరికొన్ని జీవిత పాఠాలను తెలుసుకున్నారు. ఆ నైపుణ్యాలను తమ తర్వాతి తరానికి అందించడానికి ముందుకు వస్తున్నారు.
ఇప్పుడు బడుల్లో చదువుకుంటున్న Gen Alpha విద్యార్థులకు అతి దగ్గరగా ఉండే తరం వారు Gen Z. వయసులో ఈ రెండు తరాల వారికీ ఒకరి ప్రపంచాన్ని మరొకరు అర్థం చేసుకోగలిగేంత సామీప్యత ఉంది. అయితే.. Gen Z వారు కొన్ని జీవన నైపుణ్యాలను వ్యయప్రయాసలకోర్చి నేర్చుకున్నారు. అనుభవంలో మరికొన్ని జీవిత పాఠాలను తెలుసుకున్నారు. ఆ నైపుణ్యాలను తమ తర్వాతి తరానికి అందించడానికి ముందుకు వస్తున్నారు.

ఈ రెండు తరాల మధ్య ఉన్న సారూప్యత వల్లనేనేమో.. ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ 'చైల్డ్ రైట్స్ అండ్ యు' (CRY) వాలంటీర్ల బృందం బెంగళూరు, హైదరాబాద్, తిరూర్‌లలో.. జెన్ ఆల్ఫా విద్యార్థులతో నిండిన తరగతి గదుల్లోకి అడుగు పెట్టినప్పుడు మంచి ప్రతిస్పందన లభిస్తోంది. మంచి ఫలితాలను సాధిస్తోంది. వీరు జెన్ జీ యువత – కాలేజీ విద్యార్థులు, ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు. తమ ముందున్న జెన్ ఆల్ఫా పిల్లల కంటే కేవలం కొన్నేళ్లు మాత్రమే పెద్దవారు.
నిత్యజీవితంలో చాలా అంశాలకు రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా.. సైబర్ భద్రత, ఋతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత, ఆర్థిక అక్షరాస్యత వంటి విషయాలు కిశోర బాలబాలికలకు చాలా కీలకమైన విషయాలు. కానీ స్కూల్ టైమ్‌టేబుల్‌లో వీటికి ఇప్పటికీ తగినంత చోటు దక్కటం లేదు. ఈ అంశాల గురించి జెన్ జీ వాలంటీర్లు మాట్లాడతారు.
‘ఆన్‌లైన్’ భద్రత
విద్యార్థులు తమ జీవితంలో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. చదువు కోసం, వినోదం కోసం, స్నేహాల కోసం. కానీ అక్కడ సురక్షితంగా ఉండటానికి కావాల్సిన ప్రాథమిక అంశాలు చాలామందికి ఎవరూ ఎప్పుడూ నేర్పలేదు. బలమైన పాస్‌వర్డ్‌లు రూపొందించుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడం మొదలుకొని, ఆన్‌లైన్ సంభాషణ హద్దు దాటిందని ఎలా గుర్తించడం అనేదాని వరకు ఇందులో ఇమిడి ఉంటాయి.
ఋతుక్రమ ఆరోగ్యం గురించి చాలామంది స్నేహితుల ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో, లేదా ఇంట్లో ఏ సమాచారం అందుబాటులో ఉంటే దాని ద్వారానో, ముక్కలుముక్కలుగా నేర్చుకుంటారు. పొదుపు, ఖర్చు, డబ్బు పట్ల దృక్పథాలు చిన్నతనం నుంచే ఏర్పడటం మొదలవుతున్నా.. ఆర్థిక అక్షరాస్యత తరగతి గదిలోకి చేరే అవకాశం మరీ తక్కువ.
ఈ లోటును కొంతమేరకైనా పూడ్చాలని CRY వాలంటీర్లు నడుం బిగించారు. ఈ వాలంటీర్లలో కొందరు ఇంకా చదువుకుంటున్నవారు ఉన్నారు. మరికొందరు పూర్తికాల ఉద్యోగాల్లో ఉంటూ వారాంతాల్లో ఈ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు.
అయితే, ఈ వాలంటీర్లు తరగతి గదిలోకి అడుగుపెట్టడమే ఒక పాఠం అవుతోంది. వాలంటీర్లు వ్యక్తిగతంగా పాఠశాలలను సంప్రదిస్తారు. కొన్నిసార్లు వ్యక్తిగత పరిచయాల ద్వారా, మరికొన్నిసార్లు నేరుగా కాల్స్ చేసి, స్వయంగా వెళ్లి మాట్లాడతారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు అనుమతులు అవసరమయ్యేవి, పరీక్షలు, రద్దీగా ఉన్న అకడమిక్ క్యాలెండర్ కారణంగా చాలా పాఠశాలలు నిస్సహాయం వ్యక్తం చేస్తూ అనుమతి నిరాకరిస్తాయి. “నో అనే మాటను వినడం అలవాటైపోతుంది” అని బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో బీఏ (హానర్స్) హిస్టరీ చదువుతున్న శివాంబిక అన్నారు. ‘‘దీంతో మరో పాఠశాలకు వెళ్లి మళ్లీ ప్రయత్నించడమే” అని చెప్పారు.
ఒకసారి వీరికి బడి తలుపులు తెరుచుకున్నాక మాత్రం రెండు వైపులా ఉత్సాహం పొంగిపొరలుతుంది. విద్యార్థుల్లో కూడా ఉత్సుకత, క్రియాశీల స్పందన పెరగడం స్కూల్ టీచర్లు కూడా గమనించారు. “వాలంటీర్లు తమకు మార్కులు వేసే వ్యక్తి కాదు కాబట్టి పిల్లలు మరింత నిర్భీతిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు” అని ఒక ప్రిన్సిపాల్ తను గమనించిన విషయాన్ని చెప్పారు. “వలంటీర్లను విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలు.. టీచర్లను అడుగుతారని నేననుకోను” అన్నారు కూడా.
సైబర్ భద్రత సెషన్‌ను గమనించిన మరొక టీచర్ కూడా ఇలాంటి మార్పునే గుర్తించారు. ముఖ్యంగా సాధారణంగా మౌనంగా ఉండే విద్యార్థుల్లో. తమ కంటే కొన్నేళ్లు మాత్రమే పెద్దవారైన వ్యక్తితో సంభాషిస్తున్నపుడు వారు మాట్లాడేందుకు మరింత ఎక్కువగా సిద్ధపడినట్టు ఆ టీచర్ తెలిపారు.
కేరళలోని తిరూర్‌లో గల గవర్నమెంట్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో, ఈ అనుభవం విద్యార్థులకే కాక తనకూ ఉపయోగపడిందని వలంటీర్ శివాంబిక చెప్పారు.
“స్కూల్ అవుట్‌రీచ్ కార్యక్రమం వల్ల నేను పాఠశాలలను సంప్రదించి, సైబర్ భద్రతపై విద్యార్థులకు విలువైన పాఠాలు నేర్పించగలిగాను, పాఠ్యాంశాల్లో లేని అంశాలను వారు అర్థం చేసుకునేందుకు నా వంతు తోడ్పాటును అందించాను” అని ఆమె చెప్పారు. “పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థుల ముందు ప్రజెంట్ చేయడం, తరగతిని ఎలా నిర్వహించాలో, విషయం వారికి అర్థమైందో లేదో ఎలా తెలుసుకోవాలో నేర్చుకునేందుకు కూడా ఇది నాకు ఉపయోగపడింది” అని ఆమె చెప్పారు.
యాక్టివిటీస్‌తో ఉత్సాహం
ఒక అంశం మీద వివరణ ఇవ్వటం పూర్తి చేసి.. ఆ అంశం మీద యాక్టివిటీస్ చేయించేటపుడు విద్యార్థులు మరింత ఉత్సాహంగా ప్రతిస్పందిస్తున్నారని బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయ NAL క్యాంపస్‌లో సైబర్ భద్రత మీద సెషన్స్ నిర్వహించిన గిరీష్ ఆర్ చెప్పారు. ఆయన ఢిల్లీలోని శివ్ నాడార్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ చదువుతున్నారు. “సెషన్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఇంటరాక్టివ్‌గా జరిగింది, విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్‌ల చర్చ, 'సేఫ్ ఆర్ అన్‌సేఫ్' క్విజ్ సమయంలో వారు చురుగ్గా పాల్గొన్నారు” అని ఆయన చెప్పారు.
చాలామంది విద్యార్థులకు ఆన్‌లైన్ భద్రత గురించి ఇప్పటికే కొంత అవగాహన ఉందని ఆయన గమనించారు. అయితే, ఆ సాధారణ అవగాహనను ఆచరణాత్మక అలవాట్లుగా మార్చేందుకు ఈ సెషన్ ఉపయోగపడింది. బలమైన పాస్‌వర్డ్‌లు రూపొందించుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడం, ఆన్‌లైన్‌లో అప్రమత్తంగా వ్యవహరించడం వంటివి విద్యార్థులు నేర్చుకున్నారు.
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌లో కూడా ఇదే ఆసక్తి కనిపించింది. అక్కడ హైదరాబాద్‌లోని సింబయాసిస్ లా స్కూల్‌లో బీఏ ఎల్ఎల్‌బీ చదువుతున్న విదుషి సింగ్ సైబర్ భద్రతపై సెషన్ నిర్వహించారు.
“చాలామంది విద్యార్థులు సైబర్ భద్రత గురించి ఆసక్తి చూపారు, సురక్షిత ఆన్‌లైన్ అలవాట్లు నేర్చుకోవాలని ఉత్సాహంగా పాల్గొన్నారు” అని ఆమె చెప్పారు. “పాఠశాలల్లో డిజిటల్ భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాల ఆవశ్యకత చాలా ఉందని ఈ కార్యక్రమం మరింత స్పష్టం చేసింది” అంటారామె.
ఈ సంభాషణలు కేవలం సైబర్ భద్రతకే పరిమితం కాలేదు. ఆర్థిక అక్షరాస్యత సెషన్లు పొదుపు, ఖర్చు గురించి విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కల్పించగా, ఋతుక్రమ ఆరోగ్యం మీద చర్చలు, సాధారణంగా స్నేహితులకో, ఇంటర్నెట్‌కో, లేదా ఇంట్లో అసంపూర్తి సంభాషణలకో పరిమితమయ్యే ప్రశ్నలు అడిగేందుకు వీలు కల్పించాయి.
అంతేకాదు.. టీచింగ్ అనేది ఒకే వైపు నుంచి జరిగే ప్రక్రియ కాదని వాలంటీర్లు గుర్తించారు. “నేను ఈ సెషన్ చెప్పడానికి వెళ్లేటప్పుడు కేవలం కంటెంట్ వివరించి చెప్పడం పూర్తి చేస్తే సరిపోతుందనుకున్నాను” అని గిరీష్ గుర్తుచేసుకున్నారు. “కానీ పిల్లలు చాలా ఆసక్తిగా ఉన్నారు. సెషన్ మొత్తం పరస్పర సంభాషణగా మారిపోయింది. నేను కూడా ఏదో నేర్చుకున్నానన్న భావనతో బయటకు వచ్చాను” అని చెప్పారాయన.
విదుషికి ఈ అనుభవంలో మరో అంశం మనసులో నిలిచిపోయింది – మొదట్లో సంకోచంగా ఉన్న చాలా తరగతులు క్రమంగా ఉత్సాహంగా క్రియాశీలంగా మారడం. “ప్రతి పాఠశాలకూ ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. కొన్ని తరగతుల్లో విద్యార్థులు మొదట్లో బిడియంగా ఉంటారు. సరిగా స్పందించరు. కానీ చివరికి వచ్చే సరికి వారు ప్రశ్నలు అడగడం ఆపరు. నిజం చెప్పాలంటే ఈ మార్పును చూడటమే నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం” అని ఆమె చెప్పారు.
బెంగళూరు, హైదరాబాద్, తిరూర్‌లలో కలిపి ఈ సెషన్లు 6,000 మందికి పైగా విద్యార్థులను చేరుకున్నాయి. అయితే, తరగతి గదుల్లో ఈ పనిని అత్యంత దగ్గరగా చేస్తున్న వారికి ఈ సంఖ్య కంటే చిన్న చిన్న క్షణాలే ఎక్కువగా గుర్తుండిపోతాయి. ఒక విద్యార్థి మామూలుగా తనలో తానే దాచుకునే ప్రశ్నను అడగడం, మరొక విద్యార్థిలో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని ఉపాధ్యాయుడు గమనించడం, లేదా ఒక తరగతి మొదట్లో బిడియంగా ఉంటూ క్రమంగా ఆపలేనంత ఉత్సాహంగా మారడం.. ఇటువంటి అనుభవాలు.
హాజరు సంఖ్యల్లో కొలవలేని ఒక అనుభూతిని కూడా ఈ అనుభవం వాలంటీర్లకు మిగిల్చింది. ఆసక్తిగల పిల్లలతో సమయం గడపడంలో దొరికే సంతోషం, వారు మనసు విప్పి మాట్లాడుతుంటే వారికి తమకు తెలిసిన విషయాలు చెప్పటం, తాము వెచ్చెంచే ఒక గంట సమయం విద్యార్థులకు చాలా ఉపయోగపడిందన్న ఆనందం — ఇలాంటి సాదాసీదా సంతృప్తితో చాలామంది తిరిగి వస్తారు. అంతేకాక, తమ గురించి తామే కొత్తగా తెలుసుకున్నారు: విద్యార్థుల ముందు నిలబడటం, బాధ్యత తీసుకోవడం, ఎంత చిన్నదైనా మార్పు తీసుకురాగలగడం వల్ల వచ్చే ఆత్మవిశ్వాసం.
తమ సమయాన్ని, శక్తిని ధారపోసేందుకు సిద్ధంగా ఉన్న యువతకు కొదవేమీ లేదు. వారికి కావాల్సింది మరిన్ని అవకాశాలు, వేదికలు మాత్రమే. ఈ వాలంటీర్ల ప్రయాణం ఫోన్ కాల్స్‌తో, ఫాలో-అప్‌లతో, చాలా తిరస్కరణలతో మొదలవుతుంది. అది ప్రశ్నలతో, నవ్వులతో కొనసాగుతుంది. సెషన్ పూర్తయ్యాక కూడా కొనసాగే సంభాషణలతో ముగుస్తుంది. భవిష్యత్తు తరానికి చెందిన కొందరికి తాము ఎంతోకొంత ఉపయోగపడ్డామన్న నిశ్శబ్ద సంతృప్తిని అందిస్తుంది.
రచయిత:
జాన్ రాబర్ట్స్,
రీజనల్ డైరెక్టర్,
CRY – చైల్డ్ రైట్స్ అండ్ యు,
సౌత్ రీజియన్
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


