కుప్పకూలిన బంగారం, వెండి ధరలు- రికార్డు స్థాయిల నుంచి భారీ పతనం..
ఇంతకాలం ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి, వెండి ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి! అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి, బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
నిన్న, మొన్నటి వరకు రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. శుక్రవారం నాటి భారీ పతనం తర్వాత, శనివారం- జనవరి 31న కూడా ధరలు అదే కనిష్ట శ్రేణిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 11 శాతానికి పైగా పతనమవ్వగా, అంతర్జాతీయ వెండి ధరలు ఏకంగా 31 శాతానికి పైగా పడిపోవడం మదుపర్లను విస్మయానికి గురిచేస్తోంది. తాజా అమ్మకాలతో వెండి ధర తన ఆల్-టైమ్ రికార్డు స్థాయి అయిన 121.755 డాలర్ (పర్ ఔన్స్) కంటే దాదాపు 35 శాతం దిగువకు చేరింది.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు (జనవరి 31, 2026)..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 16,919గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 15,509 వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల (999 గోల్డ్) ధర రూ. 12,689గా నమోదైంది. అయితే, వెండి మాత్రం ఇతర నగరాల కంటే ఇక్కడ ప్రీమియం ధరకు అందుబాటులో ఉంది. గ్రాము వెండి రూ. 404.90 (కిలో రూ. 4,04,900) వద్ద కొనసాగుతోంది.
ఇక దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 16,934 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 15,524, 18 క్యారెట్ల ధర రూ. 12,704 గా ఉంది. వెండి ధర కిలోకు రూ. 3,94,900 వద్ద ఉంది.
మరోవైపు ముంబై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 16,919గాను.. 22 క్యారెట్ల ధర రూ. 15,509, 18 క్యారెట్ల ధర రూ. 12,689గా ఉన్నాయి.
వెండి ధర కిలోకు రూ. 3,94,900 వద్దే కొనసాగుతోంది.
ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? నిపుణులు ఏమంటున్నారు?
ధరల పతనానికి గల కారణాలను విశ్లేషిస్తూ, "కాపర్ (రాగి) పై సీఎమ్ఈ (చికాగో మెర్సెంటైల్ ఎక్స్ఛేంజ్) మార్జిన్ మనీని 20 శాతానికి పెంచింది. ఇదే ప్రభావం బంగారం, వెండిపై కూడా ఉంటుందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే పసిడి ధరలు ఓవర్‌బాట్ కండిషన్‌లో ఉండటం, అమెరికా ఫెడ్ ఛైర్మన్ నియామక ప్రకటనతో డాలర్ బలోపేతం కావడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లలో ప్యానిక్ సెల్లింగ్‌ని రేకెత్తించాయి," అని సెబీ నమోదిత కమోడిటీ నిపుణులు అనుజ్ గుప్తా వివరించారు.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారని అనుజ్ గుప్తా తెలిపరు.
"ధరల పెరుగుదల వల్ల కుదేలైన జ్యువెలరీ మార్కెట్‌ను ఆదుకోవడానికి ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. ఒకవేళ బడ్జెట్‌లో సుంకం తగ్గింపు ప్రకటన వస్తే దేశీయ మార్కెట్లో ధరలు మరిన్ని కనిష్టాలకు పడిపోవచ్చు," అని ఆయన అభిప్రాయపడ్డారు.
బంగారం, వెండి ధరల గురించి ఛాయిస్ వెల్త్ సీఈఓ నికుంజ్ సరాఫ్ మాట్లాడుతూ.. "అధ్యక్షుడు ట్రంప్ హయాంలో ఫెడ్ ఛైర్మన్ నియామకం వడ్డీ రేట్ల విషయంలో కఠిన విధానాలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చింది. ఇది డాలర్‌ను బలోపేతం చేసి, లోహాల ధరలను క్రష్ చేసింది," అని తెలిపారు. దీని ప్రభావం గోల్డ్ ఈటీఎఫ్‌లపై కూడా పడవచ్చని ఆయన హెచ్చరించారు.
అలాగే, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, కొత్త ఫెడ్ చీఫ్ ప్రకటనతో అస్పష్టత తొలగిపోవడం వల్ల సురక్షిత పెట్టుబడిగా ఉన్న బంగారానికి డిమాండ్ తగ్గిందని పేస్ 360 చీఫ్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ పేర్కొన్నారు.

E-Paper












