Gold and Silver price today : మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు- హైదరాబాద్​లో రేట్లు ఇలా..

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధరలు మళ్లీ లాభాల బాట పట్టాయి. రికార్డు గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో గురువారం ధరలు కొంత తగ్గినప్పటికీ, భౌగోళిక అనిశ్చితి కారణంగా శుక్రవారం మరోసారి పెరిగాయి. మరి ఇప్పుడు బంగారం, వెండి కొనొచ్చా? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 30, 2026, 08:45:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
నేటి బంగారం, వెండి ధరలు..
నేటి బంగారం, వెండి ధరలు..

గురువారం కనిపించిన పతనం అనంతరం బంగారం, వెండి ధరలు శుక్రవారం, జనవరి 30న మళ్లీ వృద్ధి బాటను ప్రారంభించాయి. అయితే, ఈ రెండు విలువైన లోహాలు ఇప్పటికీ తన రికార్డు స్థాయిల నుంచి దాదాపు 3 శాతం మేర తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి.

బంగారం, వెండి ధరలు: గురువారం పడ్డాయి- శుక్రవారం పెరిగాయి..

పెరుగుతున్న ఆర్థిక- భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారం, వెండి.. 1980ల తర్వాత తమ అత్యుత్తమ నెలవారీ పనితీరును నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, గురువారం నాడు ఇవి రికార్డు గరిష్టాలను తాకిన తర్వాత, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (ప్రాఫిట్​ బుకింగ్​) మొగ్గు చూపడంతో రెండు లోహాల ధరల్లోనూ తీవ్రమైన కరెక్షన్​ కనిపించింది.

ఆసియా ట్రేడింగ్ సమయమైన శుక్రవారం నాడు స్పాట్ గోల్డ్ 5,400 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఈ విలువైన లోహం గురువారం నాడు 5,594.82 డాలర్ల రికార్డు స్థాయిని తాకిన తర్వాత, ఆ సెషన్ ముగిసే సమయానికి స్వల్పంగా తగ్గి, మొత్తం మీద 5.7 శాతానికి పైగా పతనమైంది.

మరోవైపు, స్పాట్ సిల్వర్ కూడా స్వల్పంగా లాభపడి శుక్రవారం 115 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కూడా గురువారం 121.64 డాలర్ల రికార్డు స్థాయిని తాకిన తర్వాత 2 శాతం కన్నా ఎక్కువ పడిపోయింది.

బంగారం, వెండి ధరలు: ప్రభావితం చేస్తున్న అంశాలు..

ఎన్​రిచ్​ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ ప్రకారం.. బంగారం, వెండిలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ర్యాలీకి అనేక స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ కారకాలు మద్దతునిస్తున్నాయి.

"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సుంకాల హెచ్చరికలు, వెనెజువెలా- ఇరాన్ చుట్టూ ఉన్న రిస్కులు, గ్రీన్​ల్యాండ్​కు సంబంధించిన వ్యూహాత్మక ఆందోళనలు వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు.. సురక్షితమైన ఆస్తుల కోసం డిమాండ్‌ను పెంచాయి," అని ఆయన వివరించారు.

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, అమెరికా అప్పుల భారం పెరగడం, అమెరికన్ డాలర్ నిర్మాణాత్మకంగా బలహీనపడటం వంటి సంకేతాల మధ్య గోల్డ్ వైపు పెట్టుబడులు పెరుగుతున్నాయి. వీటికి తోడు కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, డీ-డాలరైజేషన్ ధోరణులు పసిడి ధరలకు అండగా నిలుస్తున్నాయి.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. మే నెలలో పదవీకాలం ముగియనున్న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వారసుడిగా ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరిని ప్రకటిస్తారనే దానిపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. సెంట్రల్ బ్యాంక్ తన తదుపరి రేట్ల తగ్గింపును జూన్‌లో చేపట్టవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, చిన్నపాటి ధరల తగ్గింపులు కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం (బుల్లిష్​ ఔట్​లుక్​) ఉందని పొన్ముడి తెలిపారు.

బంగారం, వెండి ధరలు: కొనడానికి ఇది సరైన సమయమేనా?

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ గురువారం నాడు బంగారు ధర అంచనాను ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాలకు 6,200 డాలర్లకు పెంచింది. అయితే 2026 చివరి నాటికి ధరలు 5,900 డాలర్లకు తగ్గుతాయని అంచనా వేసింది.

నేటి బంగారం, వెండి ధరల ధోరణిపై మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వీపీ రాహుల్ కలాంత్రి మాట్లాడుతూ.. “నేడు గోల్డ్ రేటుకు 5,340 డాలర్లు- 5,220 డాలర్ల వద్ద సపోర్ట్ ఉంది. అదేవిధంగా 5,525 డాలర్లు- 5,600 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఉంది. వెండి రేటుకు 112.10 డాలర్లు, 108.75 డాలర్ల వద్ద సపోర్ట్ ఉండగా, 118.15 డాలర్లు- 122.00 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఉంది. ఎంసీఎక్స్​లో నేడు బంగారం ధరకు రూ. 1,63,050- రూ. 1,60,310 వద్ద సపోర్ట్, రూ. 1,70,850- రూ. 1,73,950 వద్ద రెసిస్టెన్స్ ఉంది. వెండికి రూ. 3,80,810- రూ. 3,74,170 వద్ద సపోర్ట్ ఉండగా, రూ. 3,91,810- రూ. 3,98,470 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

మరోవైపు హైదరాబాద్​లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,64,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,79,000 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు- 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ. 1,64,130- రూ. 1,79,030 వద్ద ఉన్నాయి. ఇక విశాఖపట్నంలో ఈ ధరలు వరుసగా రూ. 1,64,140- రూ. 1,79,040 గా ఉన్నాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం ఉత్తమం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More