60 రోజుల గ్రేస్ పీరియడ్ కట్! H-1B వీసా రూల్స్​లో భారీ మార్పులు? భారతీయులకు బిగ్ షాక్

H1b Visa rules : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులకు ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉంది. ఈ నిబంధన అమలైతే హెచ్-1బీ వీసాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.

Published on: Aug 9, 2026, 05:40:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గడ్డుకాలం రానుంది! ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గడువును ఎత్తివేసే ఆలోచనలో అమెరికాలోని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

హెచ్​-1బీ వీసా రూల్స్​లో మార్పు తప్పదా? (REUTERS)
హెచ్​-1బీ వీసా రూల్స్​లో మార్పు తప్పదా? (REUTERS)

ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) పరిశీలనలో ఉంది. ఇది ఇంకా అధికారిక నిబంధనగా మారలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా బహిరంగం కాలేదు.

కానీ ఈ నిబంధన కనుక అమలైతే, ఉద్యోగాలు కోల్పోయిన విదేశీయులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు దాదాపు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. నిర్ణీత గడువు కంటే ముందే ఉద్యోగం పోతే లభించే 60 రోజుల వెసులుబాటును ఈ తాజా ప్రతిపాదన పూర్తిగా తొలగిస్తుంది.

భారతీయులపై తీవ్ర ప్రభావం!

అమెరికా తీసుకునే ఈ నిర్ణయం అక్కడి ప్రవాస భారతీయ వర్గాలపై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. హెచ్-1బీ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రయోజనం పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం.

అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్) గణాంకాల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన హెచ్-1బీ దరఖాస్తుల్లో ఏకంగా 71 శాతం మంది భారతదేశంలో జన్మించిన వారే కావడం గమనార్హం. యూఎస్ సెన్సస్ డేటా ఆధారంగా ఇటీవల అంచనా వేసిన లెక్కల ప్రకారం.. అమెరికాలో 52 లక్షలకు పైగా భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్నారు.

అసలు ఈ 60 రోజుల నిబంధన ఏంటి?

ఉద్యోగాలు కోల్పోయే అత్యున్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులకు ఊరటనిచ్చేందుకు అమెరికా ప్రభుత్వం 2017లో ఈ నిబంధనను తీసుకువచ్చింది.

ఈ నిబంధన ప్రకారం.. ఉద్యోగం కోల్పోయిన నాన్-ఇమ్మిగ్రెంట్ ఉద్యోగులు అమెరికాలో వరుసగా 60 రోజులపాటు లేదా వారి అనుమతి గడువు ముగిసే వరకు (ఏది ముందైతే అది) దేశంలోనే ఉండటానికి అవకాశం ఉంది.

ఈ వెసులుబాటు పొందగలిగిన వీసా విభాగాలు ఇవే:

E-1, E-2, E-3

H-1B, H-1B1

L-1, O-1, TN

ఈ వీసాలపై ఉన్నవారితో పాటు వారిపై ఆధారపడిన డిపెండెంట్లు కూడా దీనికి అర్హులు.

ఉద్యోగం కోల్పోయిన నిపుణులు మరో యజమానిని వెతుక్కోవడానికి, కొత్త వీసాకోసం దరఖాస్తు చేసుకోవడానికి లేదా అమెరికాలో చట్టబద్ధంగా ఉండటానికి ఇతర మార్గాలను అన్వేషించడానికి ఈ 60 రోజుల సమయం ఒక సంజీవనిలా ఉపయోగపడుతుంది.

ఒకవేళ ఈ కొత్త చట్టానికి ఆమోదం లభించి, అమలైతే, ఉద్యోగం పోయిన తర్వాత ఉద్యోగులు అమెరికాలోనే ఉంటూ వేరే యజమానికి మారడం లేదా తమ ఇమ్మిగ్రేషన్ హోదాను మార్చుకోవడం సాధ్యం కాదు. యూఎస్ఐసీఎస్ ప్రత్యేకంగా జోక్యం చేసుకుని వెసులుబాటు కల్పిస్తే తప్ప ఇది కుదరదు. హెచ్-1బీ వీసాదారులతో పాటు ఈ-1, ఈ-2, ఈ-3, హెచ్-1బీ1, ఎల్-1, ఓ-1, టీఎన్ వంటి ఇతర వీసా కేటగిరీల వారు కూడా ఈ కొత్త నిబంధన కారణంగా నష్టపోనున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More