Harmanpreet Kaur: నా రక్తం, చెమట, సమయాన్ని ధారపోశా.. ఇండియా విమెన్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం!
Harmanpreet Kaur: ఇండియాకు విమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ను అందించిన హర్మన్ ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆమె ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్-ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మంగళవారం (అక్టోబర్ 6) నాడు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ సంచలన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒక కెప్టెన్‌గా తన వంతు బాధ్యత పూర్తయిందని, ఇకపై ఆటపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమతో ఒక సాధారణ ప్లేయర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.

బీసీసీఐ మీటింగ్
గువాహటిలో జరిగిన బీసీసీఐ (BCCI) ప్రత్యేక సమీక్షా సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా భారత మహిళల జట్టు ప్రదర్శన, ప్రయాణాన్ని విశ్లేషించేందుకు ఈ సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు.
వరల్డ్ కప్
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టును సుదీర్ఘకాలం పాటు నడిపించిన అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రస్థానం 2012లో చైనాలోని గ్వాంగ్‌జౌలో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ టీ20 మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత 2016లో టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు.
2022లో మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత వన్డే పగ్గాలు అందుకుని, 2023 నాటికి అన్ని ఫార్మాట్లకు లీడర్‌గా ఎదిగారు. 2025లో హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో భారత విమెన్ టీమ్ ఫస్ట్ టైమ్ వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.
హర్మన్‌ప్రీత్ ఎమోషనల్ పోస్ట్
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో హర్మన్‌ప్రీత్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు ఎంతమాత్రం సులువు కాలేదని, దీని వెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, త్యాగాలు, భావోద్వేగాలు దాగున్నాయని పేర్కొన్నారు. భారత క్రికెట్ కోసం తన రక్తాన్ని, చెమటను, సమయాన్ని ధారపోశానని, జట్టు ప్రయోజనాల కోసం చాలాసార్లు తన వ్యక్తిగత ఆటను, ఆశయాలను కూడా పక్కన పెట్టానని ఆమె వివరించారు.
కెప్టెన్‌గా ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నానని, అవి అందరికీ నచ్చకపోయినా జట్టును బలోపేతం చేయడానికే వాటిని తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. తన నాయకత్వంలో ఎన్నో పరాజయాలు, విమర్శలు, గుండెకోతలతో పాటు చారిత్రాత్మక విజయాలు, గర్వించదగ్గ క్షణాలను కూడా చూశానని రాసుకొచ్చారు.
ప్రస్తుతం భారత జట్టు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో ఎంతో పటిష్టంగా ఉందని, అందుకే తాను పూర్తి మనశ్శాంతితో తప్పుకుంటున్నానని చెప్పారు.
కొత్త ఇన్నింగ్స్
భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు బీసీసీఐకి, తోటి ప్లేయర్లకు, కోచ్‌లకు, మేనేజ్‌మెంట్‌కు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు హర్మన్‌ప్రీత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కెప్టెన్సీ ముగిసినా, భారత క్రికెట్ పై తనకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదని, తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని హర్మన్‌ప్రీత్ కౌర్ ముగించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


