Punch Monkey : గుండెలు పిండేసిన ‘పంచ్’ కోతి ఇప్పుడెలా ఉంది? సంతోషాన్ని ఇచ్చే అప్డేట్..
తల్లి ప్రేమకు దూరమై, తోటి కోతుల వేధింపులకు గురైన 'పంచ్' అనే పసి కోతి, ఒక బొమ్మనే ప్రపంచంగా మార్చుకుంది. అయితే ఇప్పుడు ఆ కష్టాలు తొలిగిపోతున్నట్లు సమాచారం. ఇతర కోతులు కూడా పంచ్‌ను ఆదరిస్తుండటంతో అది క్రమంగా కోలుకుంటోంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. టెడ్డీ బేర్ బొమ్మ పట్టుకుని అటు, ఇటు తిరుగుతున్న ఒక కోతి కనిపిస్తోంది. జపాన్‌లోని 'ఇచికావా సిటీ జూలాజికల్ అండ్ బొటానికల్ గార్డెన్స్'లో ఉంటున్న ఈ కోతిని తన తల్లి వదిలేసిందంటూ, తోటి కోతులు వేధిస్తున్నారంటూ, శాడ్ బీజీఎంలు పెట్టి అనేక మంది వీడియోలు పోస్ట్ చేయడంతో ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ పంచ్ కోతికి సంబంధించి ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ ఉంది. ఇది అందరిని సంతోషపెడుతోంది.

అమ్మ లేదు.. తోటి కోతుల నుంచి వేధింపులు
పంచ్ కథ మొదలైంది విషాదంతోనే! పుట్టగానే తల్లి ఈ కోతిని తిరస్కరించింది. అప్పటి నుంచి జూ సిబ్బందే పంచ్‌ను అల్లారుముద్దుగా పెంచారు. అయితే, తిరిగి తన జాతి కోతుల గుంపులోకి చేరినప్పుడు పంచ్‌కు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. అక్కడ ఉన్న పెద్ద కోతులు ఈ పసి కోతిని దారుణంగా కొడుతూ, వేధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒంటరితనంతో భయపడుతున్న పంచ్‌కు ఊరటనిచ్చేందుకు జూ సిబ్బంది ఒక సాఫ్ట్ ఒరాంగుటాన్ బొమ్మను ఇచ్చారు.
అప్పటి నుంచి పంచ్ ఆ బొమ్మను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ, ఎక్కడికి వెళ్లినా దానిని హత్తుకునే తిరుగుతోంది.
శుభవార్త: కొత్త స్నేహితులు దొరికారు!
గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు పంచ్ క్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే, ఫిబ్రవరి 22న జూని సందర్శించిన యానీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒక సానుకూల అప్‌డేట్ ఇచ్చారు.
నెమ్మదిగా కలివిడిగా: పంచ్ ఇప్పుడు గుంపులోని ఇతర కోతులతో నెమ్మదిగా కలిసిపోతున్నాడట.
బొమ్మను వదులుతున్నాడు: ఆశ్చర్యకరంగా, ఆడుకునే సమయంలో పంచ్ కొన్నిసార్లు తన ప్రియమైన బొమ్మను కూడా పక్కన ఉంచి, కర్ర ముక్కలతో ఆడుకుంటూ ఇతరులతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని యానీ తెలిపారు.
జూ ధృవీకరణ: ఇచికావా జూ కూడా దీనిని ధృవీకరించింది. రెండు కోతులు పంచ్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకుని నిమిరాయని, పంచ్ ఇప్పుడు క్రమంగా స్థిరపడుతున్నాడని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
సోషల్ మీడియాలో కామెంట్లు ఇలా..
సదరు మహిళ చేసిన పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. దీని కింద ప్రజలు, జంతు ప్రేమికులు విశేషంగా కామెంట్లు చేస్తున్నారు.
“తాను ఇంటర్నెట్లో ఎంత ఫేమసో ఈ కోతికి తెలిస్తే బాగుండు,” అని ఒకరు కామెంట్ చేయగా, “చాలా సంతోషంగా ఉంది,” అని మరికొందరు రాసుకొస్తున్నారు. “ఈ కోతి చాలా చిన్న వయస్సులోనే చాలా ఎదుర్కొంది,” అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
సంచలనంగా మారిన 'పంచ్'
పంచ్ ఫేమస్ కావడంతో జూకి వచ్చే సందర్శకుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆ చిన్న ప్రాణి తన బొమ్మను ఈడ్చుకుంటూ వెళుతున్నా, గుంపులో తన ఉనికి కోసం పోరాడుతున్నా చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
"పంచ్.. నువ్వు త్వరగా బలంగా తయారవ్వాలి" అంటూ వేల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. పంచ్ తనతో పాటు ఎప్పుడూ ఆ 'ఒరాంగుటాన్' బొమ్మను ఎందుకు ఉంచుకుంటాడు?
పంచ్ పుట్టిన తర్వాత తన తల్లి నుంచి వేరు పడ్డాడు. సాధారణంగా కోతి పిల్లలు భద్రత, ప్రేమ కోసం తమ తల్లులను గట్టిగా హత్తుకుని ఉంటాయి. తల్లి లేని లోటును పూడ్చడానికి, మానసిక ప్రశాంతత కోసం జూ సిబ్బంది ఆ బొమ్మను ఇచ్చారు. పంచ్ ఆ బొమ్మను తన తల్లిగా లేదా ఒక తోడుగా భావిస్తూ, భయం వేసినప్పుడల్లా దానిని గట్టిగా పట్టుకుంటాడు.
2. ఇతర కోతులు పంచ్‌ను ఎందుకు వేధించాయి? ఇది సాధారణమేనా?
కోతుల గుంపులో ఒక ప్రత్యేకమైన క్రమానుగత వ్యవస్థ (Social Hierarchy) ఉంటుంది. కొత్తగా గుంపులోకి వచ్చే లేదా బలహీనంగా ఉన్న కోతులపై పాతవి ఆధిపత్యం ప్రదర్శించడం జంతు స్వభావం. ఇతర కోతులతో ఎలా ప్రవర్తించాలో తెలియక పంచ్ మొదట్లో ఇబ్బంది పడ్డాడు. దీనివల్ల పెద్ద కోతులు వేధించాయి. అయితే ఇప్పుడు నెమ్మదిగా ఆ గుంపులో ఎలా మెలగాలో పంచ్ నేర్చుకుంటున్నాడు.
3. ప్రస్తుతం పంచ్ ఆరోగ్యం, పరిస్థితి ఎలా ఉంది?
తాజా అప్‌డేట్స్ ప్రకారం, పంచ్ పరిస్థితి మెరుగుపడుతోంది. ఫిబ్రవరి 22 నాటి సమాచారం ప్రకారం, అతను గుంపులోని ఇతర కోతులతో స్నేహం చేస్తున్నాడు. జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రెండు పెద్ద కోతులు పంచ్‌కు 'గ్రూమింగ్' (జుట్టు సవరించడం - ఇది కోతుల్లో ప్రేమకు సంకేతం) చేశాయి. క్రమంగా ఆ బొమ్మపై పంచ్ ఆధారపడటం తగ్గించి, సహజమైన కోతిలా మారుతున్నాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


