సాయి పల్లవి వెంటపడిన ఫొటోగ్రాఫర్లు.. పరుగెత్తుకుంటూ వెళ్లి కారెక్కిన నటి.. మూర్ఖులు అంటూ.. వీడియోలు వైరల్
సాయి పల్లవికి ఇటీవల కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఒక చేదు అనుభవం ఎదురైంది. 'ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్' వేడుకలో పాల్గొనేందుకు కేరళ వెళ్లిన ఆమెను విమానాశ్రయంలో అభిమానులు, ఫోటోగ్రాఫర్లు భారీగా చుట్టుముట్టారు. ఎంతగా బతిమాలినా వారు వినకపోవడంతో ఆమె తన కారు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఆమె ఎక్కడికి వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. అయితే తాజాగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ఇది కాస్తా శృతిమించి ఆమెను భయాందోళనకు గురిచేసే స్థాయికి చేరింది. ఫ్యాన్స్, మీడియా వెంటపడటంతో ఆమె వారి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి కలిగింది.

సాయి పల్లవి బతిమాలినా వినని జనం..
సాయి పల్లవి కొచ్చిలో ల్యాండ్ అవ్వగానే ఆమెను చూడటానికి, ఫోటోలు తీయడానికి భారీ సంఖ్యలో యూట్యూబ్ మీడియా, అభిమానులు ఎయిర్‌పోర్ట్ బయట వేచి ఉన్నారు. ఇది గమనించిన సాయి పల్లవి.. తన కారు వచ్చే వరకు లోపలే వెయిట్ చేశారు.
అక్కడున్న సీఐఎస్‌ఎఫ్ (CISF) సిబ్బంది.. "దయచేసి కొంచెం వెనక్కి వెళ్లండి, నేను మిమ్మల్ని నెట్టాలని అనుకోవట్లేదు" అని చెబుతున్న మాటలు వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాయి పల్లవిని పదే పదే క్లిక్ చేస్తున్న ఫోటోగ్రాఫర్లను పక్కకు పంపించడానికి ఆ భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా కుదరలేదు.
చివరికి సాయి పల్లవి బయటకు వచ్చి, తనకు కొంచెం దారి ఇవ్వాలని వారిని బతిమాలడం ప్రారంభించింది. "ఒక్క నిమిషం, నా కారు అక్కడుంది. నేను అక్కడికి వెళ్లాలి" అని ఆమె చెప్పడం వీడియోలో వినిపిస్తుంది. ఆమెను వేరే వైపుకు వచ్చి నిలబడాలని ఫోటోగ్రాఫర్లు అడగగా.. "వద్దు, మీరు ఇక్కడి నుంచే ఫోటోలు తీసుకోవచ్చు. కానీ ఎవరినీ తోయకండి" అని ఆమె ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చింది. ఆమె వ్యక్తిగత సిబ్బంది కూడా గుంపును అదుపు చేయడానికి ప్రయత్నించారు.
పరుగెత్తుకుంటూ వెళ్లిన నటి
సాయి పల్లవి ఎంతగా బతిమాలినా, ఆ గుంపును ఎక్కువసేపు కంట్రోల్ చేయలేకపోయింది. ఆమె కారు రాగానే, ఫోటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ "మేడమ్, మేడమ్.. ప్లీజ్" అంటూ అరుస్తూ ఆమెను వెంబడించడం మొదలుపెట్టారు. 'ప్రేమమ్' సినిమాలో ఆమె పోషించిన పాత్రను గుర్తుచేస్తూ కొందరు ఆమెను 'మలర్ మిస్' (Malar Miss) అని కూడా పిలిచారు.
పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన సాయి పల్లవి.. అక్కడినుంచి తప్పించుకునేందుకు తన కారు వైపు వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. అలా వెళ్తూ కూడా ఆమె ఎంతో వినమ్రంగా, వారందరికీ చేయి ఊపుతూ వీడ్కోలు పలకడం ఆమె సింప్లిసిటీకి అద్దం పడుతోంది.
నెటిజన్ల ఫైర్.. 'వాళ్లంతా జాంబీలే'
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రెడిట్ వేదికగా షేర్ చేయగా.. నెటిజన్లు ఆ ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ పబ్లిక్ న్యూసెన్స్‌ను ఉద్దేశించి "ఈ మూర్ఖులు సమాజానికి పట్టిన పీడ" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. "ఈ మూర్ఖులను కట్టడి చేయడానికి కచ్చితంగా ఏదైనా చట్టం తీసుకురావాలి" అని మరొకరు రాసుకొచ్చారు.
ఒక యూజర్ వారిని వేటాడే జంతువులతో పోల్చగా.. మరొకరు "ఇది నిజంగా మతిస్థిమితం లేని ప్రవర్తన" అని దుయ్యబట్టారు. ఆ గుంపు చేసిన పనిని చూసి "అక్షరాలా వాళ్లంతా జాంబీల్లాగే ప్రవర్తించారు" అంటూ ఏకిపారేస్తున్నారు.
అలాగే "సాయి పల్లవికి బహుశా నటుడు షైన్ టామ్ చాకో స్పూర్తినిచ్చాడేమో" అని ఒక యూజర్ సరదాగా కామెంట్ చేశారు (గతంలో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఈ మలయాళ నటుడు ఓ హోటల్ నుంచి పరుగెత్తిన సంఘటనను గుర్తుచేస్తూ..).
పెరుగుతున్న 'సెలబ్రిటీ మాబింగ్' ఘటనలు..
ఇటీవల కాలంలో బహిరంగ ప్రదేశాలు, ప్రమోషనల్ ఈవెంట్లలో ఇలా సెలబ్రిటీలను జనం విపరీతంగా చుట్టుముట్టే సంఘటనలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల పబ్లిక్ స్పేస్‌లలో నటీనటుల భద్రత ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది.
కేవలం సాయి పల్లవి మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో నిధి అగర్వాల్, సమంత రూత్ ప్రభు, అల్లు అర్జున్, దళపతి విజయ్ మరియు రామ్ చరణ్ వంటి అగ్రశ్రేణి నటీనటులు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. స్టార్స్ కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం, ఫోటోల కోసం ఎగబడుతున్న ఈ ఫ్యాన్ కల్చర్‌పై, తద్వారా తలెత్తుతున్న భద్రతా లోపాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


