సాయి పల్లవి సినిమాకు పాట పాడిన అరిజీత్ సింగ్.. అతని ఇంటికి వెళ్లి పతంగులు ఎగరేస్తూ, చెస్ ఆడుతూ సందడి చేసిన ఆమిర్ ఖాన్
సినిమా పాటలు ఇక పాడను అని చెప్పిన అరిజీత్ సింగ్ చివరిగా సాయి పల్లవి నటిస్తున్న హిందీ సినిమాకు ఓ పాట పాడాడు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ ఏక్ దిన్ మూవీలో టైటిల్ సాంగ్ అతడే పాడటం విశేషం.
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజీత్ సింగ్ పాడిన సరికొత్త పాట 'ఏక్ దిన్' (Ek Din) తాజాగా విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి నెక్ట్స్ మూవీ 'ఏక్ దిన్' కోసమే అరిజీత్ ఈ అద్భుతమైన పాటను పాడాడు. అయితే ఈ పాట మేకింగ్ వీడియోలో ఆమిర్ ఖాన్, అరిజీత్ సింగ్ కలిసి గడిపిన అందమైన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అరిజీత్ తన సొంతూరిలో ఎంత సింపుల్‌గా ఉంటారో ఈ వీడియో ద్వారా మరోసారి అందరికీ తెలిసింది.

ఆమిర్ ఖాన్, అరిజీత్ సింగ్ అన్‌సీన్ వీడియో..
జీ మ్యూజిక్ కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో సాయి పల్లవి మూవీ ఏక్ దిన్ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలోనే ఆమిర్ ఖాన్, అరిజీత్ సింగ్ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను చూపించారు. ఇద్దరూ నేలపై చాలా సింపుల్‌గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
అప్పుడు ఆమిర్ ఖాన్ అరిజిత్‌తో.. "ఇప్పుడు నువ్వు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు. కొంతకాలం పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నావా? లేదా అసలు హిందీ సినిమాలకు పాడటమే మానేయాలని అనుకుంటున్నావా? అలా చేయొద్దు భయ్యా.. మరి మా పరిస్థితి ఏంటి?" అని అడిగాడు. ఆమిర్ ఖాన్ మాటలు విని అరిజీత్ సింగ్ గట్టిగా నవ్వేశాడు.
ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా జియాగంజ్ లో ఉన్న అరిజీత్ సింగ్ సొంతూరు, అతని ఇంటిని వీడియోలో చూపించారు. ఆమిర్ ఖాన్ స్వయంగా అరిజీత్ ఊరికి వెళ్లి, అతనితో కలసి సమయం గడపడం అందరినీ ఆకట్టుకుంటోంది.
గ్రౌండెడ్ లైఫ్‌స్టైల్.. ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం
ఈ వీడియోలో ఆమిర్, అరిజీత్ ఇద్దరూ కలిసి చెస్ ఆడటం, పతంగులు ఎగరేయడం, అర్ధరాత్రి పూట స్కూటీపై ఊరంతా తిరగడం వంటివి కనిపిస్తాయి. అంతేకాకుండా ఆమిర్ ఖాన్, అతని టీమ్ కు అరిజీత్ స్వయంగా, ఎంతో ప్రేమగా భోజనం వడ్డించడం కూడా చూడొచ్చు. ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్, డైరెక్టర్ సునీల్ పాండే తదితరులు కూడా ఉన్నారు.
ఆమిర్ ఖాన్ వల్లే తమ అభిమాన గాయకుడు మళ్లీ పాడుతున్నారని కొందరు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. "నిజంగానే అరిజీత్ బ్రేక్ తీసుకుంటున్నారా? భవిష్యత్తులో కూడా ఆయన పాడుతూనే ఉంటారా?" అని మరికొందరు అభిమానులు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అలాగే గతంలో ఆమిర్, అరిజీత్ కలిసి గాలిపటాలు ఎగురువేస్తున్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.. అది ఈ పాట షూటింగ్ సమయంలోనిదేనని ఇప్పుడు స్పష్టమైంది.
'ఏక్ దిన్' సినిమా రిలీజ్ డేట్
ఈ స్పెషల్ వీడియోతో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఆమిర్ ఖాన్ అధికారికంగా ప్రకటించాడు. జునైద్ ఖాన్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ 'ఏక్ దిన్' మూవీ మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. వీడియో చివర్లో సినిమాకి సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ కూడా చూపించారు. అద్భుతమైన పాట, ఆకట్టుకునే మేకింగ్ వీడియోతో సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. త్వరలో టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


