Hero Glamour X బైక్​లో కొత్త వేరియంట్ లాంచ్- బడ్జెట్ ధరలోనే అధునాతన సేఫ్టీ ఫీచర్లు!

హీరో మోటోకార్ప్ తమ పాపులర్ 125సీసీ బైక్ గ్లామర్ ఎక్స్​లో సరికొత్త 'ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్' వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 1.01 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ప్రత్యేకతలు, సేఫ్టీ ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Sep 13, 2026, 06:45:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ద్విచక్ర వాహనదారుల రక్షణే ధ్యేయంగా దేశీయ అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. 125సీసీ సెగ్మెంట్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన తన ‘గ్లామర్ ఎక్స్’ సిరీస్‌లో అత్యంత సురక్షితమైన ‘ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్’ వేరియంట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ఎక్స్​షోరూం ధరను రూ. 1.01 లక్షలుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హీరో డీలర్‌షిప్‌లలో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది.

హీరో గ్లామర్ ఎక్స్ కొత్త వేరియంట్
హీరో గ్లామర్ ఎక్స్ కొత్త వేరియంట్

తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, ఆఫీస్‌కు వెళ్లే యువత 125సీసీ బైక్‌లను విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఈ రేంజ్ బైక్స్‌లో సురక్షితమైన బ్రేకింగ్ సిస్టమ్ లోపించిందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉండేది. దీనిని గమనించిన హీరో సంస్థ, బడ్జెట్ ధరలోనే అధునాతన సేఫ్టీ టెక్నాలజీని సామాన్యుడికి సైతం అందుబాటులోకి తెచ్చింది.

125సీసీ సెగ్మెంట్‌లో తొలిసారిగా సింగిల్ ఛానల్ ఏబీఎస్ + ఐబీఎస్..

హీరో గ్లామర్ ఎక్స్​లో అందించిన బ్రేకింగ్ హార్డ్‌వేర్ ఈ బైక్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 125సీసీ మోటార్ సైకిల్ విభాగంలో సింగిల్-ఛానల్ ఏబీఎస్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐబీఎస్) రెండింటినీ కలిపి అందించడం ఇదే తొలిసారి. వర్షాకాలంలో తడిసిన రోడ్లు లేదా అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు బైక్ స్కిడ్ కాకుండా స్థిరంగా ఆగిపోవడానికి, బ్రేకింగ్ దూరం తగ్గించడానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది.

ఎమర్జెన్సీ సేఫ్టీ: పానిక్ బ్రేక్ అలర్ట్..

బ్రేకింగ్ టెక్నాలజీతో పాటు మరిన్ని ఆధునిక రక్షణ ఫీచర్లను కూడా ఇందులో పొందుపరిచారు. బైకర్ వేగంగా వెళ్తూ ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేసినప్పుడు వెనుక వచ్చే వాహనదారులను హెచ్చరించేలా ఎల్‌ఈడీ ఇండికేటర్లు వేగంగా మినుకుమినుకుమనే 'పానిక్ బ్రేక్ అలర్ట్' ఫీచర్‌ను జోడించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలను నివారించడానికి హజార్డ్ లాంప్స్ సదుపాయాన్ని సైతం ఇచ్చారు.

స్పోర్టీ లుక్స్.. కొత్త కలర్ ఆప్షన్లు..

గ్లామర్ ఎక్స్ తన మస్క్యులర్ డిజైన్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. హీరో సిగ్నేచర్ 'హెచ్' షేప్ ఎల్‌ఈడీ లైటింగ్ ప్యాకేజ్ బైక్‌కు రూపాన్ని మరింత మెరుగుపరిచింది. ఈ కొత్త ఏబీఎస్ వేరియంట్ నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అందులో గన్ మెటల్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే అనే రెండు సరికొత్త కలర్లను పరిచయం చేయగా, బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ టీల్ బ్లూ రంగులు కొనసాగుతున్నాయి.

60కి పైగా ఫీచర్లతో డిజిటల్ కన్సోల్..

సాంకేతికత విషయంలో గ్లామర్ ఎక్స్ బైక్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇందులో 10.7 సెంటీమీటర్ల అడాప్టివ్ మల్టీ-కలర్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్‌ను అందించారు. ఇందులో గేర్ షిఫ్ట్ అడ్వైజరీ, డిస్టెన్స్-టు-ఎంటీ, రియల్ టైమ్ మైలేజ్ వంటి 60కి పైగా ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్ హెచ్చరికలు డిస్‌ప్లేపైనే కనిపిస్తాయి.

పవర్‌ఫుల్ ఇంజిన్.. మూడు రైడ్ మోడ్లు

ఈ బైక్‌లో 125సీసీ స్ప్రింట్-ఈబీటీ ఇంజిన్ ఉపయోగించారు. ఇది 8,250 ఆర్పీఎం వద్ద 11.4 బీహెచ్​పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. కంబషన్ ప్రక్రియలో సౌండ్, వైబ్రేషన్లు రాకుండా ఇంజిన్‌ను డిజైన్ చేశారు. ఇందులో ఈకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్లు లభిస్తాయి. లాంగ్ రైడింగ్ చేసేవారికి అలసట తగ్గించేందుకు, ఇంధన పొదుపు పెంచేందుకు క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సీటు కింద మొబైల్ స్టోరేజ్, టైప్-సీ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి రోజువారీ అవసరాల ఫీచర్లు కూడా ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More