హిందుస్థాన్ జింక్ క్యూ3 రిజల్ట్స్: రూ.3,916 కోట్ల ఆల్-టైమ్ రికార్డు లాభం

వేదాంత గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ డిసెంబర్ త్రైమాసికంలో అద్భుత ఫలితాలను సాధించింది. వెండి ధరల పెరుగుదలతో కంపెనీ నికర లాభం 46% పెరిగి రూ.3,916 కోట్లకు చేరింది. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభం కావడం విశేషం.

Published on: Jan 19, 2026, 15:45:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం వేదాంత గ్రూపునకు చెందిన ‘హిందుస్థాన్ జింక్’ ఆర్థిక ఫలితాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. సోమవారం (జనవరి 19) విడుదల చేసిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక (క్యూ3) గణాంకాల్లో కంపెనీ అదరగొట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు అమాంతం పెరగడం, నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరచడంతో సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ ఆదాయం, రికార్డు స్థాయి లాభాలను తన ఖాతాలో వేసుకుంది.

హిందుస్థాన్ జింక్ క్యూ3 రిజల్ట్స్: రూ.3,916 కోట్ల ఆల్-టైమ్ రికార్డు లాభం (REUTERS)
హిందుస్థాన్ జింక్ క్యూ3 రిజల్ట్స్: రూ.3,916 కోట్ల ఆల్-టైమ్ రికార్డు లాభం (REUTERS)

ఆకాశమే హద్దుగా లాభాల పంట

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో హిందుస్థాన్ జింక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) ఏకంగా 46.22 శాతం వృద్ధి చెంది రూ.3,916 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.2,678 కోట్లుగా మాత్రమే ఉంది. కంపెనీ ఆదాయం, ఎబిటా (EBITDA) రికార్డు స్థాయిలో పెరగడమే ఈ చారిత్రాత్మక లాభాలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇక ఆదాయం విషయానికొస్తే.. గతేడాది రూ.8,315 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం, ఈసారి 27.80 శాతం పెరిగి రూ.10,627 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) చూసినా, ఆదాయంలో 28 శాతం, లాభంలో 48 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.

వెండి వెలుగులు.. పెరిగిన మార్జిన్లు

కంపెనీ లాభదాయకతలో వెండి కీలక పాత్ర పోషించింది. "మా మొత్తం లాభాల్లో వెండి వంటి విలువైన లోహాల వాటా ఈ త్రైమాసికంలో 44 శాతానికి పెరిగింది" అని హిందుస్థాన్ జింక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) సందీప్ మోడీ వివరించారు.

కంపెనీ నిర్వహణ లాభం (EBITDA) 34 శాతం వృద్ధి చెంది రూ.6,087 కోట్లుగా నమోదైంది. కేవలం లాభాలు పెరగడమే కాకుండా, ఎబిటా మార్జిన్లు 55 శాతానికి చేరుకోవడం ఆ రంగానికి చెందిన నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది పరిశ్రమలోనే అత్యుత్తమ మార్జిన్ కావడం గమనార్హం.

భవిష్యత్తుపై ధీమా

బలమైన బ్యాలెన్స్ షీట్, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, తక్కువ ఉత్పత్తి వ్యయం వంటి అంశాలు తమకు కలిసొచ్చాయని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తూ పెట్టుబడిదారులకు మెరుగైన రాబడులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంస్థ ధీమా వ్యక్తం చేసింది.

సోమవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి హిందుస్తాన్ జింక్ 3.53 శాతం లాభపడింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More