IMD rain alert : కేరళ నుంచి కశ్మీర్​ వరకు.. రుతుపవనాల రుద్రరూపం! 5 రాష్ట్రాలు అతలాకుతలం

Delhi rains today : భారతదేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. గత 24 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలు జలమయమయ్యాయి. వరదలు, భవన కూలిపోవడం, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి.

Published on: Jul 9, 2026, 10:28:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూన్ నెలలో అసలు కనిపించకుండా పోయిన నైరుతి రుతుపవనాలు ఈ నెలలో మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి! గడిచిన 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన రికార్డు స్థాయి వర్షాలు పలు రాష్ట్రాలను ముంచెత్తాయి. అకస్మాత్తుగా దూసుకొచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం వంటి ఘటనలతో దేశంలో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో, జాతీయ రహదారులపై చిక్కుకుపోయారు.

ముంబైలో భారీ వర్షాలు..
ముంబైలో భారీ వర్షాలు..

పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రులతో ఫోన్​లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల సహాయార్థం కేంద్ర బలగాలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని, రాష్ట్రాలకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో రెడ్ అలర్ట్..

దేశ రాజధాని దిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్​లలో.. ఇప్పటికే, ఈ సీజన్​లోనే అత్యంత భారీ వర్షం నమోదైంది. కేవలం 24 గంటల వ్యవధిలో మయూర్ విహార్ లో 102 ఎంఎం, పూసాలో 83 ఎంఎం, లోధి రోడ్డులో 80ఎంఎం అత్యధిక వర్షపాతం నమోదైంది.

బుధవారం వర్షం కురుస్తున్న సమయంలోనే దిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక నాలుగు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భవనం లోపల ప్లంబింగ్ పనులు జరుగుతున్నాయని, పిల్లర్లు, బీమ్స్ కటింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

దిల్లీలోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇలా.. (HT_PRINT)
దిల్లీలోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇలా.. (HT_PRINT)

సదర్ బజార్, గ్రేటర్ కైలాష్, బదర్‌పూర్ వంటి కీలక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఐటీఓ, మింటో బ్రిడ్జ్ వద్ద ఈసారి నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, రింగ్ రోడ్, జాతీయ రహదారి-48పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గురుగ్రామ్‌లో ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేక, రోడ్లపై వాహనాలు మునిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇక వాతావరణ శాఖ (ఐఎండీ) దిల్లీ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన 'రెడ్ అలర్ట్' జారీ చేయగా, పొరుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

వాతావరణ నిపుణుడు నవదీప్ దహియా సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తూ.. రాబోయే 12 గంటలు దిల్లీకి అత్యంత కీలకమని, రుతుపవనాల ప్రభావంతో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

ముంబైలో లోకల్ రైళ్లకు బ్రేక్.. గుజరాత్​లో విలయం!

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో వర్షాల తీవ్రతకు జనజీవనం అతలాకుతలమైంది. మరీ ముఖ్యంగా ముంబైలో గత వారం రోజులుగా వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల లైఫ్‌లైన్ లాంటి లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బోర్‌ఘాట్ సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పుణె మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పింప్రి చించ్వాడ్‌లో భారీ చెత్త కుప్ప (డంపింగ్ యార్డ్ దిబ్బ) కూలిపోవడంతో దాని కింద 11 మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నాయి.

ముంబై శివారు ప్రాంతంలో ఇలా.. (AP Photo/Rafiq Maqbool)
ముంబై శివారు ప్రాంతంలో ఇలా.. (AP Photo/Rafiq Maqbool)

మరోవైపు గుజరాత్​లోని సూరత్ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వరద ఉధృతికి గుజరాత్​లో ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వసాయి-విరార్ సెక్షన్ లో రైల్వే ట్రాక్‌లు నీట మునిగిపోవడంతో గుజరాత్ వెళ్లే సుదూర ప్రాంతాల రైళ్లను రద్దు చేయడం లేదా నిలిపివేయడం చేశారు. లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు అందజేస్తున్నారు.

కేరళ, కశ్మీర్​లలో కొండచరియల విలయం..

దక్షిణాది రాష్ట్రమైన కేరళలో వయనాడ్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అక్కడ ఒక టన్నెల్ ప్రాజెక్ట్ వద్ద తవ్విన మట్టి దిబ్బ కుప్పకూలడంతో మంగళవారం ఐదుగురు కార్మికులు గల్లంతయ్యారు. కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

వయనాడ్​లో సీఎం పర్యటన.. (HT_PRINT)
వయనాడ్​లో సీఎం పర్యటన.. (HT_PRINT)

ఉత్తరాది జమ్ముకశ్మీర్​లోని డోడా జిల్లాలో మేఘావృతం కావడంతో అకస్మాత్తుగా ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్​లో కూడా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కోటా జిల్లాలోని రాంగంజ్ మండిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More