Rain alert : ముంబై ప్రజలను గడగడలాడిస్తున్న ఐఎండీ హెచ్చరికలు- 24 గంటలు జాగ్రత్త..

Mumbai rains : భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం అవుతోంది. ఇంకొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ మేరకు రెడ్​ అలర్ట్​ని జారీ చేసింది.

Published on: Jul 4, 2026, 09:59:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. జులై 4 నుంచి జులై 6 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ముంబై వర్షాల అప్డేట్స్ ఇలా..
ముంబై వర్షాల అప్డేట్స్ ఇలా..

ముఖ్యమంత్రి హెచ్చరిక.. అప్రమత్తమైన యంత్రాంగం

ముంబై సహా కొంకణ్, సెంట్రల్ మహారాష్ట్రలోని ఘాట్ రోడ్లలో జులై 6 వరకు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ముంబై నగరంతో పాటు రాయగఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ వర్తిస్తుందని తెలిపారు. అలాగే సతారా, పూణే, నాసిక్ జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంఓ పేర్కొంది.

వర్షాల కారణంగా ప్రజా రవాణా, స్థానిక ప్రయాణాలకు ఆటంకం కలగవచ్చని, కొన్ని పాత నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు..

ప్రజల సహాయార్థం ప్రభుత్వం వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల అత్యవసర నంబర్లను విడుదల చేసింది:

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ): 1916

పాల్ఘర్ హెల్ప్‌లైన్: 02525 297474, +91 82379 78873

థానే మున్సిపల్ కార్పొరేషన్: 022-25364779, 022-25301740, +91 93723 38827

థానే విపత్తు నిర్వహణ విభాగం : 1800-222-108 / 8657887101

పన్వెల్ మున్సిపల్ కార్పొరేషన్ : 022-27458040 / 41 / 42

సముద్రంలో ఎగిసిపడనున్న అలలు..

మరోవైపు ముంబై తీరంలో నేడు (శనివారం) మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో 4.26 మీటర్ల ఎత్తులో భారీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని బీఎంసీ హెచ్చరించింది. ప్రజలు, పర్యాటకులు సముద్ర తీరాలకు దూరంగా ఉండాలని సూచించింది.

ముంబైలో భారీ వర్షాలు- లోకల్ ట్రైన్స్ నడుస్తున్నాయా?

ముంబై లైఫ్ లైన్ అయిన లోకల్ రైళ్ల రాకపోకలపై సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు స్పష్టతనిచ్చాయి.

సెంట్రల్ రైల్వే: ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, థానే, బేలాపూర్ రూట్లలో లోకల్ రైళ్లు ప్రస్తుతం సాధారణంగానే నడుస్తున్నాయని ప్రకటించింది.

వెస్ట్రన్ రైల్వే: ముంబై సబర్బన్, హార్బర్ లైన్ పరిధిలోని లోకల్ రైలు సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా సాగుతున్నాయని స్పష్టం చేసింది.

బీఎంసీ విపత్తు నిర్వహణ విభాగం..

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలను సమన్వయం చేస్తూ బీఎంసీ విపత్తు నిర్వహణ విభాగం నిరంతరం శ్రమిస్తోంది. ఈ విభాగానికి సంబంధించిన ప్రధాన ముఖ్యాంశాలు:

రౌండ్ ది క్లాక్ పర్యవేక్షణ: కంట్రోల్ రూమ్‌లో కేవలం 30 మంది సభ్యులతో కూడిన బృందం 24 గంటల పాటు షిఫ్టుల వారీగా పనిచేస్తూ నగరంలో పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

సీసీటీవీ సర్వైలెన్స్: నగరంలోని ప్రధాన కూడళ్లు, నీరు నిలిచే ప్రాంతాలను గమనించడానికి ఏకంగా 10,500 సీసీటీవీ కెమెరాల లైవ్ ఫుటేజీని ఈ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం మానిటర్ చేస్తున్నారు.

భారీగా కాల్స్: గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజల నుంచి వచ్చిన 6,000 కి పైగా అత్యవసర కాల్స్‌ను స్వీకరించి, వారికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

వివిధ విభాగాలతో సమన్వయం: క్షేత్రస్థాయిలో ఉన్న సుమారు 7,000 మందికి పైగా బీఎంసీ సిబ్బందితో పాటు రైల్వే, పోలీసు, ఫైర్ బ్రిగేడ్ వంటి మరో 60 ప్రభుత్వ ఏజెన్సీలతో ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.

నిజనిర్ధారణ : వరదలు, వర్షాలపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, వైరల్ అవుతున్న వదంతులను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజలకు నిజమైన సమాచారాన్ని చేరవేస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More