Hyderabad rains : ఇక దంచికొట్టనున్న వర్షాలు! హైదరాబాద్​, ముంబై సహా ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్..

IMD rain alert : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా బులెటిన్ ప్రకారం నైరుతి రుతుపవనాలు దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఇవి మరింత ముందుకు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.

Published on: Jun 25, 2026, 09:08:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో వర్షాలు ఊపందుకున్నాయి! ఇంతకాలం నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు శరవేగంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా వెదర్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బీహార్‌లోని మిగిలిన ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. జూన్ 24 నాటికి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర వ్యాప్తంగా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, రాజస్థాన్, బీహార్, సిక్కిం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది.

హైదరాబాద్​లో వర్షాల అనంతరం పరిస్థితి..
హైదరాబాద్​లో వర్షాల అనంతరం పరిస్థితి..

వివిధ ప్రాంతాల వారీగా వాతావరణ సూచనలు..

తూర్పు భారతదేశం :

పశ్చిమ తీరం, ఈశాన్య భారతదేశం, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈ వారం పొడవునా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 28 వరకు, అలాగే తిరిగి జూన్ 30న ఇక్కడ వర్షాలు పడవచ్చు. ఝార్ఖండ్‌లో జూన్ 27 వరకు, మళ్లీ జూన్ 29, 30 తేదీల్లోనూ.. ఒడిశాలో జూన్ 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మధ్య భారతదేశం :

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఈరోజు (జూన్ 25), అలాగే జూన్ 27 నుంచి 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా రాబోయే నాలుగు రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుంది.

నార్త్ వెస్ట్ ఇండియా :

పంజాబ్‌లో జూన్ 25-26, జూన్ 29-30 తేదీల్లో.. హర్యానా, చండీగఢ్, దిల్లీలలో జూన్ 25-26 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో జూన్ 29-30 తేదీల్లో, తూర్పు రాజస్థాన్‌లో జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు కురుస్తాయి. పశ్చిమ రాజస్థాన్‌లో ఈరోజు ఇసుక తుఫానులు వచ్చే అవకాశం ఉందని, జూన్ 27-28 తేదీల్లో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రాబోయే కొద్ది రోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి.

ఈశాన్య భారతదేశం :

అసోం, మేఘాలయలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో జూన్ 27 వరకు.. అరుణాచల్ ప్రదేశ్‌లో జూన్ 30 వరకు భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.

పశ్చిమ భారతదేశం :

కొంకణ్, గోవా ప్రాంతాలలో జూన్ 25-26, జూన్ 28-30 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మధ్య మహారాష్ట్రలో జూన్ 25-27, జూన్ 30 తేదీల్లో, అలాగే మరాఠ్వాడాలో జూన్ 25న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ భారతదేశం - తెలుగు రాష్ట్రాలు :

తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలలో జూన్ 27-29 మధ్య.. కేరళ, మాహేలలో జూన్ 27-30 వరకు.. లక్షద్వీప్‌లో జూన్ 28న వర్షాలు కురుస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, కోస్తా కర్ణాటకతో పాటు తెలంగాణలో హైదరాబాద్​ సహా ఇతర ప్రాంతాల్లో జూన్ 25 నుంచి 30 వరకు (ఐదు రోజుల పాటు) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో జూన్ 28-30 వరకు, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలో జూన్ 27-30 వరకు వర్షాలు పడతాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో జూన్ 26 నుండి 28 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.

నగరాల వారీగా హెచ్చరికలు..

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున హైదరాబాద్, భువనేశ్వర్, జైపూర్, భోపాల్ నగరాలకు ఐఎండీ ఈరోజు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రాయ్‌పూర్‌లో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున 'ఆరెంజ్ అలర్ట్' ఇచ్చారు. ముంబైలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మిత్రపాటి వర్షాలు పడే అవకాశం ఉండటంతో 'ఎల్లో అలర్ట్' కొనసాగుతోంది. అయితే, దేశ రాజధాని దిల్లీకి మాత్రం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను ఉపసంహరించుకుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More