IMD rain alert : ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. తెలంగాణ, ఏపీ సహా 11 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. గంటకు 70 కి.మీ వేగంతో బలమైన గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలు..

Published on: Sep 23, 2026, 09:10:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో వర్షపాతం మళ్లీ పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దక్షిణ, మధ్య, తూర్పు భారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం నుంచి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది.

ఐఎండీ రెయిన్ అలర్ట్ అప్డేట్స్..
ఐఎండీ రెయిన్ అలర్ట్ అప్డేట్స్..

తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఈదురుగాలుల బీభత్సం

కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మారిన వాతావరణం కారణంగా వర్ష ప్రభావం తీవ్రంగా ఉండనుంది. బుధ, గురువారాల్లో ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్లే తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన వచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ తీవ్రవాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 140 కిలోమీటర్లు, పూరీకి 210 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్నట్టుండి భారీ వర్షం పడితే రహదారుల దిగ్బంధం, డ్రైనేజీ వ్యవస్థలు పొంగిపొర్లడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ముప్పుంది. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడవద్దని, పాత భవనాలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

దక్షిణాది, మధ్య భారత్‌పై వర్షాల తీవ్రత..

కర్ణాటకలోని కోస్తా, ఉత్తర-దక్షిణ లోతట్టు ప్రాంతాల్లో గురువారం నాటికి అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, విదర్భ, ఒడిశాలలోనూ బుధవారంతో పాటు గురువారం వాన తీవ్రత పెరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో గురువారం అత్యంత భారీ వర్షాలు కురిసే ముప్పుంది. ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలోనూ జలదిగ్బంధం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దిల్లీలో పొడి వాతావరణం.. ఉత్తరప్రదేశ్‌లో వానలు

దిల్లీ, దాని పరిసర జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్​సీఆర్) బుధవారం వాతావరణం పొడిగానే ఉండనుంది. సెప్టెంబర్ 28 వరకు దిల్లీ, హరియాణా ప్రాంతాలకు ఎలాంటి తీవ్ర వర్ష హెచ్చరికలు లేవు. అయితే, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో గురువారం నుంచి, బీహార్‌లో శుక్రవారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయల్లోనూ శుక్రవారం వరకు విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

వర్షాల తీవ్రత దృష్ట్యా ఆయా రాష్ట్రాల విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More