ప్రతి 3 కార్లలో 2 ఎస్‌యూవీలే.. భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా నడుస్తోంది. మొత్తం ప్రయాణ వాహనాల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 65 శాతానికి చేరిందని రూబిక్స్ డేటా సైన్సెస్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి 3 కార్లలో 2 ఎస్‌యూవీలే అని స్పష్టం చేసింది.
చిన్న చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లు రోజువారీ రాకపోకలకు ఉపయోగపడుతూ, ఎక్కువ మైలేజ్ ఇస్తూ భారతీయ ప్రయాణ వాహన మార్కెట్‌ను శాసించిన రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి! గత కొన్ని సంవత్సరాల్లో వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలో కూడా ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్లు, ఎంపీవీల వంటి యుటిలిటీ వాహనాలు మార్కెట్‌లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2026 నాటికి మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 65 శాతానికి ఎగబాకింది. అంటే భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి మూడు కార్లలో రెండు కార్లు ఎస్‌యూవీలే ఉండటం విశేషం!

రూబిక్స్ డేటా సైన్సెస్ విడుదల చేసిన తాజా ఇండస్ట్రీ ఇన్సైట్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రయాణ వాహనాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన దాదాపు 8శాతం వృద్ధిని నమోదు చేశాయి. వినియోగదారుల డిమాండ్‌లో వస్తున్న ఈ నిర్మాణాత్మక మార్పు ఆటోమొబైల్ రంగానికి సరికొత్త దిశను నిర్దేశిస్తోంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా ఎగుమతుల్లోనూ భారతీయ ఆటో రంగం సరికొత్త రికార్డులను సృష్టించింది. సౌతాఫ్రికా, సౌదీ అరేబియా, మెక్సికో, జపాన్, యూఏఈ దేశాలు భారత్ నుంచి కార్లను దిగుమతి చేసుకుంటున్న ప్రధాన మార్కెట్లుగా అవతరించాయి. ప్రభుత్వ విధానాల ప్రోత్సాహం, వ్యూహాత్మక పెట్టుబడులు, సులువుగా అందుబాటులోకి వస్తున్న ఫైనాన్స్ సదుపాయాలు, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, అలాగే పాత కార్లను మార్చుకునే ట్రెండ్ వంటి అంశాలు ఈ రంగాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం ప్రయాణ వాహనాల ఉత్పత్తి, విక్రయాల పరంగా భారత్ ప్రపంచ వేదికపై తిరుగులేని స్థానంలో కొనసాగుతోంది. కార్ల తయారీలో అలాగే విక్రయాల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానాన్ని దక్కించుకుంది.
నివేదికలోని వివరాల ప్రకారం.. 2021 ఆర్థిక సంవత్సరంలో 3.06 మిలియన్ యూనిట్లుగా ఉన్న ప్రయాణ వాహనాల ఉత్పత్తి, 2026 నాటికి ఏటా 13 శాతం సీఏజీఆర్ వృద్ధితో 5.54 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఇక దేశీయ ప్యాసింజర్ వెహికల్ విక్రయాలు 2.71 మిలియన్ల నుంచి 4.64 మిలియన్ యూనిట్లకు పెరిగాయి. 2025లో కొంత మందగమనం కనిపించినప్పటికీ, 2026 నాటికి అమ్మకాలు మళ్లీ వేగంగా పుంజుకున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు వాహనాలపై పన్ను భారాన్ని తగ్గించగా, రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను తగ్గించడం వల్ల లోన్లు సులభంగా మారడం ఈ రికవరీకి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
యూటిలిటీ వాహనాల వైపు వినియోగదారులు భారీగా మొగ్గు చూపుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ప్యాసింజర్ వెహికల్ విక్రయాల్లో వీటి వాటా 2021లో 39 శాతంగా ఉండగా, 2025 నాటికి ఏకంగా 65 శాతానికి దూసుకెళ్లింది. ఎగుమతుల విషయానికి వస్తే.. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, వోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు కాంపాక్ట్ కార్లు, యూవీల ఎగుమతులను భారీగా పెంచాయి. ఒక్క మారుతీ సుజుకీ మాత్రమే రికార్డు స్థాయిలో 4.47 లక్షల యూనిట్లను ఎగుమతి చేసి 34 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత, ప్రభుత్వ నిబంధనలు కూడా ఆటో రంగాన్ని పూర్తిగా మారుస్తున్నాయి. ప్రయాణ వాహనాలలో అడాస్ టెక్నాలజీ వినియోగం 2024 ప్రథమార్థంలో 6.2 శాతంగా ఉండగా, 2025 నాటికి అది 8.3 శాతానికి పెరిగింది. త్వరలో రానున్న యూరో 7 నిబంధనలకు అనుగుణంగా బీఎస్-7 ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో వాహనాల రూపకల్పనలో మరోసారి భారీ మార్పులు రానున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకం వేగంగా పుంజుకుంటోంది. ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లలో ఈవీల వాటా 2022లో కేవలం 1 శాతంగా ఉండగా, 2025 నాటికి అది 4 శాతానికి చేరింది. కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల లాంచ్‌లతో 2026 నాటికి మొత్తం ఫోర్-వీలర్ ఈవీల వాటా 5.35 శాతానికి చేరుకుందని నివేదిక స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


