PF account : పీఎఫ్ అకౌంట్ వివరాల్లో తప్పులు ఉంటే డబ్బులు రావు! ఎలా సరి చేసుకోవాలి?
మీ పీఎఫ్ ఖాతాలో పేరు, పుట్టిన తేదీ లేదా ఉద్యోగంలో చేరిన తేదీల్లో తప్పులుంటే పీఎఫ్ క్లెయిమ్‌లు ఆగిపోయే ప్రమాదం ఉంది! ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్ ద్వారా జాయింట్ డిక్లరేషన్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ సవరణలను సులువుగా ఎలా పూర్తి చేయాలో వివరంగా తెలుసుకోండి..
ఉద్యోగస్తులకు భవిష్య నిధి (పీఎఫ్) ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవాలని భావించినప్పుడు ఖాతా వివరాల్లో చిన్న తప్పు ఉన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. పేరులో అక్షర దోషాలు, పుట్టిన తేదీ, జెండర్ లేదా ఉద్యోగంలో చేరిన తేదీల్లో వ్యత్యాసాలు ఉంటే ఈపీఎఫ్‌ఓ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిలిచిపోతుంది లేదా ఆలస్యమవుతుంది. కాబట్టి ప్రతీ ఉద్యోగి కాలానుగుణంగా తమ పీఎఫ్ పాస్‌బుక్, ప్రొఫైల్ వివరాలను సరిచూసుకోవడం ఎంతో అవసరం.

సుమారు 30 కోట్ల మంది సభ్యులకు సంబంధించి దాదాపు రూ. 30 లక్షల కోట్ల రిటైర్మెంట్ పొదుపు నిధులను ఈపీఎఫ్‌ఓ నిర్వహిస్తోంది. ఇక సభ్యుల వ్యక్తిగత, ఉద్యోగ వివరాల్లో తప్పులను సరిచేసుకోవడానికి ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ జాయింట్ డిక్లరేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈపీఎఫ్ వివరాల్లో తప్పులను సవరించే విధానం..
పీఎఫ్ రికార్డుల్లో తప్పులను సరిచేయడానికి ఈపీఎఫ్‌ఓ మెంబర్ సేవా పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి పాటించాల్సిన దశలు ఇవే:
పోర్టల్ లాగిన్: ముందుగా ఈపీఎఫ్‌ఓ మెంబర్ ఇంటర్‌ఫేస్ పోర్టల్ (unifiedportal-mem.epfindia.gov.in) ఓపెన్ చేసి, మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
జాయింట్ డిక్లరేషన్ ఎంపిక: మేనేజ్ ట్యాబ్‌లోకి వెళ్లి ‘జాయింట్ డిక్లరేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
వివరాల ఎంపిక: మీరు సవరించాలనుకుంటున్న వివరాలను (పేరు, డోబ్, జెండర్ మొదలైనవి) ఎంచుకోవాలి.
సరైన సమాచారం, పత్రాల అప్‌లోడ్: సరైన వివరాలను నమోదు చేసి, వాటికి మద్దతుగా ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా పదో తరగతి మార్కుల మేమో వంటి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
సబ్మిషన్: వివరాలు సరిచూసుకుని అప్లికేషన్ సమర్పించాలి.
ఈ దరఖాస్తు పూర్తయ్యాక మీ యజమాని (ఎంప్లాయ్) ఆమోదం తెలిపిన తర్వాత ఈపీఎఫ్‌ఓ అధికారులు పరిశీలించి మార్పులను అప్‌డేట్ చేస్తారు. మెంబర్ పోర్టల్‌లో అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ సౌకర్యం వీలుకాని పక్షంలో పోర్టల్ నుంచి జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని, యజమాని సంతకం, స్టాంప్‌తో పాటు అవసరమైన పత్రాలను జతచేసి సమీప ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో సమర్పించవచ్చు.
పాత కంపెనీతో సంబంధం లేకుండా 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' మార్చవచ్చా?
ఉద్యోగం మానేసిన తర్వాత పాత కంపెనీ యజమానిపై ఆధారపడకుండా ఉద్యోగులు స్వయంగా ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌ఓ కల్పించింది.
అయితే దీనికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగం వదిలేసిన 2 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. అలాగే మీరు నమోదు చేసే తేది, మీ పాత కంపెనీ చివరిసారిగా చెల్లించిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ నెలకు అనుగుణంగా ఉండాలి. మీ యూఏఎన్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటంతో పాటు, ఆధార్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉంటే ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
మెంబర్ పోర్టల్‌లోని మేనేజ్ ట్యాబ్‌లో ఉన్న ‘మార్క్ ఎగ్జిట్’ ఆప్షన్ ఎంచుకుని ఈ మార్పులు చేయవచ్చు. అయితే పే-స్లిప్‌లు, రిలీవింగ్ లెటర్‌లోని తేదీలను సరిచూసుకున్న తర్వాతే ఈ మార్పులు చేయాలి.
ఒకవేళ ఆన్‌లైన్ సిస్టమ్ అనుమతించకపోతే పాత కంపెనీని సంప్రదించాలి. వారు స్పందించని పక్షంలో ఈపీఎఫ్‌ఓ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


