ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లు, ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్!

ఎల్‌నినో ఎఫెక్ట్ తెలంగాణపై పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఒంటిపూట బడులు, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడంపై చర్చ నడుస్తోంది. భాగ్యనగరంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ప్రతిపాదనలపై ఆలోచన జరుగుతోంది.

Updated on: Nov 5, 2026, 11:10:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుండటంతో విద్యాసంస్థలు, సమాజంలోని వివిధ వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. నీటి ఎద్దడి కారణంగా విద్యాసంస్థల నిర్వహణ సవాలుగా మారడంతో పాఠశాలలను ఒంటి పూట బడులుగా మార్చడం, కాలేజీలు, వర్సిటీల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మరోవైపు ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల నీటిపైనే ఆధారపడాల్సి రావడంతో ఐటీ సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) ఇవ్వడంపై ప్రతిపాదనలు వస్తున్నాయి.

ఎల్‌నినో ఎఫెక్ట్
ఎల్‌నినో ఎఫెక్ట్

హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య తలెత్తింది. దీంతో పలు కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు విద్యార్థులకు నీటి సమస్య కారణంగా సెలవులు ప్రకటించి ఇళ్లకు పంపించే అవకాశాలు ఉన్నాయి. విద్యాసంస్థలు తిరిగి ఎప్పుడు తెరుస్తారో స్పష్టత ఇవ్వకుండానే ఆన్‌లైన్ బోధన చేపడుతున్నారు కొందరు.

సుమారు 33 విద్యాసంస్థలు తీవ్ర నీటి సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. డిసెంబరు నాటికి నీటి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉండటంతో ఒంటి పూట బడులు (Half-Day Schools) నిర్వహించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు విద్యా సంవత్సరం దెబ్బతినకుండా ఉండేందుకు కోవిడ్ సమయం తరహాలోనే డిజిటల్ లేదా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలా వద్దా అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరిశీలన జరుపుతోందని తెలుస్తోంది.

దీనిపై విద్యార్థులు గానీ, యాజమాన్యాలు గానీ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆయా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశమై, పరిస్థితులను సమగ్రంగా సమీక్షించిన తర్వాతే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలోని బాసర త్రిపుల్ ఐటీలో సుమారు 9 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రోజుకు 25 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా, తీవ్ర నీటి కొరత వల్ల దసరా సెలవులను పొడిగించి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించారు. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా సెలవుల సమయంలో ఆన్‌లైన్ క్లాసులు నడుపుతున్న ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇక హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర పరిధిలోని ఐటీ కంపెనీలు ట్యాంకర్ నీటిపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. ఈ కారిడార్‌లోని దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు తగినంత నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు ఇస్తే రోజువారీ నీటి వాడకం తగ్గడమే కాకుండా విద్యుత్ ఆదా అవుతుందని ప్రతిపాదనలు వెలువడుతున్నాయి.

నీటి సమస్య కారణంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన సుమారు 20 లక్షల మంది ఉద్యోగులు సొంత ఊళ్లకు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ నుంచి ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా ప్రభుత్వం త్వరలోనే సూచనలు జారీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More