Bumrah : స్టాక్ మార్కెట్‌లో నష్టపోకుండా ఉండాలా? అయితే 'బుమ్రా' టెక్నిక్​ని ఫాలో అవ్వండి..

Jasprit Bumrah today match : మైదానంలో టీమిండియా ‘క్రైసిస్​ మేనేజర్​’గా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా.. స్టాక్​ మార్కెట్​ భాషలో ఒక 'బ్లూ-చిప్' స్టాక్‌ లాంటోడు! ఈ నేపథ్యంలో ఒక క్రమశిక్షణ గల ఇన్వెస్టర్ బుమ్రా నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో ఈ విశ్లేషణ వివరిస్తుంది.

Published on: Mar 6, 2026, 06:45:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రత్యర్థి జట్టు ఏదైనా.. పిచ్​ ఏదైనా.. స్టేడియం ఏదైనా.. మ్యాచ్​ని గెలిచేందుకు టీమిండియా వద్ద ఉన్న అస్త్రం ‘జస్ప్రీత్​ బుమ్రా’! టీ20 ప్రపంచ కప్​ 2026లో ఇంగ్లాండ్​తో జరిగిన సెమీ ఫైనల్​లో ఇది మరోసారి నిరూపితమైంది. స్కోర్ బోర్డు పరుగులు పెడుతున్నప్పుడు, ప్రత్యర్థి బ్యాటర్లు విరుచుకుపడుతున్నప్పుడు.. టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు బుమ్రా ఉంటాడు. బుమ్రా 4 ఓవర్లు గట్టెక్కితే చాలు గెలిచేస్తాం అనుకునే జట్లు ఎన్నో! సాధారణంగా టీ20 మ్యాచ్​ అంటే 20ఓవర్లు. కానీ ప్రత్యర్థులకు 16 ఓవర్లే! ఎందుకంటే.. బుమ్రా బౌలింగ్​లో వాళ్లు ఏమీ చేయలేరు.

టీమిండియా స్టార్​ బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా.. (PTI)
టీమిండియా స్టార్​ బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా.. (PTI)

మీరు నిశితంగా గమనిస్తే, బుమ్రా కేవలం ఒక బౌలర్ మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన 'వెల్త్ మేనేజర్'. బుమ్రా ఒక “బ్లూ-చిప్​” స్టాక్​ లాంటోడు! ఈ మేటి బౌలర్​ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ పాఠాలు ఎన్నో. వాటిల్లో కొన్ని.. మీకోసం..

జస్ప్రీత్​ బుమ్రా నుంచి నేర్చుకోవాల్సిన ఇన్వెస్ట్​మెంట్​ పాఠాలు..

1. తక్కువ రిస్క్ - ఎక్కువ లాభం

స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్నప్పుడు కూడా స్థిరంగా ఉండే అసెట్ కోసం ప్రతి ఇన్వెస్టర్ వెతుకుతుంటాడు. డెత్ ఓవర్లలో బుమ్రా ప్రదర్శన సరిగ్గా అలాగే ఉంటుంది.

మార్కెట్ ఒడిదుడుకులను టీ20 మ్యాచ్ చివరి ఓవర్లతో పోల్చండి. మిడ్-క్యాప్ స్టాక్స్ లాంటి ఇతర బౌలర్లు వికెట్లు తీసినా, భారీగా పరుగులు సమర్పించుకునే ప్రమాదం ఉంటుంది. కానీ బుమ్రా అలా కాదు.. మార్కెట్ ట్రెండ్‌కు విరుద్ధంగా అత్యల్ప ఎకానమీతో బౌలింగ్ చేస్తాడు. ఆయన మన పోర్ట్‌ఫోలియోలో హెచ్​డీఎఫ్​సీ లేదా రిలయన్స్ వంటి దిగ్గజ స్టాక్ లాంటివాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బుమ్రా వచ్చి ఒత్తిడిని తగ్గిస్తాడు.

2. యార్కర్ అంటే ‘హెడ్జింగ్’

క్రికెట్‌లో 'యార్కర్' అంటే ఏంటి? ఫైనాన్షియల్ భాషలో చెప్పాలంటే అది ఒక ‘హెడ్జ్’.

145 కిలోమీటర్ల వేగంతో పడే పక్కా యార్కర్ బ్యాటర్లకు పరుగులు తీసే అవకాశం ఇవ్వదు, అంటే మన పెట్టుబడికి నష్టం కలగకుండా రక్షణ కల్పిస్తుంది. మార్కెట్ నష్టాల నుంచి తప్పించుకోవడానికి మనం ఎలాగైతే 'స్టాప్-లాస్' లేదా 'డైవర్సిఫికేషన్' ఉపయోగిస్తామో.. బుమ్రా యార్కర్లు టీమిండియా స్కోరును అలాగే కాపాడతాయి. ఇతర బౌలర్లు పరుగులు ఇస్తున్నప్పుడు (బేరిష్​ మార్కెట్​), బుమ్రా తన యార్కర్లతో టీమ్ పరువును (నెట్​ వర్త్​) కాపాడుతాడు.

3. అసెట్ అలోకేషన్

ఒక తెలివైన ఇన్వెస్టర్ తన డబ్బునంతా ఒకే రకమైన స్టాక్స్‌లో పెట్టడు. బుమ్రా బౌలింగ్​ కూడా అంతే!

జస్ప్రీత్​ బుమ్రా కేవలం వేగంగా బౌలింగ్ చేయడు. ఆయన దగ్గర రకరకాల డెలివరీలు ఉన్నాయి: స్లోయర్ బాల్, అవుట్-స్వింగర్, బౌన్సర్, ప్రాణాంతకమైన యార్కర్.

పేస్​: ఇది ఆయన 'ఈక్విటీ' లాంటిది.. దూకుడుగా ఉంటూ గ్రోత్ ఇస్తుంది.

స్లోయర్ బాల్: ఇది 'డెట్ లేదా బాండ్స్' లాంటిది.. ఆట వేగాన్ని తగ్గించి, బ్యాటర్‌ను బోల్తా కొట్టిస్తుంది.

పిచ్ ఏదైనా, కండిషన్స్ ఎలా ఉన్న.. బుమ్రా దగ్గర ప్రతిదానికీ ఒక ప్లాన్ ఉంటుంది. ఇదే అసలైన డైవర్సిఫికేషన్!

మార్కెట్‌లో కొన్ని 'పెన్నీ స్టాక్స్' ఉంటాయి. ఒక్క సీజన్‌లో మెరిసి, తర్వాత మాయమైపోతాయి. కానీ బుమ్రా మాత్రం ఒక 'కాంపౌండర్'.

ఏ ఫార్మాట్ అయినా, ఏ దేశమైనా బుమ్రా వికెట్లు తీస్తూనే ఉంటాడు (స్టాక్​ మార్కెట్​ భాషలో చెప్పాలంటే డివిడెండ్లు వస్తూనే ఉంటాయి). 2023లో వెన్ను గాయం వల్ల ఆయన విరామం తీసుకున్నప్పుడు అందరూ ఆందోళన చెందారు. కానీ ఒక క్వాలిటీ స్టాక్.. మార్కెట్ కరెక్షన్ తర్వాత ఎలాగైతే 'ఆల్ టైమ్ హై'కి చేరుతుందో.. బుమ్రా కూడా అంతకంటే శక్తివంతంగా తిరిగి వచ్చాడు.

మంచి క్వాలిటీ ఉన్న చోట ఎంతటి ఒడిదుడుకులు వచ్చినా, దీర్ఘకాలంలో లాభాలు ఖాయమని బుమ్రా నిరూపించాడు.

కాబట్టి, వచ్చేసారి బుమ్రా బౌలింగ్ చేయడానికి పరిగెత్తుకు వస్తున్నప్పుడు.. కేవలం ఒక బౌలర్‌ను మాత్రమే చూడకండి. ఒక క్రమశిక్షణ గల ఇన్వెస్టర్‌ను చూడండి. ఈ ఇన్వెస్టర్​ నుంచి ఎంతో కొంత నేర్చుకోండి.

మీ ఆర్థిక ప్రయాణంలో కూడా కేవలం సిక్సర్లు కొట్టే స్టాక్స్ కోసం కాకుండా.. ఖచ్చితత్వం, క్రమశిక్షణ, క్లిష్ట పరిస్థితుల్లో గెలిపించే బుమ్రా లాంటి నమ్మకమైన అసెట్స్ కోసం వెతకండి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం ఉత్తమం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More