...
...
Next Story

సోనియా ఆత్మకథ వేదికపై ‘ఇండియా’ కూటమి బలప్రదర్శన

సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్’ ఆవిష్కరణ సభ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదు మిత్రపక్షాల నేతల రాకతో ‘ఇండియా’ కూటమి బలప్రదర్శనకు వేదికైంది. తన కుటుంబంపై అల్లిన కల్పిత కథలకు సమాధానంగానే ఈ పుస్తకం రాశానని సోనియా స్పష్టం చేశారు.

Published on: Nov 17, 2026, 09:58:43 IST
Advertisement

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్’ (Belonging) అధికారిక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదు మిత్రపక్షాల అగ్రనేతలు ఒకే వేదికపైకి రావడంతో ఈ సభ ‘ఇండియా’ కూటమి ఐక్యతకు, బలప్రదర్శనకు వేదికగా మారింది.

తరలివచ్చిన ‘ఇండియా’ కూటమి నేతలు

సోనియా ఆత్మకథ వేదికపై ‘ఇండియా’ కూటమి బలప్రదర్శన
సోనియా ఆత్మకథ వేదికపై ‘ఇండియా’ కూటమి బలప్రదర్శన

ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందు వరుసలో సోనియా గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి, ఎంపీ డింపుల్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య, ఎమ్మెల్యే కల్పనా సోరెన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆసీనులయ్యారు. వీరితో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ కూడా ముందు వరుసలో కూర్చున్నారు. ఇక రెండో వరుసలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. యూపీఏ హయాంలోని సీనియర్ నేతలు జనార్దన్ ద్వివేది, ఆనంద్ శర్మ, సల్మాన్ ఖుర్షీద్, మాంటెక్ సింగ్ అహ్లువాలియా సభకు హాజరయ్యారు.

"నా కుటుంబం, మా అత్తగారు, భర్త, కొడుకు, కూతురి గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో చాలా వరకు కల్పిత కథలే. మనసును గాయపరిచేలా మాట్లాడుతుంటారు. నా మనసులోని భావాలను, నా కుటుంబం గురించిన వాస్తవాలను బయటపెట్టడానికే ఈ పుస్తకం రాశాను" అని ఈ పుస్తక ప్రచురణకర్త హార్పర్ కాలిన్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పబ్లిషర్ పౌలోమి ఛటర్జీతో సోనియా గాంధీ పేర్కొన్నారు.

‘బిలాంగింగ్’ పేరు వెనుక ఆంతర్యం

"‘బిలాంగింగ్’ అంటే మనం ఇక్కడి వారమే అన్న భావన. మనం బయటివారమైనప్పుడు ఎవరూ మనల్ని ఇష్టపడటం లేదని, ఎప్పుడూ ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్నారన్న భయం వెంటాడుతుంది. ఏదైనా తప్పు చేస్తున్నామేమో, తప్పుగా మాట్లాడుతున్నామేమో అన్న ఆందోళన ఉంటుంది" అని సోనియా తన అనుభవాలను పంచుకున్నారు.

రాజీవ్ గాంధీ నియోజకవర్గమైన అమేథీలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు చూపిన ఆప్యాయత, ఆదరణ తనలోని 'బయటి వ్యక్తి' అన్న భావనను తొలగించాయని చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, కమలా నెహ్రూల మిగిలిన అస్థికలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేయడానికి రాజీవ్, సంజయ్ గాంధీలతో కలిసి వెళ్లాలని ఇందిరా గాంధీ తనను కోరడం కూడా తనను ఈ దేశంలో భాగంగా మార్చిందని పేర్కొన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తనను ఈ దేశం పూర్తిగా అంగీకరించిందన్న నమ్మకాన్ని కలిగించిందని ఆమె తెలిపారు.

"నా భర్త రాజకీయాల్లోకి రావడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాను. బహుశా నాది స్వార్థం కావచ్చు, ఆయన రాజకీయాల్లోకి వెళ్తే మాకున్న సమయమంతా కోల్పోతామని భయపడ్డాను. ఆయనకు ప్రయాణాలు ఎక్కువయ్యాయి. మా జీవితం మారిపోయింది, కానీ దొరికిన ఆ కొద్ది సమయమే ఎంతో విలువైనది కావడంతో మా బంధం మరింత బలపడింది" అని సోనియా వివరించారు.

జీవిత పోరాటాలు.. రాహుల్ భావోద్వేగం

రాజీవ్ గాంధీ హత్య తర్వాత తమ తల్లి ఎదుర్కొన్న భయానక రోజులను రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. "ఆమె ప్రాణం నాన్నే, నాన్న ప్రాణం అమ్మే. నాన్న దూరమయ్యాక ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండే అమ్మ అదృశ్యమై, ఒక కొత్త అమ్మ వచ్చింది. నానమ్మ, నాన్న చనిపోయే వరకు అమ్మ అందరితో ఎంతో కలివిడిగా ఉండేది. ఆ తర్వాత దేశ ప్రజలే 'నువ్వు మా దానివి' అంటూ ఆమెకు కొత్త ద్వారం తెరిచారు" అని రాహుల్ అన్నారు.

"నా జీవితంలో ఏ ఒక్కరోజూ ఆమె భయపడటం కానీ, వెనకడుగు వేయడం కానీ నేను చూడలేదు. నాన్న నిన్ను ఎంతో ప్రేమించారు, కానీ ఈరోజు నిన్ను చూసి ఆయన ఎంత గర్వపడతారో నేను చెప్పలేను" అని రాహుల్ పేర్కొన్నారు. తన తల్లి నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించారని రాహుల్ ఈ సందర్భంగా వెల్లడించారు.

అలాగే తన తల్లిదండ్రులు మొదట కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని ‘వర్సిటీ’ రెస్టారెంట్‌కు తాను తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిన విషయాన్ని రాహుల్ సరదాగా పంచుకున్నారు. "ఆ పసుపు రంగు తలుపు నాకు ఇప్పటికీ గుర్తుంది. అక్కడ ఏం బాగుంటుందని అడిగితే 'చికెన్ ఛాసూర్' అని చెప్పారు. అది తిన్నాక నాకు అర్థమైంది.. మీరు ప్రేమలో పడాలనుకుంటే కచ్చితంగా వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి, కానీ అక్కడ చికెన్ ఛాసూర్ మాత్రం అస్సలు తినకండి. అక్కడ ఆహారం అద్భుతంగా ఉంటుందని వీళ్లు (సోనియా వైపు చూపిస్తూ) గుర్తుపెట్టుకున్నారు కానీ, అది అస్సలు బాగోదు" అని రాహుల్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

ఇందిరా గాంధీతో అనుబంధం.. రచనా ప్రస్థానం

తొలుత ఈ పుస్తకం రాయడానికి తాను సంకోచించానని, కానీ రాహుల్, ప్రియాంకలతో పాటు తన సన్నిహితురాలు మంజులిక దూబే పదేపదే ప్రోత్సహించడంతోనే రాయడం మొదలుపెట్టానని సోనియా తెలిపారు. తన అత్తగారు, దివంగత ప్రధాని ఇందిరా గాంధీతో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆమెను ‘మా’ అని పిలవడానికి తొలుత తాను ససేమిరా అన్నానని చెప్పారు. ఇందిరా గాంధీ నుంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు.. "ఆమె నాకు క్రమశిక్షణ, సమయపాలన, ధైర్యం, దృఢ సంకల్పాన్ని నేర్పించారు" అని సోనియా బదులిచ్చారు.

పుస్తకం రాసేటప్పుడు కొన్నిసార్లు ఏమీ తోచక ఇబ్బంది పడ్డానని, తన పిల్లలే తనను ముందుకు నడిపించారని సోనియా చెప్పారు. యవ్వనంలోని జ్ఞాపకాలు సులభంగానే గుర్తొచ్చాయని, కానీ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలకు సంబంధించిన కొన్ని విషయాలను తాను మర్చిపోయినా రాహుల్, ప్రియాంకలకు అన్నీ గుర్తున్నాయని ఆమె పేర్కొన్నారు. జీవితంలో డైరీ రాసే అలవాటు లేకపోవడం తాను చేసిన పెద్ద పొరపాటు అని సోనియా అంగీకరించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks