ఏఐ సప్లై చైన్ రక్షణకు 10 దేశాల కూటమి.. ‘శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌’పై భారత్ సంతకం

కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలను కాపాడుకునేందుకు భారత్, అమెరికా సహా 10 దేశాలు ‘శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌’పై సంతకాలు చేశాయి. కీలక ఖనిజాలు, చిప్ డిజైన్, ఇంధన మౌలిక సదుపాయాలపై చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.

Published on: Nov 16, 2026, 17:30:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్ రంగాల్లో విదేశీ ఆధిపత్యానికి చెక్ పెడుతూ భారత్ కీలక అడుగు వేసింది. ఏఐ మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, చిప్ డిజైన్, ఇంధన నెట్‌వర్క్‌లకు రక్షణ కల్పించేందుకు అమెరికా సహా మరో ఎనిమిది మిత్రదేశాలతో కలిసి భారత్ కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 15న ‘శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆన్ ది సెక్యూర్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎండ్యూరింగ్ ప్రాస్పరిటీ’ పేరిట ఈ చారిత్రక ఒప్పందంపై 10 దేశాలు సంతకాలు చేశాయి.

ఏఐ సప్లై చైన్ రక్షణకు 10 దేశాల కూటమి.. డిక్లరేషన్‌పై భారత్ సంతకం
ఏఐ సప్లై చైన్ రక్షణకు 10 దేశాల కూటమి.. డిక్లరేషన్‌పై భారత్ సంతకం

ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ‘పాక్స్ సిలికా’ (Pax Silica) ఒప్పందానికి కొనసాగింపుగా ఈ డిక్లరేషన్ రూపుదిద్దుకుంది. నాటి ఒప్పందంలో భాగంగా ‘సిలికాన్ స్టాక్’ పరిరక్షణకు నమ్మకమైన దేశాల కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కీలక ఖనిజాల లభ్యత, సెమీకండక్టర్ల తయారీ, అధునాతన ఏఐ వ్యవస్థల భద్రత కోసం రూపొందించిన ఆ విస్తృత ప్రణాళికకు ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ద్వారా స్పష్టమైన ఆచరణ రూపం ఇచ్చారు.

10 దేశాల ఉమ్మడి కార్యాచరణ.. దేనిపై దృష్టి?

ఈ ఒప్పందంపై అమెరికా, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా (రిపబ్లిక్ ఆఫ్ కొరియా), ఖతార్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) సంతకాలు చేశాయి. సున్నితమైన సాంకేతికతలు, కీలక మౌలిక సదుపాయాల పరిరక్షణ అనే రెండు ప్రధాన అంశాలపై ఈ ఒప్పందం దృష్టి సారించింది.

"ప్రజల భద్రతను మన ఆర్థిక వ్యవస్థలు, సన్నిహిత భాగస్వాముల భద్రత నుంచి వేరు చేయలేం. సరఫరా వ్యవస్థల పటిష్టత, కీలక వ్యవస్థల సమగ్రత, విశ్వసనీయ సాంకేతికతల్లో నాయకత్వం జాతీయ భద్రతకు అత్యంత ముఖ్యం" అని డిక్లరేషన్‌లో సభ్య దేశాలు స్పష్టం చేశాయి.

ఆధునిక ఏఐ అభివృద్ధి అనేది చిప్ డిజైన్ నుంచి తయారీ పరికరాలు, నౌకాశ్రయాల వరకు అనేక దేశాల సరిహద్దులతో ముడిపడి ఉంది. ఏ ఒక్క దేశం ఒంటరిగా ఈ వ్యవస్థను కాపాడుకోలేదన్న ఉమ్మడి బాధ్యతతో ఈ 10 దేశాలు చేతులు కలిపాయి. వస్తువులు, సాఫ్ట్‌వేర్, ముడి పదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం, విడిభాగాలు అక్రమంగా చేతులు మారకుండా అడ్డుకోవడంతో పాటు, శత్రు దేశాల చేతికి చిక్కకుండా చూడాలని నిర్ణయించాయి.

మౌలిక సదుపాయాలు, డేటా భద్రతకు పెద్దపీట

ఏఐ సేవలకు వెన్నెముకగా నిలిచే భౌతిక, డిజిటల్ వ్యవస్థల భద్రతకు ఈ ఒప్పందంలో ప్రాధాన్యం ఇచ్చారు. అంతర్జాతీయ నౌకాశ్రయాలు, టెర్మినల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు, ఇంధన మౌలిక సదుపాయాలు సజావుగా పనిచేస్తేనే ఏఐ వ్యవస్థలు నిలబడతాయి. వీటికి ఏమాత్రం విఘాతం కలిగినా, శత్రువుల నియంత్రణలోకి వెళ్లినా, వీటి ద్వారా ప్రవహించే డేటా అనధికారికంగా బయటకు పొక్కినా తీవ్ర నష్టం జరుగుతుందని డిక్లరేషన్ హెచ్చరించింది.

చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే వ్యూహం

ప్రపంచ మార్కెట్‌లో కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని తగ్గించడం, ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న ఆర్థిక, సరఫరా ఒత్తిళ్లను తిప్పికొట్టడం ఈ ఒప్పందం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడాన్ని అడ్డుకోవడం, సైనిక లేదా నిఘా ప్రయోజనాలు చేకూర్చే సున్నితమైన సాంకేతికతలను ప్రత్యర్థి దేశాలు దక్కించుకోకుండా నిలువరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం ప్రపంచ కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. మైనింగ్‌లో సుమారు 60 శాతం, ప్రాసెసింగ్‌తో పాటు వేరు చేయడంలో 90 శాతం, శాశ్వత అయస్కాంతాల (Permanent Magnets) తయారీలో 94 శాతం వాటా చైనా చేతిలోనే ఉంది. అమెరికా విధించిన సెమీకండక్టర్ ఆంక్షలకు ప్రతీకారంగా డిసెంబర్ 2024లో చైనా తొలిసారిగా కీలక ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అమెరికాకు నేరుగా గాలియం, జెర్మేనియం ఎగుమతులను నిషేధించింది. అయితే, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లిథియం-అయాన్ బ్యాటరీలు, గ్రాఫైట్ యానోడ్ పదార్థాల ఎగుమతి నియంత్రణలపై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను చైనా 2027 జనవరి 10 వరకు పొడిగించింది.

భారత్‌కు దక్కే ప్రయోజనాలు.. అసలు పరీక్ష ఇక్కడే

ఫిబ్రవరిలో భారత్ సంతకం చేసిన పాక్స్ సిలికా ఒప్పందానికి కొనసాగింపుగా వచ్చిన ఈ శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్, భాగస్వామ్య దేశాలకు చిప్‌లు, కీలక ఖనిజాలు, ఇంధన మౌలిక సదుపాయాలు ఏ మేరకు అందుబాటులోకి వస్తాయనే దానిపైనే అసలు విజయం ఆధారపడి ఉంటుంది.

ఇదే అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో స్పందిస్తూ, "మేం కేవలం ఒక సదస్సును నిర్వహించడం లేదు.. భవిష్యత్తును నిర్మిస్తున్నాం. కొత్త పునాదులు పడుతున్నాయి, కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాం" అని పేర్కొన్నారు. "నేడు భారత ప్రతిభావంతులైన ఇంజనీర్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన 2-నానోమీటర్ చిప్‌లను డిజైన్ చేస్తున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమకు సుమారు పది లక్షల మంది కొత్త నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరమవుతారు. భారత్‌కు ఇది చాలా పెద్ద అవకాశం" అని ఆయన వివరించారు.

ఈ డిక్లరేషన్ ప్రకారం అత్యంత ప్రాధాన్యత కలిగిన సాంకేతికతలు, కీలక మౌలిక సదుపాయాల జాబితాను సభ్య దేశాలు పరస్పరం పంచుకుంటాయి. తద్వారా సాంకేతికత చోరీని, అక్రమ బదిలీలను, అనవసర విదేశీ నియంత్రణను అడ్డుకుంటాయి. సెమీకండక్టర్ డిజైన్, చిప్ తయారీ యంత్రాలు, కీలక ఖనిజాలతో సహా పూర్తి స్థాయి టెక్నాలజీ విభాగాన్ని వైవిధ్యభరితంగా మార్చేందుకు ఈ 10 దేశాలు కలిసి పనిచేయనున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More