2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు 20 మ్యాచ్‌ల సమరం.. భారత జట్టు ఎవరెవరితో ఆడనుంది?
న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ విజయంతో టీమ్ఇండియా 2027 ప్రపంచకప్ సన్నాహకాలకు శ్రీకారం చుట్టింది. మెగా టోర్నీకి ముందు భారత్ కనీసం 20 వన్డేలు ఆడనుంది. స్వదేశంలో శ్రీలంక, జింబాబ్వే సిరీస్‌లతో పాటు ఆసియా కప్, దక్షిణాఫ్రికా పర్యటన వివరాలివీ.
న్యూజిలాండ్ గడ్డపై టీమ్ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ నేతృత్వంలోని పేస్ దళం నిప్పులు చెరగడంతో భారత్ 22 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. హామిల్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను సైతం భారత్ 3-2తో గెలుచుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 209 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఛేదనలో న్యూజిలాండ్ 64/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ భారత పేసర్లు ఒక్కసారిగా విజృంభించడంతో కివీస్ 55 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. చివరకు 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది.
స్వదేశంలోని బ్యాటింగ్ పిచ్‌లపై పరుగుల వరద పారించే భారత బ్యాటర్లకు, న్యూజిలాండ్ పిచ్‌లు అసలైన సవాల్ విసిరాయి. వచ్చే ఏడాది అక్టోబరులో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2027 వన్డే ప్రపంచకప్ జరగనుంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ కివీస్ సిరీస్ భారత ఆటగాళ్లకు ఒక అవగాహన కల్పించింది. నమీబియా ఏ ఫార్మాట్‌లోనైనా ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
డిసెంబరులో శ్రీలంకతో.. 24 ఏళ్ల తర్వాత జింబాబ్వే రాక
ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు కనీసం 20 వన్డే మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సహా మరికొందరు ఆటగాళ్లు అక్కడే ఉండి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడతారు. వన్డే జట్టులోని మిగతా సభ్యులు స్వదేశానికి తిరిగి వస్తారు. డిసెంబరులో సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు వీరు సిద్ధమవుతారు.
కొత్త ఏడాది 2027 ప్రారంభంలో జింబాబ్వే జట్టు ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోసం భారత్‌కు రానుంది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జింబాబ్వే వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వస్తోంది. చివరిసారిగా 2002లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టుతో జింబాబ్వే ఐదు వన్డేల సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.
ఆసియా కప్, వెస్టిండీస్ పర్యటన అంచనాలు
వచ్చే ఏడాది ప్రపంచకప్‌నకు సన్నాహకంగా టీమ్ఇండియా వెస్టిండీస్‌లో పర్యటించే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ కరీబియన్ పర్యటన ఖరారైతే కనీసం మూడు వన్డేలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు 2027 జూన్ 18 నుంచి జులై 4 వరకు బంగ్లాదేశ్ వేదికగా ఆసియా కప్ జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో సాగే ఈ టోర్నీ ద్వారా మెగా టోర్నీకి ముందు భారత్‌కు మరిన్ని మ్యాచ్‌లు ఆడే వీలు కలుగుతుంది.
ముందుగానే దక్షిణాఫ్రికాకు.. ప్రొటీస్‌తో 6 వన్డేలు
2023 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన టీమ్ఇండియా, ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఇతర జట్లకంటే ముందే దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టాలని భావిస్తోంది. అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రొటీస్ జట్టుతో ఆరు వన్డేల సుదీర్ఘ సిరీస్ ఆడనుందని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం పేర్కొంది. జొహానెస్‌బర్గ్, కేప్‌టౌన్, సెంచూరియన్ వంటి ప్రధాన వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్‌పై బీసీసీఐ గానీ, క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) గానీ ఇప్పటివరకు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు.
2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్-ఎలో నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, జింబాబ్వేతో పాటు క్వాలిఫయర్-ఎ జట్టు ఉన్నాయి. మొత్తంగా చూస్తే వెస్టిండీస్ సిరీస్‌ను పక్కన పెట్టినా, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ప్రపంచకప్ సన్నాహకంగా కనీసం 18 వన్డేలు అందుబాటులో ఉంటాయి. విండీస్ పర్యటన కూడా తోడైతే మెన్ ఇన్ బ్లూ ఖాతాలో కనీసం 20 వన్డేలు చేరడం ఖాయం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


