భారత అమ్ములపొదిలోకి కే-4 క్షిపణి: సముద్ర గర్భం నుంచీ అణు దాడులు

బంగాళాఖాతంలో ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి 3,500 కి.మీ పరిధి గల కే-4 అణు క్షిపణిని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. చైనా నిఘా నౌకల కదలికల నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించిన ఈ ప్రయోగంతో భారత్ అణు త్రయం (Nuclear Triad) సామర్థ్యం మరింత బలోపేతమైంది.

Published on: Dec 25, 2025, 16:50:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత రక్షణ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల ‘కే-4’ (K-4) క్షిపణిని డీఆర్డీఓ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 23న బంగాళాఖాతంలో స్వదేశీ అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ (INS Arighaat) నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

భారత అమ్ములపొదిలోకి కే-4 క్షిపణి: సముద్ర గర్భం నుంచీ అణు దాడులు
భారత అమ్ములపొదిలోకి కే-4 క్షిపణి: సముద్ర గర్భం నుంచీ అణు దాడులు

అణు త్రయం దిశగా కీలక అడుగు

భూమి, ఆకాశం, సముద్రం.. ఈ మూడు మార్గాల నుంచి అణు దాడులను ఎదుర్కొనేలా ‘అణు త్రయం’ (Nuclear Triad) సామర్థ్యాన్ని సిద్ధం చేసుకోవడంలో భారత్ తుది దశకు చేరుకుంది. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ కే-4 క్షిపణులను మరికొన్ని పరీక్షల అనంతరం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC)కు అప్పగించనున్నారు.

చైనా నిఘా నౌకల కలకలం.. వ్యూహాత్మక ఆలస్యం

నిజానికి ఈ పరీక్ష డిసెంబర్ మొదటి వారంలోనే జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో బంగాళాఖాతానికి సమీపంలో చైనాకు చెందిన ‘ఓషన్ మినరల్ రీసెర్చ్’ నౌక సంచరిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మన క్షిపణి ప్రయోగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా పసిగట్టకుండా ఉండేందుకు, భారత భద్రతా దళాలు ఈ ప్రయోగాన్ని కొన్ని రోజులు వాయిదా వేశాయి. ఆ నౌక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే కే-4 గర్జన మొదలైంది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన పలు పరిశోధక నౌకలు, యుద్ధనౌకలు నిరంతరం నిఘా వేస్తూనే ఉండటం గమనార్హం.

భవిష్యత్ లక్ష్యం.. కే-5 క్షిపణులు

భారత్ తన అణు సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. అరిహంత్ క్లాస్ జలాంతర్గాముల్లో మూడవదైన ‘ఐఎన్ఎస్ అరిధమన్’ను 2026 ప్రారంభంలో నావికాదళంలో చేర్చనున్నారు. రాబోయే కాలంలో 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగిన ‘కే-5’ క్షిపణులను మోసుకెళ్లేలా 10,000 టన్నుల భారీ అణు జలాంతర్గాములను తయారు చేసేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

అణు జలాంతర్గాములే ఎందుకు కీలకం?

డీజిల్ జలాంతర్గాముల కంటే అణు ఇంధనంతో నడిచే అటాక్ సబ్ మెరైన్లు (SSNs) అత్యంత శక్తివంతమైనవి. ఇవి ఎక్కువ రోజులు నీటి లోపలే ఉండగలవు. శత్రువుల కంటికి చిక్కకుండా రహస్యంగా దాడులు చేయగలవు. "మేక్ ఇన్ ఇండియా"లో భాగంగా రెండు అణు సబ్ మెరైన్లను నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా నుంచి ‘అకులా’ క్లాస్ అణు జలాంతర్గామిని కూడా 2028 నాటికి భారత్ తీసుకోనుంది.

ప్రాంతీయ సవాళ్లు

అరేబియా సముద్రంలో పాకిస్థాన్‌కు చైనా, టర్కీలు అత్యాధునిక జలాంతర్గాములను, క్షిపణులను సరఫరా చేస్తున్నాయి. అటు హిందూ మహాసముద్రంలో చైనా తన విమానవాహక నౌకల సాయంతో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల సామర్థ్యం భారత్‌కు ఒక తిరుగులేని రక్షణ కవచంలా మారుతుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More