ఉద్యోగం మానేయమన్నందుకు విడాకులు: జంట మధ్య చిచ్చు రేపిన తల్లి అనారోగ్యం

స్కూలు రోజుల్లో మొదలైన ప్రేమ, సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుతమైన కెరీర్.. ఇద్దరు పిల్లలు, సొంత ఇల్లు.. అందరూ అసూయపడే ఆ బంధం ఒకే ఒక్క నిర్ణయంతో విడాకుల వరకు వెళ్లింది. అత్తగారి అనారోగ్యం నెపంతో ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి చేయడంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Feb 9, 2026, 15:41:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. కానీ, కష్టం వచ్చినప్పుడు ఆ బాధ్యత కేవలం భార్యదే కావాలని, ఆమె తన కెరీర్‌ను త్యాగం చేయాలని భర్త కోరడం ఒక నిండు సంసారంలో విడాకుల చిచ్చు పెట్టింది. ఎక్స్‌ (X) వేదికగా వైరల్ అవుతున్న ఈ కథనం ఇప్పుడు భారతీయ కుటుంబ వ్యవస్థలో లింగ వివక్ష, మహిళా స్వయంప్రతిపత్తిపై పెద్ద చర్చకు దారితీసింది.

ఉద్యోగం మానేయమన్నందుకు విడాకులు: జంట మధ్య చిచ్చు రేపిన తల్లి అనారోగ్యం (Picture credit: Freepik)
ఉద్యోగం మానేయమన్నందుకు విడాకులు: జంట మధ్య చిచ్చు రేపిన తల్లి అనారోగ్యం (Picture credit: Freepik)

స్కూలు ప్రేమ నుంచి సాఫ్ట్‌వేర్ పవర్ కపుల్ వరకు..

ఈ కథనంలోని దంపతులు స్కూలు రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి బీటెక్ పూర్తి చేసి, టెక్ మహీంద్రాలో ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత కెరీర్‌లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పెళ్లి చేసుకుని, సొంతంగా ఇల్లు కొనుక్కుని, ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ మహిళ ఎంత కష్టపడేదంటే, తన రెండో కాన్పు సమయంలో కూడా 9వ నెల వరకు ఆఫీసుకి వెళ్లేదని ఆమె స్నేహితురాలు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త కంటే ఎక్కువ జీతం సంపాదిస్తోంది.

వివాదానికి కారణమైన అత్తగారి అనారోగ్యం

అంతా సాఫీగా సాగుతున్న సమయంలో, భర్త తల్లి అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను చూసుకోవడానికి భార్య ఉద్యోగం మానేయాలని భర్త పట్టుబట్టాడు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తన కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు ఉద్యోగం వదలడం ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. దానికి బదులుగా ఆమె కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది.

"నేను ఇల్లు గడుపుతాను, ఆర్థిక బాధ్యతలు చూసుకుంటాను.. నువ్వు కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని మీ అమ్మను చూసుకో" అని భర్తకు ఆఫర్ ఇచ్చింది.

తన తల్లిని పిలిపించి పిల్లలను, ఇంటిని చూసుకునేలా ఏర్పాటు చేస్తానని చెప్పింది.

వివాదం పెద్దదిగా మారింది..

అయితే, భార్య సూచించిన ఏ ఒక్క ప్రతిపాదనను భర్త గానీ, అత్తగారు గానీ అంగీకరించలేదు. కోడలి తల్లి తన ఇంట్లో ఉండటం అత్తగారికి ఇష్టం లేదు. అది తన కొడుకు ఇల్లు అని ఆమె వాదన. వాస్తవానికి ఆ ఇల్లు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తమ కష్టార్జితంతో కొనుక్కున్నది. అత్తగారిని చూసుకోవడం కేవలం కోడలి బాధ్యత మాత్రమేనని, అందుకోసం ఉద్యోగం వదలాల్సిందేనని భర్త భీష్మించుక కూర్చున్నాడు.

వైరల్ అవుతున్న భావోద్వేగ పోస్ట్

“విషయం తమకు అనుకూలంగా జరగకపోవడంతో, వారు ఆమెను మానసిక వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు” అని ఆ స్నేహితురాలు తన పోస్ట్‌లో ఆరోపించారు. భర్త వేధింపులు భరించలేక ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లితో కలిసి ఉండాలని ఉంటే అత్తగారు తమ ఇంటికి రావచ్చని కూడా ఆమె కోరింది. కానీ, దానికి బదులుగా భర్త విడాకుల నోటీసు పంపాడు. చివరకు ఆమె కూడా విడాకులకు దరఖాస్తు చేసింది.

నెటిజన్ల ఆగ్రహం: లింగ వివక్షపై చర్చ

ఈ ఉదంతంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

“మహిళ ఎంత సంపాదించినా, ఎంత ప్రేమించినా, ఎంత త్యాగం చేసినా.. తను సొంత నిర్ణయం తీసుకున్న మరుక్షణమే ఆమెను పనికిరాని దానిలా చూసే పితృస్వామ్య వ్యవస్థ ఇది” అని ఒకరు వ్యాఖ్యానించారు.

మరికొందరు స్పందిస్తూ.. "కొడుకులకు తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదా? కేవలం ఆడపిల్లలే తమ కెరీర్‌ను ఎందుకు వదులుకోవాలి?" అని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక స్వతంత్రత ఉన్న మహిళలు ఇలాంటి వేధింపులను భరించాల్సిన అవసరం లేదని మెజారిటీ నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Indian Couple Divorce, Gender Roles in Marriage, Working Women Rights, Emotional Abuse in Marriage, Workplace Equality Ind

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More