అమెరికాలో కాల్పుల కలకలం- భారత మహిళ సహా నలుగురు మృతి! ప్రాణాలు దక్కించుకున్న చిన్నారులు..

అమెరికాలోని అట్లాంటాలో చోటుచేసుకున్న కుటుంబ కలహాలు పెను విషాదానికి దారితీశాయి. ఓ భారతీయుడు జరిపిన కాల్పుల్లో అతని భార్య సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల సమయంలో ఇంట్లోనే ఉన్న ముగ్గురు చిన్నారులు ప్రాణ భయంతో అల్మారాలో దాక్కున్నారు.

Published on: Jan 24, 2026, 12:20:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలోని అట్లాంటా నగరంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మొదలైన గొడవ నలుగురి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ కాల్పుల్లో మరణించిన వారిలో ఒక భారత మహిళ కూడా ఉన్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి.

అట్లాంటాలో కాల్పుల కలకలం.. (X/@GwinnettPd)
అట్లాంటాలో కాల్పుల కలకలం.. (X/@GwinnettPd)

అసలేం జరిగింది?

అట్లాంటా లారెన్స్‌విల్లేలోని గ్వినెట్ కౌంటీ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. 51 ఏళ్ల విజయ్ కుమార్, తన భార్య మీము డోగ్రా (43)తో కలిసి బ్రూక్ ఐవీ కోర్ట్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. వీరితో పాటు వారి 12 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ భార్యాభర్తల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆవేశంలో విజయ్ కుమార్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో నిందితుడి భార్య మీము డోగ్రాతో పాటు గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీష్ చందర్ (38) అక్కడికక్కడే మరణించారు.

"కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటన మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. మృతుల్లో ఒక ఇండియన్​ కూడా ఉన్నారు. బాధిత కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాము," అని భారత కాన్సులేట్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.

ప్రాణాల కోసం అల్మారాలో దాక్కున్న పిల్లలు

ఈ రక్తపాతం జరుగుతున్న సమయంలో ఇంట్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కాల్పుల శబ్దం వినగానే భయంతో వణికిపోయిన ఆ చిన్నారులు, ప్రాణాలను కాపాడుకోవడానికి బెడ్రూమ్‌లోని అల్మారాలో దాక్కున్నారు. అందులో ఒక ధైర్యవంతుడైన చిన్నారి 911కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి నలుగురు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండగా, ఆ పిల్లలు అల్మారాలో బిక్కుబిక్కుమంటూ కనిపించారు.

నిందితుడి అరెస్టు..

కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు విజయ్ కుమార్‌ను ఘటనా స్థలానికి సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ కుమార్‌పై హత్య కేసులతో పాటు, తీవ్రమైన దాడి, చిన్నారులను హింసించినందుకు గాను కేసులు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ దారుణానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో అట్లాంటాలోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నపిల్లలు కళ్లముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి ఎంతటి ఆవేదనకు గురై ఉంటారోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More