Jio IPO : జియో ఐపీఓకి లైన్ క్లియర్- దేశంలోనే అతిపెద్ద ఇష్యూ వచ్చేది ఎప్పుడు?

Jio IPO date : దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదించిన రూ. 37,700 కోట్ల మెగా ఐపీఓకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ జియో ఐపీఓకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 31, 2026, 09:59:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రిలయన్స్ గ్రూప్ డిజిటల్ విభాగానికి చెందిన 'జియో ప్లాట్‌ఫామ్స్'.. స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. కంపెనీ ప్రతిపాదించిన రూ. 37,700 కోట్ల భారీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కి సంబంధించి.. మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' తుది ఆమోదపత్రాన్ని (అబ్జర్వేషన్ లెటర్) జారీ చేసింది. 2026 సంవత్సరం ముగిసేలోగా ఈ ఐపీఓ ప్రాథమిక మార్కెట్‌ను తాకనుంది! భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఐపీఓగా నిలవనుంది.

రిలయన్స్ జియో ఐపీఓ అప్డేట్స్.. (Reuters)
రిలయన్స్ జియో ఐపీఓ అప్డేట్స్.. (Reuters)

ఈ ఏడాది జూన్ 19న జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ ఐపీఓపై కీలక ప్రకటన చేశారు. బోర్డు ఆమోదం అనంతరం అదే రోజు సెబీకి డ్రాఫ్ట్ పత్రాలను (డీఆర్​హెచ్​పీ) సమర్పించారు. పరిశీలన పూర్తయిన అనంతరం ఆగస్టు 28న సెబీ నుంచి అనుమతి వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ)లకు అధికారికంగా సమాచారం అందించింది.

ఆ రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం!

జియో ప్లాట్‌ఫామ్స్ తీసుకువస్తున్న ఈ రూ. 37,700 కోట్ల ఐపీఓ.. ఇప్పటివరకు మన దేశంలో వచ్చిన అతిపెద్ద ఐపీఓల రికార్డులను తిరగరాయనుంది. 2024 అక్టోబర్‌లో వచ్చిన హుందాయ్ మోటార్ ఇండియా (రూ. 27,870 కోట్లు), 2022 మేలో వచ్చిన ఎల్‌ఐసీ (రూ. 20,557 కోట్లు) ఐపీఓలను దాటి ఇది మొదటి స్థానంలో నిలుస్తుంది. అంతేకాకుండా ఎన్‌ఎస్‌ఈ త్వరలో తీసుకురాబోతున్న రూ. 30,000 కోట్ల ఐపీఓ కంటే కూడా ఇది చాలా పెద్దది కావడం విశేషం.

పూర్తిగా కొత్త షేర్ల జారీనే.. నిధులు దేనికి వాడతారు?

సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం.. ఈ ఐపీఓలో ఎటువంటి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) భాగం లేదు. అంటే జియో ఐపీఓలో భాగంగా ప్రస్తుత వాటాదారులు ఎవరూ తమ షేర్లను విక్రయించడం లేదు. కంపెనీ పూర్తిగా 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను ప్రధానంగా తమ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్​కున్న పాత అప్పులను తీర్చడానికి, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నారు.

త్వరలోనే జియో ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్, ఐపీఓ ప్రారంభ తేదీలను ప్రకటించనున్నారు.

రూ. 11 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్

ప్రసిద్ధ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలు మోర్గాన్ స్టాన్లీ, సిటీ రీసెర్చ్.. జియో ప్లాట్‌ఫామ్స్ విలువను దాదాపు 133 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 11.15 లక్షల కోట్లు) అంచనా వేశాయి. ఇది 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎబిట్​డా అంచనాలకు 13 రెట్లు ఎక్కువ.

ఇక ఆర్థిక పనితీరు విషయానికి వస్తే, 2027 తొలి త్రైమాసికంలో జియో ప్లాట్‌ఫామ్స్ 9.2 శాతం వృద్ధితో రూ. 7,764 కోట్ల నికర లాభాన్ని గడించింది. నిర్వహణ ఆదాయం 11.8 శాతం పెరిగి రూ. 39,173 కోట్లకు చేరింది.

ప్రధాన వాటాదారులు వీరే..

ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 66.43 శాతం మెజారిటీ వాటా ఉంది. ప్రముఖ డిజిటల్ దిగ్గజాలు మెటా (జాధూ హోల్డింగ్స్ ద్వారా) 9.98 శాతం, గూగుల్ ఇంటర్నేషనల్ 7.73 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఐపీఓకి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తోంది.

ఈ జియో ఐపీఓ రాకతో భారత స్టాక్ మార్కెట్లో నూతన ఉత్తేజం రావడం ఖాయంగా కనిపిస్తోంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More