Jio IPO : దేశంలోనే అతిపెద్ద ఐపీఓకి రిలయన్స్ జియో సన్నద్ధం- సెబీ చేతికి డాక్యుమెంట్లు..

Jio IPO date : భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓకి రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్స్ సిద్ధమైంది. సుమారు రూ. 37,700 కోట్లు సేకరించడమే లక్ష్యంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి జియో డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించింది. అందులోని ముఖ్యమైన వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 20, 2026, 06:43:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ డిజిటల్ సేవల విభాగం ‘జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్’ సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశం ఉన్న తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం జియో ప్లాట్‌ఫారమ్స్ శుక్రవారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రోస్పెక్టస్ (డీఆర్​హెచ్​పీ) సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు రూ. 37,700 కోట్లు సేకరించాలని యోచిస్తున్నట్లు మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

జియో ఐపీఓ డీఆర్​హెచ్​పీలోని ముఖ్యమైన విషయాలు.. (REUTERS)
జియో ఐపీఓ డీఆర్​హెచ్​పీలోని ముఖ్యమైన విషయాలు.. (REUTERS)

ఈ పబ్లిక్ ఆఫర్ కింద జియో ప్లాట్‌ఫారమ్స్ 27 కోట్ల వరకు సరికొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇది ఐపీఓ తర్వాత కంపెనీకి ఉండే మొత్తం పెయిడ్-అప్ ఈక్విటీ క్యాపిటల్‌లో దాదాపు 2.9 శాతానికి సమానం. సెబీ నిబంధనల ప్రకారం బుక్-బిల్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ షేర్ల ధరను నిర్ణయిస్తారు. రిలయన్స్ గ్రూప్ నుంచి గత రెండు దశాబ్దాల్లో వస్తున్న మొదటి పబ్లిక్ ఆఫరింగ్ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా, ఈ గ్రూప్‌నకు చెందిన ఒక కన్స్యూమర్ బిజినెస్ (వినియోగదారులతో నేరుగా ముడిపడి ఉన్న వ్యాపారం) స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కాబోతుండటం కూడా ఇదే తొలిసారి!

టెలికాం రంగానికి అతీతంగా బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ, ఏఐ ఆధారిత వృద్ధి ప్రణాళికలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల వరకు జియో ప్లాట్‌ఫారమ్స్ తన డీఆర్‌హెచ్‌పీలో పేర్కొన్న 10 అత్యంత కీలకమైన అంశాలు ఇన్వెస్టర్ల కోసం ఇక్కడ ఉన్నాయి..

1. కంపెనీ నేపథ్యం, ప్రస్థానం..

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జియో ప్లాట్‌ఫారమ్స్ అనుబంధ సంస్థ. 2016లో ఉచిత వాయిస్ కాల్స్, అత్యంత చౌకైన డేటా ప్లాన్లతో అడుగుపెట్టిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భారతదేశంలో 4జీ VoLTE కనెక్టివిటీని పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చిన మొదటి ఆపరేటర్ జియోనే. వాణిజ్యపరంగా సేవలు ప్రారంభించిన 180 రోజుల్లోనే 10 కోట్ల మంది 4జీ కస్టమర్లను సొంతం చేసుకుని జియో సరికొత్త రికార్డు సృష్టించింది.

2. కేవలం టెలికాం మాత్రమే కాదు.. ఇదొక డిజిటల్ పవర్‌హౌస్!

ఐపీఓకి వస్తున్న జియో ఇప్పుడు కేవలం ఒక టెలికాం కంపెనీ మాత్రమే కాదు. కనెక్టివిటీ, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ కంటెంట్, క్లౌడ్ సర్వీసెస్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మరికొన్ని సరికొత్త సాంకేతికతలతో కూడిన ఒక విభిన్నమైన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను నిర్మించినట్లు కంపెనీ తన డ్రాఫ్ట్ పేపర్లలో స్పష్టం చేసింది. భారతదేశ డిజిటల్ పరివర్తనను నడిపించేందుకు దేశవ్యాప్త మౌలిక సదుపాయాలు తమకు ఉన్నాయని పేర్కొంది.

3. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థే ప్రధాన వృద్ధి చోదకం..

దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకానమీనే జియో తన ప్రధాన వృద్ధి అవకాశంగా చూస్తోంది. ప్రస్తుతం సుమారు రూ. 49.6 లక్షల కోట్లుగా ఉన్న భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2031 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 125.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఒక పరిశ్రమ నివేదికను జియో ఉదహరించింది. దేశం సాధించే మొత్తం జీవీఏలో దీని వాటా దాదాపు 22 శాతంగా ఉండబోతోంది. ఈ వృద్ధికి జియోనే పునాదిగా నిలవనుందని కంపెనీ నమ్ముతోంది.

4. గూగుల్, మెటాల వ్యూహాత్మక భాగస్వామ్యం

జియో ప్లాట్‌ఫారమ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అత్యధికంగా 66.43 శాతం వాటా ఉంది. కాగా, సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన జాదూ హోల్డింగ్స్ 9.98 శాతం వాటాను, గూగుల్ ఇంటర్నేషనల్ 7.73 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2020లో జియో ప్లాట్‌ఫారమ్స్ 13 మంది అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 33 శాతం ఈక్విటీ వాటాను విక్రయించి 20.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. మెటా, గూగుల్ సంస్థలకు కలిపి ఇందులో దాదాపు 18 శాతం వాటా ఉండటం కంపెనీ వ్యూహాత్మక బలాన్ని తెలియజేస్తోంది.

5. 2జీ నుంచి 4జీ/ 5జీకి మారుతున్న కస్టమర్లు..

భారతదేశంలో ఇప్పటికీ 26.35 కోట్ల మంది పౌరులు 2జీ నెట్‌వర్క్‌లను వాడుతున్నారు. వీరంతా రాబోయే రోజుల్లో 4జీ లేదా 5జీ కనెక్టివిటీకి మారడం వల్ల తమ కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుందని జియో భావిస్తోంది. అలాగే ప్రస్తుతం తమకున్న 52.44 కోట్ల మంది కస్టమర్ బేస్ ద్వారా ఇతర డిజిటల్ సేవలను క్రాస్-సెల్లింగ్ (అదనపు సేవలను విక్రయించడం) చేయడానికి మరియు గృహాలలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని పెంచడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

6. టారిఫ్ పెంపు.. ప్రధాన ముప్పు!

కంపెనీ భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్లను కూడా ఈ జియో ఐపీఓ డీఆర్‌హెచ్‌పీలో నిజాయితీగా అంగీకరించింది. గతంలో టారిఫ్ (రీఛార్జ్ ధరలు) పెంపుదల, కస్టమర్ల అప్‌గ్రేడ్ల వల్ల ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్​పూ) పెరిగినప్పటికీ, భవిష్యత్తులో ధరలను పెంచడం అంత సులభం కాకపోవచ్చని జియో తెలిపింది. ధరల పెంపుదలపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడం, మార్కెట్లో పోటీదారులు ధరలను తగ్గించడం లేదా రెగ్యులేటరీ నిబంధనలు వంటివి భవిష్యత్తు ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది.

7. రిలయన్స్ రిటైల్‌పై ఆధారపడటం..

జియో ప్రీపెయిడ్ సేవల పంపిణీలో ‘రిలయన్స్ రిటైల్’ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జియోకు వచ్చే మొత్తం ఆదాయంలో దాదాపు 77 శాతం వాటా రిలయన్స్ రిటైల్ నెట్‌వర్క్ ద్వారా పంపిణీ అయ్యే ప్రీపెయిడ్ సేవల నుంచే వస్తోంది. ఒకవేళ ఈ పంపిణీ వ్యవస్థలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే అది వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని జియో వెల్లడించింది.

8. ఏఐ వ్యాపారంలో ఉన్న సవాళ్లు..

జియో తన భవిష్యత్తు వృద్ధి కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని భారీగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ, ఇందులో కొన్ని వ్యాపారపరమైన రిస్క్‌లు ఉన్నట్లు అంగీకరించింది. ఏఐ అవుట్‌పుట్లలో లోపాలు, మారుతున్న ప్రభుత్వ నిబంధనలు, ఏఐ నిబంధనల అమలుకు అయ్యే ఖర్చులు, మౌలిక సదుపాయాల అవసరాలు, ఈ రంగంలో టాలెంట్ ఉన్న నిపుణుల కోసం మార్కెట్లో ఉన్న విపరీతమైన పోటీ వంటి వాటిని సవాళ్లుగా పేర్కొంది.

9. దూసుకుపోతున్న ఎయిర్‌ఫైబర్ బిజినెస్..

జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ ద్వారా జియో తన ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారాన్ని అత్యంత వేగంగా విస్తరించింది. 27.1 కోట్ల మంది చందాదారులతో భారతదేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థగా అవతరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో యాడ్ అయిన మొత్తం కొత్త కస్టమర్లలో దాదాపు 68 శాతం మంది జియోనే ఎంచుకున్నారు. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, వృద్ధికి మరిన్ని అవకాశాలు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

10. తిరుగులేని ఆర్థిక, నిర్వహణ పనితీరు..

గత ఆర్థిక సంవత్సరంలో జియో ఆపరేటింగ్ మెట్రిక్స్ మరింత బలోపేతం అయ్యాయి. కంపెనీ కస్టమర్ల సంఖ్య 48.82 కోట్ల నుంచి 52.44 కోట్లకు చేరింది. ఏడాది కాలంలోనే నికరంగా 3.62 కోట్ల మంది కొత్త కస్టమర్లు చేరారు. అలాగే ఆర్​పూ రూ. 214కి మెరుగైంది. డిజిటల్ వినియోగం పెరగడంతో ప్రతి యూజర్ నెలకు సగటున 42.3 జీబీ డేటాను వాడుతున్నారు. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే రాబడి రూ. 1.47 లక్షల కోట్లుగా నమోదు కాగా, ఎబిట్​డా రూ. 76,255 కోట్లుగా ఉంది. పరిశ్రమలోనే అత్యధికంగా 51.9 శాతం ఎబిట్​డా మార్జిన్‌ను జియో సాధించింది.

ఈ డీఆర్​హెచ్​​పీని సెబీ ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాతే.. జియో ఐపీఓ లాంచ్​ డేట్, ప్రైజ్ బ్యాండ్, లిస్టింగ్ డేట్​ వంటి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More