NSE IPO : భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ! సెబీ చేతికి ఎన్​ఎస్​ఈ పత్రాలు..

NSE IPO DRHP : భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓకు అడుగు పడింది! నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ పబ్లిక్ ఇష్యూ కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించింది. రూ. 5 లక్షల కోట్ల భారీ వ్యాల్యుయేషన్‌తో ఈ ఐపీఓ రానుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Jun 18, 2026, 08:43:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ మూలధన మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కావడానికి సర్వం సిద్ధమైంది! దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్​ఛేంజ్ అయిన 'నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎన్​ఎస్​ఈ) తన ఐపీఓ ప్రక్రియలో భాగంగా.. బుధవారం రాత్రి మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’కి డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్​హెచ్​పీ) సమర్పించింది. ఇది భారతదేశంలోనే అత్యంత భారీ ఐపీఓగా అవతరించబోతోంది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ వివరాలు..
ఎన్​ఎస్​ఈ ఐపీఓ వివరాలు..

సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం.. ఈ ఐనీషియల్ పబ్లిక్​ ఆఫరింగ్ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) పద్ధతిలో రానుంది. అంటే ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వాటాలు కలిగి ఉన్న సంస్థాగత పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న దాదాపు 14.9 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. దీని ద్వారా ఎన్‌ఎస్‌ఈ పెయిడ్-అప్ క్యాపిటల్‌లో మొత్తం 6 శాతం వాటాను కొత్త ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎక్స్​ఛేంజ్ ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. కాబట్టి ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ పూర్తిగా వాటాలను విక్రయిస్తున్న పాత పెట్టుబడిదారులకే చెందుతాయి.

వాటాలు అమ్ముతున్నది ఎవరు? ఎవరు ఉంచుకుంటున్నారు?

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలో భాగంగా తమ వాటాలను విక్రయిస్తున్న ప్రముఖ సంస్థలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (సీపీపీఐబీ), మోర్గాన్ స్టాన్లీ అనుబంధ సంస్థలు, టెమాసెక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ది న్యూ ఇండియా అస్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి.

వీరిలో అత్యధికంగా ఎస్‌బీఐ గరిష్టంగా 2.47 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. మోర్గాన్ స్టాన్లీకి చెందిన 'ఎమ్‌ఎస్ స్ట్రాటజిక్ (మారిషస్) లిమిటెడ్' 1.6 కోట్ల షేర్లను, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ 1.18 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచాయి. టెమాసెక్ అనుబంధ సంస్థ 'అరండ ఇన్వెస్ట్‌మెంట్స్' 1.12 కోట్ల షేర్లను విక్రయిస్తుండగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, జీఐసీ రీ, న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థలు ఒక్కొక్కటి దాదాపు 1.1 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు చెరో 60 లక్షల షేర్లను విక్రయానికి పెట్టాయి.

మరోవైపు, ఎన్‌ఎస్‌ఈలో 10.72 శాతం వాటాతో సింగిల్ లార్జెస్ట్ షేర్ హోల్డర్‌గా ఉన్న ప్రభుత్వ బీమా దిగ్గజం 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (ఎల్​ఐసీ) మాత్రం తన వాటాను విక్రయించడం లేదు, అలాగే కొనసాగించనుంది. ఎల్‌ఐసీ తన వాటాను అలాగే ఉంచుకుంటుందని ముందే మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. వీరితో పాటు 2.35 శాతం వాటా ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, 1.58 శాతం వాటా ఉన్న ప్రముఖ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ కూడా ఈ ఐపీఓలో తమ షేర్లను విక్రయించడం లేదని నివేదిక స్పష్టం చేసింది.

ప్రస్తుత మార్కెట్ నిబంధనల ప్రకారం.. భారతదేశంలో ఒక స్టాక్ ఎక్స్​ఛేంజ్ తన సొంత ప్లాట్‌ఫారమ్‌లో షేర్లను లిస్ట్ చేసుకోవడానికి వీల్లేదు. అందువల్ల ఎన్‌ఎస్‌ఈ తన ప్రత్యర్థి సంస్థ అయిన బీఎస్‌ఈ ప్లాట్‌ఫారమ్‌పై లిస్ట్ కానుంది. ఈ భారీ పబ్లిక్ ఇష్యూను నిర్వహించడానికి 20 మంది ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో కూడిన సిండికేట్‌ను ఏర్పాటు చేయగా.. అందులో కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీలు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఐపీఓ సైజ్.. వ్యాల్యుయేషన్ ఎంత?

ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ షేరు ధర కనీసం రూ. 2,000 పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే, ఐపీఓ సమయానికి ఎన్‌ఎస్‌ఈ మొత్తం మార్కెట్ వ్యాల్యుయేషన్ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు (సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా) దాటుతుందని అంచనా. ఈ ప్రైజ్ పాయింట్ వద్ద గనుక ఐపీఓ వస్తే.. ఇది దేశంలోనే అత్యంత భారీ పబ్లిక్ ఆఫరింగ్‌గా రికార్డు సృష్టిస్తుంది. గతంలో రికార్డు సృష్టించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (రూ. 27,859 కోట్లు), ఎల్‌ఐసీ (రూ. 20,557 కోట్లు) ఐపీఓలను ఇది చాలా వెనక్కి నెట్టేయనుంది.

"ప్రపంచవ్యాప్తంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ బిజినెస్ అనేది చాలా ప్రత్యేకమైనది, అత్యంత స్థిరమైన మార్కెట్ మౌలిక సదుపాయాల వ్యాపారం. ఎన్‌ఎస్‌ఈ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ మార్కెట్లోకి రావడం వల్ల సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా దేశంలోని అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం పొందే అవకాశం లభిస్తుంది" అని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ ఠక్కర్ అభిప్రాయపడ్డారు.

నిజానికి ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్ ప్రణాళిక దశాబ్ద కాలం నాటిది! ఎన్‌ఎస్‌ఈ మొదటిసారిగా 2016లోనే ఐపీఓ పేపర్లను ఫైల్ చేసింది. అయితే ఆ తర్వాత 'కో-లొకేషన్' స్కామ్‌లో చిక్కుకోవడం, కొందరు బ్రోకర్లకు సర్వర్లను ముందే యాక్సెస్ చేసుకునేలా అక్రమ సదుపాయం కల్పించారనే ఆరోపణలు రావడంతో ఆ వివాదం సాగదీస్తూ వచ్చింది. లీడర్‌షిప్ మార్పులు, చట్టపరమైన ఇబ్బందుల వల్ల అప్పట్లో ఐపీఓ పక్కన పడింది. చివరకు 2026 జనవరిలో కొత్త మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో సెబీతో రూ. 1,300 కోట్ల సెటిల్‌మెంట్ (కాంపౌండింగ్) చేసుకున్న తర్వాత, ఐపీఓ పేపర్లు మళ్లీ ఫైల్ చేయడానికి ఎన్‌ఎస్‌ఈకి లైన్ క్లియర్ అయింది.

ప్రస్తుత నియంత్రణ చట్టాల ప్రకారం.. స్టాక్ ఎక్స్​ఛేంజ్‌లో షేర్ హోల్డింగ్ నిర్మాణం విభిన్నంగా ఉండాలి. సెబీ ముందస్తు అనుమతి లేకుండా ఏ ఒక్క విదేశీ లేదా దేశీయ సంస్థ కూడా ఎక్స్​ఛేజ్‌లో 5 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండటానికి వీల్లేదు. అయితే కమర్షియల్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల వంటి నిర్దిష్ట కేటగిరీ సంస్థలు మాత్రం 15 శాతం వరకు వాటాను కలిగి ఉండవచ్చు.

ఎన్‌ఎస్‌ఈ ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయి?

మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎన్‌ఎస్‌ఈ నేరుగా బీఎస్‌ఈతో పోటీ పడనుంది. బీఎస్‌ఈ 2017లోనే దేశంలో మొదటి లిస్టెడ్ స్టాక్ ఎక్స్​ఛేంజ్​గా అవతరించింది. గత 12 నెలల్లో బీఎస్‌ఈ షేర్లు 50 శాతానికి పైగా లాభపడ్డాయి, ప్రస్తుతం 70.45 ప్రైజ్-టు-ఎర్నింగ్స్ మల్టిపుల్‌తో ట్రేడవుతున్నాయి. అయితే బుధవారం మార్కెట్​లో బీఎస్‌ఈ షేరు ఎన్‌ఎస్‌ఈ ప్లాట్‌ఫారమ్‌పై 3.81% నష్టపోగా, నిఫ్టీ సూచీ 0.4% లాభపడింది.

ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే.. 2026 ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్​వై26) ఎన్‌ఎస్‌ఈ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3% తగ్గగా, లాభం 15% క్షీణించింది. గతేడాది ఆదాయం రూ. 17,141 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 16,601 కోట్లకు పడిపోయింది. అలాగే నికర లాభం కూడా రూ. 10,302 కోట్లకు పరిమితమైంది. ఎక్స్​ఛేంజ్ లావాదేవీల ఛార్జీలు, క్లియరింగ్, సెటిల్‌మెంట్ సేవల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం వల్లే ఓవరాల్ రెవెన్యూ తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ట్రాన్సాక్షన్ ఛార్జీల ఆదాయం 4శాతం తగ్గి రూ. 13,057 కోట్లుగా నమోదు కాగా, క్లియరింగ్ అండ్ సెటిల్‌మెంట్ ఆదాయం 22% తగ్గి రూ. 251 కోట్లకు పడిపోయింది.

లిస్టింగ్‌కు ఎంత సమయం పడుతుంది?

ఎన్‌ఎస్‌ఈ సమర్పించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను సెబీ పూర్తిస్థాయిలో పరిశీలించి తన తుది పరిశీలనలను వెల్లడిస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియకు 30 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. సెబీ ఆమోదం లభించిన తర్వాత, ఎక్స్​ఛేంజ్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద ఫైనల్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసి, ఐపీఓ ప్రైస్ బ్యాండ్, బిడ్డింగ్ తేదీలను ఖరారు చేస్తుంది.

అయితే ఎన్‌ఎస్‌ఈ డాక్యుమెంట్ల పరిశీలనకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు!

“సాధారణంగా అన్ని క్లారిఫికేషన్లు, ఎక్స్​ఛేంజ్ అనుమతులు వచ్చిన 30 రోజుల్లో సెబీ తన అబ్జర్వేషన్ ఇస్తుంది. కానీ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పరిశీలన అంత సులభంగా ముగిసేలా లేదు. దీనికి ఉన్న పాత రెగ్యులేటరీ వివాదాల నేపథ్యం, ఇది దేశ మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థ కావడం, పైగా భారీ సైజులో వస్తున్న ఆఫర్ ఫర్ సేల్ కావడంతో సెబీ ఆమోద ముద్ర వేయడానికి ఖచ్చితంగా ఎక్కువ సమయం తీసుకుంటుంది,” అని ప్రముఖ లా ఫర్మ్ 'సింఘానియా అండ్ కో' మేనేజింగ్ పార్టనర్ రోహిత్ జైన్ వివరించారు.

2026లో రాబోతున్న భారీ ఐపీఓల పరంపరలో ఎన్‌ఎస్‌ఈ ఒకటి మాత్రమే. మున్ముందు రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్స్, ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్, జెప్టో వంటి దిగ్గజ సంస్థల ఐపీఓలు కూడా క్యూలో ఉన్నాయి.

అంతకుముందు 2025లో భారత ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఏకంగా 371 కంపెనీలు మార్కెట్లోకి వచ్చి రూ. 1.75 లక్షల కోట్లకు పైగా నిధులను సేకరించాయి. ముఖ్యంగా హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ వంటి భారీ ఐపీఓలు గత ఏడాది మార్కెట్‌కు భారీ ఊపునిచ్చాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More